అలనాటి వైభవానికి సాక్షి తెనాలిలోని శంకర మఠం
ముద్దపప్పు సప్తాహాలతో ఘనకీర్తి
ఆ రోజుల్లో: మాఘ మాసం వచ్చి0దంటే.. తెనాలి రామలింగేశ్వరపేటలోని శంకర మఠం ముద్దపప్పు సప్తాహాలతో ఘుమఘుమలాడేది. వారం రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాల నుంచి వేద పండితులతోపాటు అన్ని కులాల్లోని ముద్దపప్పు ప్రియులు ముద్దపప్పు భోజనం ఆరగించి.. మఠంలోనే నిద్రించేవారు. 50 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ ముద్దపప్పు సప్తాహాల విశేషాల్లోకి వెళితే..
తెనాలి: ఎనిమిదో శతాబ్దపు తత్వవేత్త.. అద్వైత గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క పది సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ. కాషాయధారి ఎవరొచ్చి నా మఠంలోనే బస చేసేవారు.
అప్పట్లో ఇక్కడ హోమాలు, యజ్ఞాలతోపాటు మాఘ మాసంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించేవారు. మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి మొదలై వారం రోజులపాటు ముద్దపప్పు వేర్వేరు అనుపానాలతో ముద్దపప్పు సప్తాహాలు జరిగేవి. వీటికితోడు హరికథ, బుర్రకథ, పురాణ పఠన కాలక్షేపాలతో శంకర మఠం ఓ వెలుగు వెలిగింది. సుమారు 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి.
సప్తాహాలు ఇలా: నలభీమ పాకంలో చెయ్యి తిరిగిన నరసరావుపేట వంటవారు కృష్ణా నదీ తీరమైన కొల్లూరు పొలాల్లో పండిన ఏడాది వయసు గల కందిపప్పును గోధుమ రంగు వచ్చే వరకు వేయించి.. బాగా ఉడకబెట్టి.. ఉప్పు, పసుపు వేసి ముద్దపప్పు వండేవారు. దీనికి అనుపానాలుగా అంగలకుదురు పుల్ల దోసకాయల్ని వినియోగించి.. అనకాపల్లి ఆవపిండి, చినరావూరు గానుగ నువ్వుల నూనె, బుడంపాడు ఎర్ర మిరపకాయలతో కొట్టిన కారం, వేటపాలెం రాళ్ల ఉప్పు వేసి.. దేవతా దోసావకాయ తయారు చేసేవారు.
వలివేరు మెట్ట పొలాల్లో కాసిన ఎర్ర గుమ్మడి కాయలు, ముదురు బెండకాయల ముక్కలకు ప్రశస్తమైన ఇంగువ తిరగమోత (తాలింపు) వేసి.. గుమ్మడి ముక్కల పులుసు గొప్పగా చేసేవారు. అనంతవరంలో పండిన వడ్ల దంపుడు బియ్యంతో అన్నం వండేవారు. వేజెండ్ల గ్రామపు నెయ్యి.. సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్‌హాం కాలువ గట్టున గడ్డిమేసి ఇచ్చిన చిక్కటి పాలతో జిడ్డు గడ్డ పెరుగు కుండల్లో తోడు పెట్టేవారు.
ఇంగువ మినప వడియాలు, పెసర ఎర్ర అప్పడాలు వేయించేవారు. పచ్చల తాడిపర్రు అరిటాకులు పరిచి.. పంక్తులుగా వడ్డన చేయగా.. అలనాటి ఆ ముద్దపప్పు భోజనం చేసిన వారంతా తాదాత్మ్యం చెందేవారు. నాటి సప్తాహాలను వారణాసి మణెమ్మ మహిళ దగ్గరుండి చేయించేవారు.
శుభకార్యాల్లో వంటలకు అప్పట్లో ఆమె ప్రసిద్ధి. మఠం వ్యవస్థాపకురాలు లింగమ్మ కుమారుడు శంకరశాస్త్రి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మఠం నిర్వహణ చూస్తుండేవారు. తర్వాత శంకరమఠం శ్రీశృంగేరీ శారదా పీఠం అధీనంలోకి వెళ్లింది.
మణెమ్మ మా అమ్మ
మాది ప్రకాశం జిల్లా అద్దంకి. కుటుంబ పోషణ నిమిత్తం మా కుటుంబం తెనాలి చేరుకుంది. శుభకార్యాల్లో వంటలు చేయడంలో మా అమ్మ వారణాసి మణెమ్మ పేరు తెచ్చుకుంది. శంకర మఠం కేంద్రంగా జరిగిన ముద్దపప్పు సప్తాహాలు, కార్తీక సమారాధనలు మణెమ్మ చేతుల మీదుగానే జరిగేవి. మా అమ్మ 26 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇప్పటికీ ఆమె పేరిట ఏటా కార్తీకమాస సమారాధనల్ని మఠంలో చేస్తున్నాం. – రాయప్రోలు సుందరమ్మ. మణెమ్మ పెద్ద కుమార్తె, సదాశివశాస్త్రి, మనవడు
ఆ రోజుల్లో గొప్పగా ఉండేది
ఆధ్యాత్మిక ప్రచారంలో ఒక వెలుగు వెలిగిన శంకర మఠం తర్వాతి కాలంలో ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. గొప్పగా నడిచిన ముద్దపప్పు సప్తాహాలు నిలిచిపోయాయి. భోజనం వడ్డనకు ముందు మా తండ్రి ములుకుట్ల సదాశివశాస్త్రి హరికథా కాలక్షేపం తప్పనిసరిగా ఉండేది. – ములుకుట్ల విశ్వనాథశాస్త్రి,భక్తి ప్రచారక
ధూపదీప నైవేద్యం ఇస్తున్నా
శంకర మఠం శ్రీశృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఉంది. 30 ఏళ్లుగా ధూపదీప నైవేద్యం పెడుతున్నా. మఠం ఆవరణలోని ఇంట్లో ఉండేవాళ్లం. మఠంతో సహా ఇల్లు శిథిలావస్థకు చేరటంతో అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చి0ది. – యనమండ్ర నరసింహమూర్తి, అర్చకస్వామి
Comments
Please login to add a commentAdd a comment