సరస్వతీ దేవి వీణ పట్టుకుని పరమశివుని వైభవాన్ని గానం చేస్తుంటే... అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, తల ఊపుతూ చిరునవ్వుతో వింటూ ఉంటుందట. ప్రవచనం వినేటప్పుడు కదలకుండా కూర్చుని వినాలి, సంగీతం వినేటప్పుడు తల కదుపుతూ మన అంగీకారాన్ని, సంతోషాన్ని ప్రకటించడం సభామర్యాద. సరిగమపదనీరతాం శాంతం మృదుల స్వాంతం... అన్నాడు కాళిదాస మహాకవి.
ఉద్వేగంతో ఉండాల్సిన మహాశక్తి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నది అంటే... ఆమె సంగీతంలో అంతగా రమిస్తున్నదట. అసలు ఆ సంగీతంలో రమించే మనసు ఎవరికుంటుందో, దానిలో తడిసిముద్దయిపోయే మనసు ఎవరికుంటుందో వారు పరమ కోమలమైన మనసు కలిగి ఉంటారు. మృదువైన మనసు అంటే.. అవతలివారి కష్టం తమ కష్టం అన్నంత బాధపడిపోతూ, దానిని తీర్చడానికి వారు ముందుకు పరిగెడతారు. ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రశాంత స్థితి పొందినప్పుడు తమపట్ల కృతఘ్నులై ఉన్నా పట్టించుకోరు.
అమ్మవారే కాదు, అయ్యవారిదీ అదే పరిస్థితి. ‘నాదతనుమనిశం శంకరం’ అని త్యాగరాజ స్వామి ఒక కీర్తన చేశారు. నిజానికి శంకరుడి శరీరం నాదమే. ‘సద్యోజాతాది పంచ వక్త్రజ సరిగమపదని వర సప్తస్వరవిద్యాలోలం...’’ లౌల్యం అట ఆయనకు .. ఏ సంగీతం మీద... అంటే... అసలు శంకరుడివే ఐదు ముఖాలు. సద్యోజాత, అఘోర, సత్పురుష, వామదేవ, ఈశానములు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది. అందుకే శివాలయాల్లో... పశ్చిమ ముఖంగా ఉండే శివాలయం గొప్పదంటారు. అఘోర ముఖం– దక్షిణం. సత్పురుష ముఖం – తూర్పు. వామదేవ ముఖం – ఉత్తరం. ఈశాన ముఖం –ఊర్థ్వ ముఖం.
ఇవి ఐదు.. ఐదు శక్తులను కలిగి ఉంటాయి. అందుకే శివుడికి ఎటువైపు అభిషేకం చేసినా ఆయనకు అందుతుంది. ఆ ముఖాలతో ఆయన సరిగమలనబడే వాటియందు ఎప్పుడూ రమిస్తుంటాడు. లౌల్యం అంటే... ఇక ఇప్పటికి చాల్లేండి... అన్న మాట అనకుండా ఎంత అనుభవించినా, ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తే లౌల్యం అంటారు. అసలు ఆ స్వరాలు ఎక్కడ పుట్టాయంటే... అవి ఆయన ఐదు ముఖాల్లోంచే పుట్టాయి. సప్త స్వరాలు ఏడయినప్పుడు ముఖాలు ఐదే కదా... అన్నప్పుడు... వీటిలో షడ్జం, పంచమం.. స, ప స్వరాలు.
వీటిని ప్రకృతి స్వరాలంటారు. పరమశివుడు ఎంత సనాతనుడో, ఎంత స్వయం భూనో, ఆయనకు ఆద్యంతాలు ఎలా లేవో అలా సంగీతంలో ఈ రెండు ప్రకృతి స్వరాలూ ఆద్యంతాలు లేకుండా ఈశ్వరుడంతటి నిత్యములు, సనాతనాలై ఉన్నాయి. మిగిలినవి వికృతి స్వరాలు. అవి మిగిలిన ఐదు ముఖాల్లో నుంచి వచ్చాయి. అంటే సంగీతం ఎంత శక్తిమంతమో, భారతీయ సంగీతంలో సప్త స్వరాలు అంతే శక్తిమంతమూ, సనాతనమై, నిత్యనూతనమై వెలుగుతున్నాయి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
(చదవండి: అసలు... కొసరు)
Comments
Please login to add a commentAdd a comment