చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులి వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మసాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి సూర్యుణ్ణి ఆరాధిస్తారు.
చలికాలం చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. ‘రథసప్తమి’ పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్తకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూష, పర్జన్య, అంశుమాన్, ఖగ, త్వష్ట, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయం అవుతాయని, దారిద్య్రం తొలగుతుందనీ భవిష్య పురాణం చెబుతోంది.
ఈ ‘రథ సప్తమి’ రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెద శేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగ గా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు. అరసవెల్లిలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.
రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి.
స్నానానంతరం.. సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి.
ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వులపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతంతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు లభిస్తాయని శాస్త్రప్రబోధం.
– పూర్ణిమా స్వాతి
చదవండి: ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు?
ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం
Comments
Please login to add a commentAdd a comment