
అధునాతనమైన ఈ జీవనసరళిలో అంతకంతకూ వేగం పెరిగిపోతోంది... విలువలు, ప్రమాణాలు తరిగిపోతున్నాయి. సాంకేతికంగా ఈ వేళ మనిషి దేవతలు కూడా ఈర్ష్య పడేంతటి విజయాలను సాధించాడు. కాని విచారకరమైన విషయం ఏమంటే – భూమిమీద మాత్రం బతకలేకపోతున్నాడు. అంటే మనిషికి ఏది సహజమో – అదే సాధ్యం కావడం లేదు. అసహజమైన లేదా, తనది కాని జీవన విధానానికి మనిషి సిద్ధపడినప్పుడు ఘర్షణ తప్పదు. ఫలితంగా, ఈ భూమిమీద ప్రశాంతంగా బతకడం దుర్భరం అయిపోతోంది. దానికోసం ఎంతో ఒత్తిడికి, మనో సంఘర్షణకు గురికావలసి వస్తోంది. ఫలితంగా మనిషి రకరకాల మానసిక వ్యాధుల బారిన పడుతుండటం... ఆరోగ్యానికి దూరం కావడం, సాధారణమైన సుఖ సంతోషాలకు కూడా ఆనందానికి నోచుకోలేకపోవడం పరిపాటిగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో మనం తరతరాలుగా మనలో జీర్ణమైన కొన్ని చాదస్తాలను, మూఢనమ్మకాలను మనిషి విడిచిపెట్టవలసి ఉంది. దాంతోపాటు తన ప్రవర్తనలోని ఎన్నో లోపాలను మనిషి చక్కదిద్దుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. అంతేకాదు, సమాజానికి పనికొచ్చే విధంగా తనను తాను కొత్తగా రూపొందించుకోవలసి ఉంది. దీనికోసమే వ్యక్తిత్వ వికాస శిక్షణ!
మానసిక ఒత్తిడిని జయించడం, సంభాషణాకళను అభివృద్ధిపరచుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం, ఆలోచనలో అభివృద్ధికరమైన వాటికి ఎక్కువగా చోటుకల్పించడం, వ్యతిరేక ఆలోచనలకు దూరం కావడం, సానుకూల దృక్పథాన్ని సాధించడం, ఆత్మన్యూనతాభావాన్ని జయించడం వంటి ఎన్నో అంశాలలో ప్రగతి సాధించాలి. అయితే, దురదృష్టవశాత్తూ మన ప్రగతికి ఉపకరించే వ్యక్తిత్వ వికాస పాఠ్యాంశాలను మనం పాశ్చాత్య గ్రంథాల నుండే తీసుకుంటున్నాం. ప్రపంచానికంతటికీ మార్గదర్శకంగా నిలిచిన మన ప్రాచీన రుషుల ప్రసిద్ధ వాఙ్మయంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను విస్మరిస్తున్నాం. పాశ్చాత్య ఆలోచనా తీరుల కన్నా గొప్పవీ, మానవీయ విలువలను ప్రతిబింబించేవీ అయిన భారతీయమైన విధానాలు చాలా ఉన్నాయి. మన భగవద్గీత, మన రామాయణం, మన భారతం... వీటికి మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఈ లోకంలో లేనేలేవు. ఈ విషయం కూడా మనం పాశ్చాత్యుల నుంచే తెలుసుకోవలసి రావడం మరింత విచారకరం! పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతకు ఇంతకన్నా రుజువు ఏముంది?