tyagaraja
-
సింగపూర్లో స్వరలయ త్యాగరాజ ఆరాధనోత్సవాలు
సింగపూర్ లో స్వరలయ ఆర్ట్స్ నిర్వహణ లో రెండవ ఏట త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల మార్చి 18 వ తారీఖున స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వారి ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే తెలుగు గాయక గాయనీ మణులంతా ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవములు జరుపుకున్నారు. సంగీత సాగరంలో ఓలలాడి, రామభక్తి లో మునిగి తేలి, యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, సౌమ్య, కిరిటి, శేషశ్రీ తదితరులు ఘన రాగ పంచరత్న కీర్తనలు ఆలపించగా, యడవల్లి శ్రీ విద్య తెర తీయగ రాదా అను కీర్తనతో స్వామిని కొలువగా, ఆరగింపవే అను భక్తి నైవేద్యాలతో, పతికి మంగళ హారతీరే అంటూ మంగళ హారతులతో అందరూ త్యాగరాజ స్వామి ఆరాధనలు మిక్కిలి భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. అనంతరం స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులైన శేషు కుమారి గారు సంగీతజ్నులకు మొమెంటోలను బాహుకరించి సత్కరించారు. -
సప్త స్వరాలు ఎక్కడ పుట్టాయంటే..?
సరస్వతీ దేవి వీణ పట్టుకుని పరమశివుని వైభవాన్ని గానం చేస్తుంటే... అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, తల ఊపుతూ చిరునవ్వుతో వింటూ ఉంటుందట. ప్రవచనం వినేటప్పుడు కదలకుండా కూర్చుని వినాలి, సంగీతం వినేటప్పుడు తల కదుపుతూ మన అంగీకారాన్ని, సంతోషాన్ని ప్రకటించడం సభామర్యాద. సరిగమపదనీరతాం శాంతం మృదుల స్వాంతం... అన్నాడు కాళిదాస మహాకవి. ఉద్వేగంతో ఉండాల్సిన మహాశక్తి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నది అంటే... ఆమె సంగీతంలో అంతగా రమిస్తున్నదట. అసలు ఆ సంగీతంలో రమించే మనసు ఎవరికుంటుందో, దానిలో తడిసిముద్దయిపోయే మనసు ఎవరికుంటుందో వారు పరమ కోమలమైన మనసు కలిగి ఉంటారు. మృదువైన మనసు అంటే.. అవతలివారి కష్టం తమ కష్టం అన్నంత బాధపడిపోతూ, దానిని తీర్చడానికి వారు ముందుకు పరిగెడతారు. ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రశాంత స్థితి పొందినప్పుడు తమపట్ల కృతఘ్నులై ఉన్నా పట్టించుకోరు. అమ్మవారే కాదు, అయ్యవారిదీ అదే పరిస్థితి. ‘నాదతనుమనిశం శంకరం’ అని త్యాగరాజ స్వామి ఒక కీర్తన చేశారు. నిజానికి శంకరుడి శరీరం నాదమే. ‘సద్యోజాతాది పంచ వక్త్రజ సరిగమపదని వర సప్తస్వరవిద్యాలోలం...’’ లౌల్యం అట ఆయనకు .. ఏ సంగీతం మీద... అంటే... అసలు శంకరుడివే ఐదు ముఖాలు. సద్యోజాత, అఘోర, సత్పురుష, వామదేవ, ఈశానములు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది. అందుకే శివాలయాల్లో... పశ్చిమ ముఖంగా ఉండే శివాలయం గొప్పదంటారు. అఘోర ముఖం– దక్షిణం. సత్పురుష ముఖం – తూర్పు. వామదేవ ముఖం – ఉత్తరం. ఈశాన ముఖం –ఊర్థ్వ ముఖం. ఇవి ఐదు.. ఐదు శక్తులను కలిగి ఉంటాయి. అందుకే శివుడికి ఎటువైపు అభిషేకం చేసినా ఆయనకు అందుతుంది. ఆ ముఖాలతో ఆయన సరిగమలనబడే వాటియందు ఎప్పుడూ రమిస్తుంటాడు. లౌల్యం అంటే... ఇక ఇప్పటికి చాల్లేండి... అన్న మాట అనకుండా ఎంత అనుభవించినా, ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తే లౌల్యం అంటారు. అసలు ఆ స్వరాలు ఎక్కడ పుట్టాయంటే... అవి ఆయన ఐదు ముఖాల్లోంచే పుట్టాయి. సప్త స్వరాలు ఏడయినప్పుడు ముఖాలు ఐదే కదా... అన్నప్పుడు... వీటిలో షడ్జం, పంచమం.. స, ప స్వరాలు. వీటిని ప్రకృతి స్వరాలంటారు. పరమశివుడు ఎంత సనాతనుడో, ఎంత స్వయం భూనో, ఆయనకు ఆద్యంతాలు ఎలా లేవో అలా సంగీతంలో ఈ రెండు ప్రకృతి స్వరాలూ ఆద్యంతాలు లేకుండా ఈశ్వరుడంతటి నిత్యములు, సనాతనాలై ఉన్నాయి. మిగిలినవి వికృతి స్వరాలు. అవి మిగిలిన ఐదు ముఖాల్లో నుంచి వచ్చాయి. అంటే సంగీతం ఎంత శక్తిమంతమో, భారతీయ సంగీతంలో సప్త స్వరాలు అంతే శక్తిమంతమూ, సనాతనమై, నిత్యనూతనమై వెలుగుతున్నాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (చదవండి: అసలు... కొసరు) -
ఎవరయినా ఆయన దగ్గరకు వెళ్లవలసిందే
భారతీయ సంస్కృతిలో – ‘రంజకత్వం కోసం పాట పాడుతున్నాను’... అనరు. నాదోపాసన చేస్తున్నాను... అంటారు. అంటే సమస్త శబ్దం ఎక్కడు పుడుతుందో దానిని నాదం అంటారు. స్వరం, శృతి... ఈ రెండూ వేర్వేరుగా ఉండే ఆస్తికత్వ బుద్ధిని విడిచిపెట్టేసి రెండూ ఒకటయిపోయి, అణగిపోయి, హృదయ కుహరంలోకి చేరిపోతే గాయకుడు నిశ్శబ్దంతో లోపల అనుభవించగల స్థితికి నాదమని పేరు. అందుకే నాదాన్ని ఉపాసన చేస్తారు. దాని ద్వారా చిట్టచివరకు పరమేశ్వరుడిని చేరుకుంటారు. సంగీతానికున్న ప్రధాన ప్రయోజనం అదే. సంగీత త్రయంలో ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిలతో పాటూ త్యాగరాజస్వామి కూడా ఉన్నారు. ఆయన జీవితపర్యంతం రామోపాసన చేసారు. అంటే శివద్వేషి అని కాదు. రాముడిని ఇష్టదైవంగా చూస్తూ ఆయన మీద పాటలు పాడి తరించిన వ్యక్తి. ఏదీ సంపాదించి దాచుకోవలసిన అవసరం ఉండదనే పండిపోయిన వ్యక్తిత్వం ఉన్న సద్గురు ఆయన. అందుకే ఆయన కీర్తనల్లో తత్త్వ సంబంధ విషయాలు ఆవిష్కృతమవుతుంటాయి. గానవైభవం గురించి ఆయన ఒక సందర్భంలో...‘‘నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’’ అనీ,...‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అనీ.. ‘‘సద్యోజాతాది పంచ వక్త్రజ స–రి–గ–మ–ప–ధ–ని వర సప్త–స్వర విద్యా లోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాద తనుమనిశం శంకరం’’ అన్నారు. శంకరభగవత్పాదులు శివుడి గురించి ఎలా చెప్తారో, వేదం శివుడి గురించి ఎలా మాట్లాడుతుందో, పోతనగారు శివస్వరూప తత్త్వాన్ని ఎలా ప్రతిపాదన చేసారో...ఆ తత్త్వం అంతటా నిండి ఉండేది అన్నట్టుగా త్యాగరాజస్వామి సంగీతపరంగా శంకరుడెవరన్న దాన్ని ఆవిష్కరించారు. నాద తనుమనిశం శంకరం–శంకరుడికి ఒక శరీరం ఉన్నదని కదా..సాకార రూపంలో చూసి... అంటే సగుణంగా చూసి ఆరాధన చేస్తారు. అయితే అలా చేసేవాడు కోర్కెలున్న వాడు. అలా కాక కేవలం నిర్గుణంగా ఉపాసన చేసిన వాడు జ్ఞానపిపాస కలిగినవాడు. ‘‘ఆర్తికలిగినవాడు, జిజ్ఞాసువు, అర్ధార్తిః, జ్ఞాని .. నలుగురూ ఆయన (పరమేశ్వరుడు) దగ్గరకే వెడతారు. ‘నాకిది కావాలి’ అని ఆయననే అడుగుతారు’’...అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పే ఉన్నాడు. కాబట్టి ఎవరయినా ఆయన దగ్గరకు వెళ్ళవలసిందే. శంకరుడి శరీరం ఎలా ఉంటుందో చాలా ధ్యాన శ్లోకాలు వర్ణిస్తాయి. కానీ అసలు నాదమే–శంకరుడి శరీరం. ‘నాద తనుమనిశం శంకరం నమామి’... అనిశం–సర్వకాలాల్లో నాదమే ఆయన శరీరం– అని త్యాగరాజ స్వామి ప్రతిపాదిస్తూ...అది ‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్ నమామి మే మనసా శిరసా’. నమామిమే ..నేను నమస్కరించుచున్నాను. ఎలా..మనసా శిరసా...శిరస్సు వంచి మనసుతో నమస్కరిస్తున్నాను. నమస్కారం త్రికరణ శుద్ధిగా ఉండాలి కదా..స్వామి వారి దగ్గరకు వెడితే.. కరాభ్యాం, కర్ణాభ్యాం, ప్రణామోస్తంగముచ్యతే’ అంటూ మూడింటిని ఒకటి చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా..మరి ఇక్కడ ఆ మూడు ఏమిటి.. మనసా.. అంటే లోపల ఉన్న శివుని వైభవాన్ని ఊహిస్తూ ఆ తత్త్వాన్ని శిష్యులముందు ఆవిష్కరించడం, శిరసా.. అంటే నేలమీదపడి సాష్టాంగం చేయడానికి అవకాశం లేనప్పుడు, ఉత్తర క్షణం నమస్కారం చేద్దామని అనిపించినప్పుడు, రెండు చేతులు కైమోడ్చి శిరసు తగిలేటట్లుగా వంగి నమస్కారం చేయడం, ఇక వాక్కే కీర్తన.. వాగ్రూపంగా మనసు, శిరసు మూడింటిని కలిపి శివునికి నమస్కరించడం. మోదకరే... మోదం అంటే సంతోషం పొందడానికి. పరమేశ్వరుని పాదాలు విడవకుండా ధ్యానంలో నిమగ్నమై పరమ ప్రశాంతమైన నిశ్చలమైన స్థితిని పొందడం. నాదోపాసనకిది పరాకాష్ట. ఇదీ భారతీయ ఆత్మ. -
అలరించిన త్యాగయ్య భక్తి సంకీర్తనలు
తిరుపతి కల్చరల్: త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు, కళైమామణి సౌమ్య ఆలపించిన త్యాగయ్య భక్తి సంకీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. త్యాగరాజ మండపంలో మంగళవారం ‘త్యాగరాజు ఒక రోజు దినచర్య’ అనే అంశంపై సంగీతాలాపన చేస్తూ ఆయన రోజూ వారి భక్తి సంకీర్తనల గురించి వివరించారు. త్యాగరాజస్వామి తన ఇంట్లో శ్రీరామ^è ంద్రమూర్తిని పూజించిన విధానం, శ్రీరాముని స్తుతించడానికి చేసిన కీర్తనలను వారు ఆలపించారు. మొదటగా త్యాగయ్య ఉత్సవ సంప్రదాయ కృతులతో ఆయన దిన చర్యను వివరిస్తూ సంకీర్తనలను గానం చేశారు. ఇందులో భాగంగా ఉదయం మేల్కొపు నుంచి పవళింపు సేవ వరకు సుమారు 20 కీర్తనలకుపైగా ఆలపించి ప్రేక్షకులను మైమరపించారు. అనంతరం సౌమ్య బృందం నిర్వహించిన గాత్ర కచేరి శ్రవనానందకరంగా సాగింది. వీరికి వయోలిన్ౖపై ఎంబార్ కణ్ణన్, మదంగంపై నైనేలి నారాయణన్ చక్కటి సహకారం అందించి రక్తి కట్టించారు. అనంతరం త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సౌమ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు దొరైరాజ్, సుందరరామిరెడ్డి, కత్తుల సుధాకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.