సంగీతం ఓ ఔషధం
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి...
ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.
నిజామాబాద్‌కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్‌రావ్ దేశ్‌పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్‌డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్‌డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.
‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.
స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?
‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.
నిజామాబాద్‌లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.
స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.
‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.
‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్‌లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.
ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.
భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.
సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం
‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.
సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.
– స్వప్నరాణి
– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment