భారతీయ సంస్కృతిలో – ‘రంజకత్వం కోసం పాట పాడుతున్నాను’... అనరు. నాదోపాసన చేస్తున్నాను... అంటారు. అంటే సమస్త శబ్దం ఎక్కడు పుడుతుందో దానిని నాదం అంటారు. స్వరం, శృతి... ఈ రెండూ వేర్వేరుగా ఉండే ఆస్తికత్వ బుద్ధిని విడిచిపెట్టేసి రెండూ ఒకటయిపోయి, అణగిపోయి, హృదయ కుహరంలోకి చేరిపోతే గాయకుడు నిశ్శబ్దంతో లోపల అనుభవించగల స్థితికి నాదమని పేరు. అందుకే నాదాన్ని ఉపాసన చేస్తారు. దాని ద్వారా చిట్టచివరకు పరమేశ్వరుడిని చేరుకుంటారు. సంగీతానికున్న ప్రధాన ప్రయోజనం అదే. సంగీత త్రయంలో ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిలతో పాటూ త్యాగరాజస్వామి కూడా ఉన్నారు.
ఆయన జీవితపర్యంతం రామోపాసన చేసారు. అంటే శివద్వేషి అని కాదు. రాముడిని ఇష్టదైవంగా చూస్తూ ఆయన మీద పాటలు పాడి తరించిన వ్యక్తి. ఏదీ సంపాదించి దాచుకోవలసిన అవసరం ఉండదనే పండిపోయిన వ్యక్తిత్వం ఉన్న సద్గురు ఆయన. అందుకే ఆయన కీర్తనల్లో తత్త్వ సంబంధ విషయాలు ఆవిష్కృతమవుతుంటాయి. గానవైభవం గురించి ఆయన ఒక సందర్భంలో...‘‘నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’’ అనీ,...‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అనీ.. ‘‘సద్యోజాతాది పంచ వక్త్రజ స–రి–గ–మ–ప–ధ–ని వర సప్త–స్వర విద్యా లోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాద తనుమనిశం శంకరం’’ అన్నారు.
శంకరభగవత్పాదులు శివుడి గురించి ఎలా చెప్తారో, వేదం శివుడి గురించి ఎలా మాట్లాడుతుందో, పోతనగారు శివస్వరూప తత్త్వాన్ని ఎలా ప్రతిపాదన చేసారో...ఆ తత్త్వం అంతటా నిండి ఉండేది అన్నట్టుగా త్యాగరాజస్వామి సంగీతపరంగా శంకరుడెవరన్న దాన్ని ఆవిష్కరించారు. నాద తనుమనిశం శంకరం–శంకరుడికి ఒక శరీరం ఉన్నదని కదా..సాకార రూపంలో చూసి... అంటే సగుణంగా చూసి ఆరాధన చేస్తారు. అయితే అలా చేసేవాడు కోర్కెలున్న వాడు. అలా కాక కేవలం నిర్గుణంగా ఉపాసన చేసిన వాడు జ్ఞానపిపాస కలిగినవాడు. ‘‘ఆర్తికలిగినవాడు, జిజ్ఞాసువు, అర్ధార్తిః, జ్ఞాని .. నలుగురూ ఆయన (పరమేశ్వరుడు) దగ్గరకే వెడతారు. ‘నాకిది కావాలి’ అని ఆయననే అడుగుతారు’’...అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పే ఉన్నాడు. కాబట్టి ఎవరయినా ఆయన దగ్గరకు వెళ్ళవలసిందే. శంకరుడి శరీరం ఎలా ఉంటుందో చాలా ధ్యాన శ్లోకాలు వర్ణిస్తాయి.
కానీ అసలు నాదమే–శంకరుడి శరీరం. ‘నాద తనుమనిశం శంకరం నమామి’... అనిశం–సర్వకాలాల్లో నాదమే ఆయన శరీరం– అని త్యాగరాజ స్వామి ప్రతిపాదిస్తూ...అది ‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్ నమామి మే మనసా శిరసా’. నమామిమే ..నేను నమస్కరించుచున్నాను. ఎలా..మనసా శిరసా...శిరస్సు వంచి మనసుతో నమస్కరిస్తున్నాను. నమస్కారం త్రికరణ శుద్ధిగా ఉండాలి కదా..స్వామి వారి దగ్గరకు వెడితే.. కరాభ్యాం, కర్ణాభ్యాం, ప్రణామోస్తంగముచ్యతే’ అంటూ మూడింటిని ఒకటి చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా..మరి ఇక్కడ ఆ మూడు ఏమిటి.. మనసా.. అంటే లోపల ఉన్న శివుని వైభవాన్ని ఊహిస్తూ ఆ తత్త్వాన్ని శిష్యులముందు ఆవిష్కరించడం, శిరసా.. అంటే నేలమీదపడి సాష్టాంగం చేయడానికి అవకాశం లేనప్పుడు, ఉత్తర క్షణం నమస్కారం చేద్దామని అనిపించినప్పుడు, రెండు చేతులు కైమోడ్చి శిరసు తగిలేటట్లుగా వంగి నమస్కారం చేయడం, ఇక వాక్కే కీర్తన.. వాగ్రూపంగా మనసు, శిరసు మూడింటిని కలిపి శివునికి నమస్కరించడం. మోదకరే... మోదం అంటే సంతోషం పొందడానికి. పరమేశ్వరుని పాదాలు విడవకుండా ధ్యానంలో నిమగ్నమై పరమ ప్రశాంతమైన నిశ్చలమైన స్థితిని పొందడం. నాదోపాసనకిది పరాకాష్ట. ఇదీ భారతీయ ఆత్మ.
Comments
Please login to add a commentAdd a comment