Saptaha
-
తెనాలి.. ‘సప్తాహ ముద్దపప్పు’ తినాలి
ఆ రోజుల్లో: మాఘ మాసం వచ్చి0దంటే.. తెనాలి రామలింగేశ్వరపేటలోని శంకర మఠం ముద్దపప్పు సప్తాహాలతో ఘుమఘుమలాడేది. వారం రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాల నుంచి వేద పండితులతోపాటు అన్ని కులాల్లోని ముద్దపప్పు ప్రియులు ముద్దపప్పు భోజనం ఆరగించి.. మఠంలోనే నిద్రించేవారు. 50 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ ముద్దపప్పు సప్తాహాల విశేషాల్లోకి వెళితే.. తెనాలి: ఎనిమిదో శతాబ్దపు తత్వవేత్త.. అద్వైత గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క పది సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ. కాషాయధారి ఎవరొచ్చి నా మఠంలోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమాలు, యజ్ఞాలతోపాటు మాఘ మాసంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించేవారు. మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి మొదలై వారం రోజులపాటు ముద్దపప్పు వేర్వేరు అనుపానాలతో ముద్దపప్పు సప్తాహాలు జరిగేవి. వీటికితోడు హరికథ, బుర్రకథ, పురాణ పఠన కాలక్షేపాలతో శంకర మఠం ఓ వెలుగు వెలిగింది. సుమారు 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి. సప్తాహాలు ఇలా: నలభీమ పాకంలో చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణా నదీ తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు వచ్చే వరకు వేయించి.. బాగా ఉడకబెట్టి.. ఉప్పు, పసుపు వేసి ముద్దపప్పు వండేవారు. దీనికి అనుపానాలుగా అంగలకుదురు పుల్ల దోసకాయల్ని వినియోగించి.. అనకాపల్లి ఆవపిండి, చినరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్ర మిరపకాయలతో కొట్టిన కారం, వేటపాలెం రాళ్ల ఉప్పు వేసి.. దేవతా దోసావకాయ తయారు చేసేవారు. వలివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్ర గుమ్మడి కాయలు, ముదురు బెండకాయల ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ తిరగమోత (తాలింపు) వేసి.. గుమ్మడి ముక్కల పులుసు గొప్పగా చేసేవారు. అనంతవరంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో అన్నం వండేవారు. వేజెండ్ల గ్రామపు నెయ్యి.. సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్‌హాం కాలువ గట్టున గడ్డిమేసి ఇచ్చిన చిక్కటి పాలతో జిడ్డు గడ్డ పెరుగు కుండల్లో తోడు పెట్టేవారు. ఇంగువ మినప వడియాలు, పెసర ఎర్ర అప్పడాలు వేయించేవారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి.. పంక్తులుగా వడ్డన చేయగా.. అలనాటి ఆ ముద్దపప్పు భోజనం చేసిన వారంతా తాదాత్మ్యం చెందేవారు. నాటి సప్తాహాలను వారణాసి మణెమ్మ మహిళ దగ్గరుండి చేయించేవారు. శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. మఠం వ్యవస్థాపకురాలు లింగమ్మ కుమారుడు శంకరశాస్త్రి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మఠం నిర్వహణ చూస్తుండేవారు. తర్వాత శంకరమఠం శ్రీశృంగేరీ శారదా పీఠం అధీనంలోకి వెళ్లింది. మణెమ్మ మా అమ్మ మాది ప్రకాశం జిల్లా అద్దంకి. కుటుంబ పోషణ నిమిత్తం మా కుటుంబం తెనాలి చేరుకుంది. శుభకార్యాల్లో వంటలు చేయడంలో మా అమ్మ వారణాసి మణెమ్మ పేరు తెచ్చుకుంది. శంకర మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహాలు, కార్తీక సమారాధనలు మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవి. మా అమ్మ 26 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇప్పటికీ ఆమె పేరిట ఏటా కార్తీకమాస సమారాధనల్ని మఠంలో చేస్తున్నాం. – రాయప్రోలు సుందరమ్మ. మణెమ్మ పెద్ద కుమార్తె, సదాశివశాస్త్రి, మనవడు ఆ రోజుల్లో గొప్పగా ఉండేది ఆధ్యాత్మిక ప్రచారంలో ఒక వెలుగు వెలిగిన శంకర మఠం తర్వాతి కాలంలో ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. గొప్పగా నడిచిన ముద్దపప్పు సప్తాహాలు నిలిచిపోయాయి. భోజనం వడ్డనకు ముందు మా తండ్రి ములుకుట్ల సదాశివశాస్త్రి హరికథా కాలక్షేపం తప్పనిసరిగా ఉండేది. – ములుకుట్ల విశ్వనాథశాస్త్రి,భక్తి ప్రచారక ధూపదీప నైవేద్యం ఇస్తున్నా శంకర మఠం శ్రీశృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఉంది. 30 ఏళ్లుగా ధూపదీప నైవేద్యం పెడుతున్నా. మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవాళ్లం. మఠంతో సహా ఇల్లు శిథిలావస్థకు చేరటంతో అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చి0ది. – యనమండ్ర నరసింహమూర్తి, అర్చకస్వామి -
సప్త స్వరాలు ఎక్కడ పుట్టాయంటే..?
సరస్వతీ దేవి వీణ పట్టుకుని పరమశివుని వైభవాన్ని గానం చేస్తుంటే... అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, తల ఊపుతూ చిరునవ్వుతో వింటూ ఉంటుందట. ప్రవచనం వినేటప్పుడు కదలకుండా కూర్చుని వినాలి, సంగీతం వినేటప్పుడు తల కదుపుతూ మన అంగీకారాన్ని, సంతోషాన్ని ప్రకటించడం సభామర్యాద. సరిగమపదనీరతాం శాంతం మృదుల స్వాంతం... అన్నాడు కాళిదాస మహాకవి. ఉద్వేగంతో ఉండాల్సిన మహాశక్తి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నది అంటే... ఆమె సంగీతంలో అంతగా రమిస్తున్నదట. అసలు ఆ సంగీతంలో రమించే మనసు ఎవరికుంటుందో, దానిలో తడిసిముద్దయిపోయే మనసు ఎవరికుంటుందో వారు పరమ కోమలమైన మనసు కలిగి ఉంటారు. మృదువైన మనసు అంటే.. అవతలివారి కష్టం తమ కష్టం అన్నంత బాధపడిపోతూ, దానిని తీర్చడానికి వారు ముందుకు పరిగెడతారు. ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రశాంత స్థితి పొందినప్పుడు తమపట్ల కృతఘ్నులై ఉన్నా పట్టించుకోరు. అమ్మవారే కాదు, అయ్యవారిదీ అదే పరిస్థితి. ‘నాదతనుమనిశం శంకరం’ అని త్యాగరాజ స్వామి ఒక కీర్తన చేశారు. నిజానికి శంకరుడి శరీరం నాదమే. ‘సద్యోజాతాది పంచ వక్త్రజ సరిగమపదని వర సప్తస్వరవిద్యాలోలం...’’ లౌల్యం అట ఆయనకు .. ఏ సంగీతం మీద... అంటే... అసలు శంకరుడివే ఐదు ముఖాలు. సద్యోజాత, అఘోర, సత్పురుష, వామదేవ, ఈశానములు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది. అందుకే శివాలయాల్లో... పశ్చిమ ముఖంగా ఉండే శివాలయం గొప్పదంటారు. అఘోర ముఖం– దక్షిణం. సత్పురుష ముఖం – తూర్పు. వామదేవ ముఖం – ఉత్తరం. ఈశాన ముఖం –ఊర్థ్వ ముఖం. ఇవి ఐదు.. ఐదు శక్తులను కలిగి ఉంటాయి. అందుకే శివుడికి ఎటువైపు అభిషేకం చేసినా ఆయనకు అందుతుంది. ఆ ముఖాలతో ఆయన సరిగమలనబడే వాటియందు ఎప్పుడూ రమిస్తుంటాడు. లౌల్యం అంటే... ఇక ఇప్పటికి చాల్లేండి... అన్న మాట అనకుండా ఎంత అనుభవించినా, ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తే లౌల్యం అంటారు. అసలు ఆ స్వరాలు ఎక్కడ పుట్టాయంటే... అవి ఆయన ఐదు ముఖాల్లోంచే పుట్టాయి. సప్త స్వరాలు ఏడయినప్పుడు ముఖాలు ఐదే కదా... అన్నప్పుడు... వీటిలో షడ్జం, పంచమం.. స, ప స్వరాలు. వీటిని ప్రకృతి స్వరాలంటారు. పరమశివుడు ఎంత సనాతనుడో, ఎంత స్వయం భూనో, ఆయనకు ఆద్యంతాలు ఎలా లేవో అలా సంగీతంలో ఈ రెండు ప్రకృతి స్వరాలూ ఆద్యంతాలు లేకుండా ఈశ్వరుడంతటి నిత్యములు, సనాతనాలై ఉన్నాయి. మిగిలినవి వికృతి స్వరాలు. అవి మిగిలిన ఐదు ముఖాల్లో నుంచి వచ్చాయి. అంటే సంగీతం ఎంత శక్తిమంతమో, భారతీయ సంగీతంలో సప్త స్వరాలు అంతే శక్తిమంతమూ, సనాతనమై, నిత్యనూతనమై వెలుగుతున్నాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (చదవండి: అసలు... కొసరు) -
ముగిసిన సప్తాహ భజనలు
మల్దకల్ : మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన సప్తాహ భజనలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం సప్తాహ భజనల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు గద్వాల పట్టణ సమీపంలోని కష్ణానది జలాలను తీసుకొచ్చి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచ్ నాగరాజు, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, ఆలయ సిబ్బంది నర్సింహులు, శ్రీనివాసులు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.