Devotional songs
-
Shree Naval Kishori: పద్ధతిగా పాపులర్ అయ్యింది
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదిప్పుడు. అందుకే రోటీన్‌కు భిన్నంగా ఆలోచన చేస్తున్నారు కొందరు. అయితే.. తన గాత్రానికి హవభావాల్ని జోడిస్తూ భక్తిరసాన్ని వొలికిస్తూ .. పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ నవల్ కిషోరీ Shree Naval Kishori. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఈ అమ్మాయి.. గత ఏడాది జూన్‌లో సోషల్ మీడియాలో అడుగుపెట్టింది. సంప్రదాయ దుస్తులు.. నుదట నామాలు ధరించి భక్తి పాటలే ప్రధానంగా ఆమె వీడియోలు చేస్తోంది. అలా ఏడాది తిరగకముందే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్, ఇతరత్రా ఫ్లాట్‌ఫామ్స్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. మ్యూజికల్ యాప్స్‌తోనూ అలరిస్తోంది. నార్త్-సౌత్ తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల నుంచి నెటిజన్లు ఈ యంగ్ డివోషనల్ సింగర్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఉదయం నుంచి ఆమె అప్లోడ్ చేసే ప్రతీ వీడియోకు లక్షల్లో లైకులు, వ్యూస్. శ్రీ నవల్ క్రేజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. తనను అనుసరిస్తూ అనుకరించి వీడియోలు చేస్తున్న వాళ్లను సైతం ఆమె ఎంకరేజ్ చేస్తుండడం విశేషం. -
దుర్గ రాసింది సీతా చాలీసా!
హనుమాన్ చాలీసా, సాయి చాలీసా గురించి మనకు తెలుసు.సీతా చాలీసాను రాసి, వినిపిస్తున్నారు డాక్టర్ జిఎల్‌కె దుర్గ.ఆంధ్రమహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్ అయిన దుర్గ మోటివేషనల్ స్పీకర్‌గానూ యువతలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు.అరవైఏడేళ్ల వయసులో జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుంటూ స్ఫూర్తిని కలిగించే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘నేటి మహిళల పరిస్థితి చూస్తుంటే ఒక పక్కన ఆకాశంలోకి దూసుకుపోతున్నాం... మరోపక్కన అథోలోకంలోకి కూడా వెళుతున్నామా అనిపిస్తుంది. ఓవైపు అమ్మాయిలను ఆకాశం అంత ఎత్తు ఎదగాలని ప్రోత్సహిస్తున్నాం.. మరోవైపు ఇంకా స్త్రీ భ్రూణహత్యలు జరగడం చూస్తున్నాం. మహిళలు ఎదగాలంటే మగవారిలోనూ మార్పు రావాలి. ఇప్పటికన్నా ఇతిహాస కాలం నాటి రోజులను తెలుసుకుంటే నాటి మహిళ తెగువ, సమయస్ఫూర్తి మనకు కనిపిస్తాయి. సీతా చాలీసా స్త్రీ కేంద్రకంగా ఉంటుంది. తెలుసుకుంటూ చేసిన ప్రయత్నం శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి మా అత్తగారి ఊరు వెళ్లాం. అక్కడ అమ్మవారికి మంగళసూత్రధారణ జరిగేటప్పుడు రామ, హనుమాన్ చాలీసా ఉంది, సీతాచాలీసా గురించి లేదే... అనిపించింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అదే విషయం మనసులో మెదులుతుండటంతో ఇంటర్నెట్లో శోధించాను. నాకున్న స్నేహితులు, పెద్దలను అడిగాను. తెలుగులో సీతా చాలీసా లేదు. హిందీలో ఉంది కానీ... బాణీ వేరుగా ఉంది. దీంతో తెలుగులో సీతా చాలీసా రాయాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం వాల్మీకి రామాయణాన్ని పారాయణ చేస్తూ... అందులో నుంచి సీతాదేవి గురించి ఉన్న వ్యాఖ్యానాలు రాసుకుంటూ వచ్చాను. ఈ ప్రయాణంలో చాలా మంది మిత్రులు, పెద్దలు నాకు సాయం చేశారు. నిజానికి వాల్మీకి మహాకవి, రామాయణ కథానాయిక అయిన సీత గురించి చాలా గొప్పగా... రాముడికి ఏ మాత్రం తీసిపోని విధంగా చెప్పారు. అందం, సుగుణాలలోనే కాదు సహనం, ధైర్యం, తెలివితేటలు, ఔదార్యం, సమయస్ఫూర్తి, మాటలు .. ఇలా అన్నింటì లోనూ ఆమె గొప్పతనం గురించి వివరించారు. సీతాదేవి బాల్యం, యవ్వనం, స్వయంవరం, కల్యాణం, అరణ్యవాసం, అశోకవనం, రావణ వధానంతరం రామునితో తిరిగి అయోధ్య చేరడం, పట్టాభిషేకం, అనంతరం అడవులకు వెళ్లడం, అక్కడినుంచి వాల్మీకి ఆశ్రమం చేరడం, లవకుశులను పెంచడం, చివరగా తల్లి భూదేవిలో కలిసిపోవడం వరకు ఆమె జీవనం ఎంత శక్తిమంతమైనదో... అదంతా చాలీసాలో వచ్చేలా కూర్చాను. బాల్యంలో ఆడుకుంటూ శివధనస్సును ఉంచిన మంజూషను జరిపినది అని ఉంటే.. ‘శివధనస్సును అవలీలగా జరిపిన బాలవు నీవు’ అని, హనుమతో మాట్లాడేటప్పుడు..‘రాముని ధ్యాసే శ్వాసగ నిలిపి తపమొనరించిన తాపసి వీవు’ అని అశోకవనంలో చెప్పడం.. పట్టాభిషేక సమయంలో హనుమకు పుత్రవాత్సల్యంతో ఇచ్చిన అపురూపమైన మణిహారం గురించి .. ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని ఆమె గుణగణాలను వివరిస్తూ చేసే చాలీసా మనలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. నాన మ్మ చెప్పిన కథలు.. నేను కామర్స్ సబ్జెక్ట్‌తో పీహెచ్‌డి పూర్తి చేసి, ఆంధ్ర మహిళా సభలో 35 ఏళ్లుగా లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా చేసి రిటైర్ అయ్యాను. ఆంధ్ర మహిళాసభ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభకు వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నాను. కాలేజీ రోజుల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డ్‌తో పాటు మెరిట్ స్కాలర్షిప్లు పొందాను. కామర్స్ స్టూడెంట్‌ని అయినా తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అలా, సంస్కృతం కూడా నేర్చుకున్నాను. అందుకు మా నానమ్మే కారణం. నా చిన్నతనంలో ఆమె ప్రతిరోజూ పడుకునే సమయంలో రామాయణంలోని కథలు చెప్పేది. ఆధ్యాత్మికతను పెంచే గజేంద్ర మోక్షం, రామాయణ, మహాభారతాల గురించి చెప్పేది. ఆ ఆసక్తితోనే పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. ఇప్పటికి కూడా ప్రతి రోజూ ఉదయం రెండు గంటల సమయం రాయడానికి కేటాయిస్తే, రాత్రి రెండు గంటల సేపు చదవడానికి కేటాయిస్తాను. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి.. పదేళ్లుగా మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాను. టీచింగ్ వృత్తిలో కొనసాగడం వల్ల యువతకు, మహిళలకు మంచి విషయాలు నా ద్వారా వెళ్లడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో మార్పు వచ్చేందుకు చేసే ఏ చిన్న పని అయినా ముందుండేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, ఆ రోజు ఏ టీచర్ అయితే రాలేదో ఆ స్థానంలో నేను మోటివేషనల్ క్లాస్ తీసుకుంటాను. జైలుకు వెళ్లి ఖైదీలకు మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. మహిళల కోసం ప్రత్యేకం.. స్టాండప్ కామెడీ చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. అత్తగారు–కోడళ్ల మధ్య ఉండాల్సిన బంధాలు, మహిళల ఆరోగ్యం, చదువుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, నాదైన బాణీలో నవ్విస్తూనే వారిని వారు దిద్దుకునే ఆలోచన కలిగించడానికి ప్రయత్నిస్తుంటాను. యువత కోసం వివేకానందుని రచనలు చేస్తున్నాను.ఇటీవల జరిగిన ఓ భక్తి కార్యక్రమంలో సీతాచాలీసాను బృందంగా ఆలపించడంతో ఎన్నాళ్లుగానో నా మనసులో మెదిలిన ఒక ఆలోచన ఇలా రూపుదిద్దుకొని, ప్రజల ముందుకు రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. ‘పద్యం, గద్యం ఎరుగని దుర్గకు నిను కొలిచే భాగ్యం దక్కెను’ అని సీతామాతకు వందనం చెప్పాను’’ అని వివరించారు దుర్గ. – నిర్మలారెడ్డి -
భక్తితో ప్రాణం పెట్టి పాడారు..!
-
Golconda Bonalu Photos: గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)
-
శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఆధ్వర్యంలో "శివ భక్తి గీతాలాపన"
సింగపూర్: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా "శివ భక్తి గీతాలాపన" ప్రత్యేక కార్యక్రమాన్ని అంతర్జాల మాధ్యమంలో శనివారం నిర్వహించారు. కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసి ఆప్యాయంగా ఆశీస్సులు అందించిన, ఇటీవల శివైక్యం చెందిన ప్రముఖ నటి జమున , కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి నివాళిగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు సింగపూర్‌లో నివసించే గాయనీ గాయకులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, దయానంద సరస్వతి విరచిత కీర్తనలు, లలిత గీతాలతోపాటు, విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం శంకరాభరణం తదితర సినిమాల పాటలు, అలాగే జమున నటించిన నాగులచవితి సినిమా పాటలు ఆలపించడం విశేషం. ఆత్మీయ అతిథిగా వంశీ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు పాల్గొని శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వంశీ గౌరవాధ్యక్షురాలు జమున, విశ్వనాథ్‌తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి పేర్లపై త్వరలో అవార్డులు స్థాపించి కళాకారులను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. రాధిక మంగిపూడి కార్యక్రమాన్ని నిర్వహించగా గాయనీ గాయకులుగా శైలజ చిలుకూరి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, శేషు కుమారి యడవల్లి, శేషశ్రీ వేదుల, రాధిక నడాదూర్, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, అనంత్ బొమ్మకంటి, ఉషా గాయత్రి నిష్ఠల, పద్మజ వేదుల, కిరీటి దేశిరాజు తదితరులు వివిధ శివ భక్తి సంకీర్తనలను మధురంగా ఆలపించారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారధ్యంలో యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ ఈ కార్యక్రమాన్ని క్రింది లింకు ద్వారా వీక్షించవచ్చు. -
ఆమె గళమే ఒక అర్చన...
Devotional Singer Kavita Paudwal Birthday Special: మీరు విఘ్నేశ్వరుని భక్తులా? నిన్న మొన్న విడుదలైన అనురాధా పౌడ్వాల్ భజన‘మంగళకర్త సుఖ్ కే దాతా’ వినండి. ఆదిశక్తిని స్తోత్రించాలా?‘అంబే తూహై జగదంబే కాళీ’ వినండి. సాయి బాబా భక్తులైతే అనురాధా పౌడ్వాల్ పాడిన ‘షిర్డీ సాయిబాబా అమృత్వాణి’ ఉంది. అనురాధా పౌడ్వాల్ సినీ గాయనిగా ఎంత ఉల్లాసాన్ని పంచిందో భక్తి గాయనిగా అంత ఆధ్యాత్మికతనూ పంచింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్ ఇప్పుడు దేశంలో ప్రఖ్యాత భక్తి గాయని. దేశం అభిమానించే ఈ గొప్పగాయని 68వ పుట్టినరోజు నేడు. తెలుగువారిలో సాయిభక్తులకు అనురాధా పౌడ్వాల్ పాడిన ‘సాయి అమృతవాణి’ సుపరిచితం. తెలుగులో ఆమె పాడిన భక్తి గీతం అది. తెలుగులోనే కాదు టి–సిరీస్ చొరవతో సాయి భక్తి గీతాలను ఆమె అనేక భాషల్లో పాడింది. హిందీలో పాడిన భక్తి సంగీతం ఉత్తరాదిలో ఆమెను ఇంటింటి గాయనిగా చేసింది. ప్రతి ఉదయం ఆమె పాటతో నిద్ర లేచే కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. ఆమె ముఖచిత్రం ముద్రించిన సిడిలు, డివిడిలు నేటికీ అమ్ముడుపోతున్నాయి. యూట్యూబ్‌లో ఆమె భక్తి పాటలకు లక్షలాది హిట్స్ ఉంటాయి. శివుడు, వైష్ణోదేవి, హనుమంతుడు, గణేశుడు, లక్ష్మీదేవి... ప్రతి దేవుడివి, దేవతవి భక్తి గీతాలు అనురాధ పౌడ్వాల్ పాడింది. సినిమా సంగీతంలో కెరీర్ పీక్‌లో ఉండగా వాటి నుంచి విరమించుకుని తన జీవితాన్ని భక్తి సంగీతానికే అంకితం చేస్తానని ప్రకటించిన గాయని అనురాధా పౌడ్వాల్. జాతకంలో ఉంది అనురాధా పౌడ్వాల్‌కు పాటలంటే ఆసక్తి ఉన్నా పాడాలని అనుకునేది కాదు. లతా మంగేశ్కర్ పాటలంటే మాత్రం చెవి కోసుకునేది. సరదాకి కాలేజీల్లో, కొన్ని స్టేజ్ షోలలో మైక్ అందుకునేది. అయితే టీనేజ్‌లో ఉండగా ఆమెకు న్యుమోనియా వచ్చి 40 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఊపిరి తిత్తులు శక్తికోల్పోయి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆ సమయంలో ఆమెకు ధైర్యం కోసం మేనమామ ఒక టేప్ రికార్డర్, లతా పాటలున్న కేసెట్లు ఇచ్చి వెళ్లాడు. 40 రోజులు ఆ పాటలు వింటూనే జబ్బు నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆమె గొంతులో ఒక మెలొడీ వచ్చిందని అనురాధా చెప్పుకుంది. లతాలాగా ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఆమెకు ఉండేది. 18 ఏళ్లకు సంగీత సహాయకుడు అరుణ్ పౌడ్వాల్తో పెళ్లవగా అతడు ప్రోత్సహించేవాడు. ఒకసారి అతడు ఆమెను రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళితే అక్కడ లతా పాడుతున్న పాటను క్షుణ్ణంగా గమనించిన అనురాధా ఆ తర్వాతి వారం ఆల్ ఇండియా రేడియో యువవాణిలో యథాతథంగా పాడి శ్రోతలను ఆకర్షించింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ ప్రోగ్రామ్ విని ఆమె గురించి ఆరా తీశారు. ఎస్.డి.బర్మన్ ఆమెతో ‘అభిమాన్’ సినిమాలో ఒక శ్లోకం కూడా పాడించాడు. అయితే ఆ తర్వాతి ప్రయాణం సులువు కాలేదు. ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళితే ‘నువ్వు భవిష్యత్తులో భక్తిగాయనివి అవుతావు’ అని చెప్పాడు. అది విని అనురాధ ఏడ్చింది. ఎందుకంటే ఆమెకు ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఉంది. ప్రతి పాటా పెనుగులాట సుభాష్ ఘాయ్ తీసిన ‘హీరో’లో ‘తూ మేరా జానూ హై’ పాట అనురాధా పౌడ్వాల్ పాడింది. ఆ పాట హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘ఉత్సవ్’లో పాడింది. కాని ఆమెకు అవకాశాలు రాలేదు. ఆమెతో పాడించుకుంటే మొత్తం పాడించుకోండి... ఒకటి రెండు పాటలు ఆమెకు ఇచ్చి మిగిలినవి మా చేత పాడించుకోవాలనుకుంటే మేము పాడము అని ఆశా, లతా హెచ్చరిస్తే సంగీత దర్శకులు వెనుకంజ వేసేవారని అంటారు. దాంతో అనురాధ కేవలం ట్రాక్ సింగర్‌గా మిగలాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె విరక్తి చెంది భక్తి సంగీతంలోకి మళ్లుదామని ఎంత ప్రయత్నించినా మ్యూజిక్ కంపెనీలు ఆ సంగీతానికి మార్కెట్ లేదు అని తిరగ్గొట్టాయి. అప్పుడు అనురాధ పౌడ్వాల్ అప్పుడప్పుడే సంగీత రంగంలో ఎదుగుతున్న టి–సిరీస్ దగ్గరకు వెళ్లింది. దాని అధినేత గుల్షన్ కుమార్. అతడు ఆ సమయంలోనే నదీమ్– శ్రావణ్ చేత ఒక 30 పాటలు చేయించి (సమీర్ రాశాడు) వాటిని మూడు సినిమాలకు పంచి మహేశ్ భట్ చేత మూడు సినిమాలు తీయించాడు. అవే ఆషికీ, దిల్ హై కి మాన్తా నహీ, సడక్. ఆ పాటలన్నీ అనురాధా పౌడ్వాల్ చేత పాడించాడు. ఆ మూడు సినిమా లు సూపర్‌హిట్ అయ్యాయి. అనురాధ స్టార్‌గా అవతరించింది. మహా ప్రభావం అనురాధ పౌడ్వాల్, కుమార్ షాను, ఉదిత్ నారాయణ్ కలిసి ఆ సమయంలో సూపర్ హిట్స్ పాడారు. అనురాధ పాడిన ‘ధక్ ధక్ కర్నే లగా’ (బేటా) పాట మాధురి దీక్షిత్‌కు లైఫ్ ఇచ్చింది. ‘నజర్ కే సామ్నే జిగర్ కే పాస్’ (ఆషికీ) ‘ముఝె నీంద్ న ఆయే’ (దిల్), ‘కెహ్ దోకి తుమ్’ (తేజాబ్), ‘బహుత్ ప్యార్ కర్తేహై’ (సాజన్)... అనురాధా పౌడ్వాల్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టాయి. గుల్షన్ కుమార్ సినిమాల మ్యూజిక్ రైట్స్ కొంటూ అనురాధా పౌడ్వాల్ చేతే పాడించాలని చెప్పడంతో లతా, ఆశాలు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. మరోవైపు గుల్షన్ కుమార్ అనురాధా పౌడ్వాల్ ఫొటోతో భక్తి గీతాల క్యాసెట్లు రిలీజ్ చేసి ఆమెను ఇంటింటికి చేరువ చేశాడు. కాని 1997 లో కేవలం 41 ఏళ్ల వయసులో గుల్షన్ కుమార్ హత్యకు గురవడం అనురాధా పౌడ్వాల్ మానసిక స్థితిని గట్టి దెబ్బ కొట్టింది. అప్పటికే ఆమె కేవలం టి–సిరీస్‌కే పాడతాను అని ప్రకటించి ఉండటంతో అల్కా యాగ్నిక్ పుంజుకుంది. దాంతో అనురాధ మరోసారి భక్తి వైపు మనసు లగ్నం చేసి ఆ సంగీతానికి అంకితమైంది. మళ్లీ సినిమా సంగీతం వైపు రాలేదు. భర్త, కుమారుడు అకాల మరణం చెందడం అనురాధ జీవితంలో పెను విషాదం. ఆమె కుమార్తె కవిత పౌడ్వాల్ సినీ సంగీతం వైపు రాక తల్లిలాగే భక్తి సంగీతంలో కొనసాగుతూ ఉంది. అనురాధ అరాధనా స్వరం కొనసాగాలని కోరుకుందాం. -
ఎవరయినా ఆయన దగ్గరకు వెళ్లవలసిందే
భారతీయ సంస్కృతిలో – ‘రంజకత్వం కోసం పాట పాడుతున్నాను’... అనరు. నాదోపాసన చేస్తున్నాను... అంటారు. అంటే సమస్త శబ్దం ఎక్కడు పుడుతుందో దానిని నాదం అంటారు. స్వరం, శృతి... ఈ రెండూ వేర్వేరుగా ఉండే ఆస్తికత్వ బుద్ధిని విడిచిపెట్టేసి రెండూ ఒకటయిపోయి, అణగిపోయి, హృదయ కుహరంలోకి చేరిపోతే గాయకుడు నిశ్శబ్దంతో లోపల అనుభవించగల స్థితికి నాదమని పేరు. అందుకే నాదాన్ని ఉపాసన చేస్తారు. దాని ద్వారా చిట్టచివరకు పరమేశ్వరుడిని చేరుకుంటారు. సంగీతానికున్న ప్రధాన ప్రయోజనం అదే. సంగీత త్రయంలో ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిలతో పాటూ త్యాగరాజస్వామి కూడా ఉన్నారు. ఆయన జీవితపర్యంతం రామోపాసన చేసారు. అంటే శివద్వేషి అని కాదు. రాముడిని ఇష్టదైవంగా చూస్తూ ఆయన మీద పాటలు పాడి తరించిన వ్యక్తి. ఏదీ సంపాదించి దాచుకోవలసిన అవసరం ఉండదనే పండిపోయిన వ్యక్తిత్వం ఉన్న సద్గురు ఆయన. అందుకే ఆయన కీర్తనల్లో తత్త్వ సంబంధ విషయాలు ఆవిష్కృతమవుతుంటాయి. గానవైభవం గురించి ఆయన ఒక సందర్భంలో...‘‘నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’’ అనీ,...‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అనీ.. ‘‘సద్యోజాతాది పంచ వక్త్రజ స–రి–గ–మ–ప–ధ–ని వర సప్త–స్వర విద్యా లోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాద తనుమనిశం శంకరం’’ అన్నారు. శంకరభగవత్పాదులు శివుడి గురించి ఎలా చెప్తారో, వేదం శివుడి గురించి ఎలా మాట్లాడుతుందో, పోతనగారు శివస్వరూప తత్త్వాన్ని ఎలా ప్రతిపాదన చేసారో...ఆ తత్త్వం అంతటా నిండి ఉండేది అన్నట్టుగా త్యాగరాజస్వామి సంగీతపరంగా శంకరుడెవరన్న దాన్ని ఆవిష్కరించారు. నాద తనుమనిశం శంకరం–శంకరుడికి ఒక శరీరం ఉన్నదని కదా..సాకార రూపంలో చూసి... అంటే సగుణంగా చూసి ఆరాధన చేస్తారు. అయితే అలా చేసేవాడు కోర్కెలున్న వాడు. అలా కాక కేవలం నిర్గుణంగా ఉపాసన చేసిన వాడు జ్ఞానపిపాస కలిగినవాడు. ‘‘ఆర్తికలిగినవాడు, జిజ్ఞాసువు, అర్ధార్తిః, జ్ఞాని .. నలుగురూ ఆయన (పరమేశ్వరుడు) దగ్గరకే వెడతారు. ‘నాకిది కావాలి’ అని ఆయననే అడుగుతారు’’...అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పే ఉన్నాడు. కాబట్టి ఎవరయినా ఆయన దగ్గరకు వెళ్ళవలసిందే. శంకరుడి శరీరం ఎలా ఉంటుందో చాలా ధ్యాన శ్లోకాలు వర్ణిస్తాయి. కానీ అసలు నాదమే–శంకరుడి శరీరం. ‘నాద తనుమనిశం శంకరం నమామి’... అనిశం–సర్వకాలాల్లో నాదమే ఆయన శరీరం– అని త్యాగరాజ స్వామి ప్రతిపాదిస్తూ...అది ‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్ నమామి మే మనసా శిరసా’. నమామిమే ..నేను నమస్కరించుచున్నాను. ఎలా..మనసా శిరసా...శిరస్సు వంచి మనసుతో నమస్కరిస్తున్నాను. నమస్కారం త్రికరణ శుద్ధిగా ఉండాలి కదా..స్వామి వారి దగ్గరకు వెడితే.. కరాభ్యాం, కర్ణాభ్యాం, ప్రణామోస్తంగముచ్యతే’ అంటూ మూడింటిని ఒకటి చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా..మరి ఇక్కడ ఆ మూడు ఏమిటి.. మనసా.. అంటే లోపల ఉన్న శివుని వైభవాన్ని ఊహిస్తూ ఆ తత్త్వాన్ని శిష్యులముందు ఆవిష్కరించడం, శిరసా.. అంటే నేలమీదపడి సాష్టాంగం చేయడానికి అవకాశం లేనప్పుడు, ఉత్తర క్షణం నమస్కారం చేద్దామని అనిపించినప్పుడు, రెండు చేతులు కైమోడ్చి శిరసు తగిలేటట్లుగా వంగి నమస్కారం చేయడం, ఇక వాక్కే కీర్తన.. వాగ్రూపంగా మనసు, శిరసు మూడింటిని కలిపి శివునికి నమస్కరించడం. మోదకరే... మోదం అంటే సంతోషం పొందడానికి. పరమేశ్వరుని పాదాలు విడవకుండా ధ్యానంలో నిమగ్నమై పరమ ప్రశాంతమైన నిశ్చలమైన స్థితిని పొందడం. నాదోపాసనకిది పరాకాష్ట. ఇదీ భారతీయ ఆత్మ. -
అందాల తారల క్రిస్మస్ గీతాలు
డిసెంబర్ మాసం కోసం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు. రంజాన్ మాసంలాగే నెలరోజుల నుంచే వేడుకల కోసం సిద్ధపడుతుంటారు. చర్చీలన్నీ ప్రత్యేక ప్రార్థన గీతాలతో మార్మోగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా యువతీ యువకులు సంగీత వాయిద్యాలతో ‘క్రిస్మస్ క్యారల్స్’ పేరుతో ఇంటింటికీ తిరిగి పాటలు పాడుతారు. ‘హ్యాపీ క్రిస్మస్! మెరీ క్రిస్మస్!’ అంటూ జింగిల్ బెల్స్‌లా ప్రతిధ్వనిస్తుంటారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెబుతారు. వాతావరణమంతా క్రిస్మస్ గుబాళింపులతో చలికాలపు రాత్రులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ధనిక దేశాలు ఉత్సవాలను ఎంత ఆడంబరంగా జరుపుకున్నా, భారతదేశంలోని దళితవాడలు కూడా ఉన్నంతలో ఘనంగానే పండుగ జరుపుకుంటాయి. తమ తమ పేటల ముందు పోటీలు పడుతూ పెద్ద పెద్ద నక్షత్రాలు అలంకరిస్తారు. వాటి ప్రభలు నలువైపులా ధగధగలాడుతూ ఉంటాయి. ఈ సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కన్నుల పండుగలా కనిపిస్తుంది. క్రిస్మస్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది పాటలు. విశ్వమంతా క్రిస్మస్ జరుపుకునే రోజుల్లో వారి వారి భాషల్లో హుషారుగా పాటలు పాడుకుంటారు. పారవశ్యానికి లోనవుతారు. తెలుగులో కూడా గొప్ప క్రిస్మస్ సాహిత్యం ఉంది. ఏ మతానికైనా సాహిత్యమే ప్రాణాధారం. అవి భజనలు అయినా, స్తుతి గీతాలైనా భక్తుల్ని, శ్రోతల్ని ఆకట్టుకుంటాయి. క్రైస్తవమతం తెలుగు ప్రాంతాల్లో పాదం మోపాక ఇక్కడి భాష సంస్కృతులతో, సంగీతాలతో మేళవించిన ‘ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు’ ఆవిర్భవించాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణా ఏర్పడ్డాక ‘ఆంధ్ర’ శబ్దానికి బదులు, ‘తెలుగు క్రై స్తవ కీర్తనలు’ అని పేరు మార్చుకున్నారు. అయితే తొలినాటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథాన్ని 1866లో ప్రథమ విదేశీ తెలుగు వాగ్గేయకారుడు విలియం డాసన్ ప్రచురించాడు. అతడు అచ్చం పదహారణాల తెలుగువాడిలా వేషంకట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చిడతలు వాయిస్తూ భక్తి పారవశ్యంలో శ్రీకాకుళం వీధుల్లో తన స్వీయ సంకీర్తనలు పాడేవాడు. మచ్చుకి ఒక పాట వినండి. అతడి భాషా పటిమ మనల్ని అబ్బురపరుస్తుంది. విలియం డాసన్.78వ కీర్తన. పల్లవి: యేసు భజనయే మనలను ఆ సుగతికి దీయు – జనులారా దాస జనులు జేయు, పలు దోసములు మోయు చరణం: అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్షమను దీక్షన్ రెవరెండ్ విలియం డాసన్ విదేశీయుడైనప్పటికీ ఇతడి శబ్దాలంకార ప్రావీణ్యం ఆశ్చర్యపరుస్తుంది. నమ్మశక్యం కాని నిజమేమిటంటే ఇతడే తొలి తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. ఈయన తర్వాతే పురుషోత్తము చౌధరి డాసన్ దొరతో కలిసి ఎన్నో కీర్తనలు రాయడం గమనించాల్సిన అంశం. ఇద్దరూ సమకాలీనులే. అయితే, ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. ‘చౌధరి’ కులవాచకం కాదు. ‘చౌ’ అంటే æనాలుగు. ‘ధరి’ అంటే భూమి. నాలుగు పరగణాల నేలకు అధిపతిని ఉత్తరభారతంలో ‘చౌధరి’ అని పిలుస్తారు. ఉదా: బాబూ ఖాన్ చౌధరి, సలీల్ చౌధరి. అయితే పురుషోత్తముడు బెంగాలీ బ్రాహ్మడు. తెలుగువాడు కాదు. ఒడిశాకు వలస వచ్చినవాడు. బహుభాషా కోవిదుడు. క్రీస్తు భక్తుడు. ఆ తరువాత కాలంలో 1893లో విలియం డాసన్‌తో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం తేవడంలో కీలక పాత్ర నిర్వహించాడు. ∙∙ ఇప్పటి ఆధునిక సంగీతపు హోరులో పాటల భావం సరిగా వినిపించడంలేదు. పాత కాలంలోనైతే క్రీస్తు జయంతి సందర్భంగా ఏ చర్చిలో విన్నా తెలుగు కీర్తనలు వినబడుతూ ఉండేవి. (109) ఎన్. డీ. ఏబెల్ గారు రచించిన ఈ కీర్తన ఎంతో ప్రసిద్ధమైనది. ‘చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వజనాంగామా సంతస మొందుమా’ బిలహరి రాగంలో త్రిపుట తాళంలో శాస్త్రీయంగా పాడుకునే ఈ కీర్తన ఈనాటికీ చెక్కు చెదరలేదు. చెవులకు ఇంపు కలిగించడం మానలేదు. అలాంటిదే మరోగీతం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల లోనిదే, వరుస సంఖ్య 112. ‘రక్షకుండుదయించి నాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారె గొల్ల బోయలార తక్షణమే బోయిమనని రీక్షణ ఫల మొందుదము చ: దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహావా మన దిక్కుచేరి చూచినాడు’ మధ్యమావతి రాగంలోఅట తాళంలో పుట్టిన ఈ ప్రఖ్యాత క్రిస్మస్ కీర్తనకారుడు పందొమ్మిదో శతాబ్దపు మోచర్ల రాఘవయ్య. మరో ప్రసిద్ధ క్రీస్తు జనన విశేష గీతాన్ని (121) కొమ్ము కృప రాసింది. ‘శ్రీ యేసుండు జన్మించె రేయిలో– నేడు పాయక బెత్లేహేము యూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున– నిమ్మాను యేలనెడి నామమందున.’ ఈ విఖ్యాత గీతం కర్ణాటక ముఖారి రాగంలోనూ అట తాళంలోనూ లయాన్వితంగా ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఇద్దరు ముగ్గురు స్త్రీ కీర్తనకారులుండడం గమనించవలసిన అంశం. ఒకరు పైగీతం రాసిన కొమ్ము కృప. మరొకరు వేశపోగు గుల్బానమ్మ (గుల్+బానో+అమ్మ). పరిశోధన దృష్టితో పరిశీలిస్తే మొట్టమొదటి క్రైౖస్తవకీర్తన రాసిన తొలి తెలుగు క్రైౖస్తవకీర్తనకారిణి వేశపోగు గుల్బానమ్మగా గుర్తించాలి. ఇక మూడవ గీత రచయిత్రి పిల్లి విజయ చార్లెస్. ఈమె పేరు ఈ మధ్యనే పరిష్కరణ ప్రతిలో చేర్చారు. ∙∙ క్రైౖస్తవమతం లేదా మార్గం తెలుగు ప్రాంతాల్లో ప్రవేశించిన తరువాత 1746లో బెంజిమన్ షుల్జ్ ‘నూరు జ్ఞాన వచనాలు’ అనే తొలి తెలుగు క్రైౖ స్తవ పుస్తకం ప్రచురించాడు. ఇదే తెలుగులో అచ్చయిన మొదటి గ్రంథం. చాలాకాలం అజ్ఞాతంగా ఉండిపోయింది. కొన్ని శతాబ్దాల తరువాత వాసిరెడ్డి పద్మ, సన్నిధానం నరసింహ శర్మ (సేకరణకర్త), ఎండ్లూరి సుధాకర్ సంపాదకత్వంలో పునర్ముద్రణ పొందింది. 2006లో ఈ గ్రంథాన్ని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డిగారు రాజమండ్రి సమీపంలో ఉండే మధురపూడి విమానాశ్రయంలో ఆవిష్కరించారు. సాహిత్య చరిత్రలో అదొక మరపురాని సంఘటన.ఈ గ్రంథాన్ని కె.ఎన్. వెస్లీ ప్రచురించడం విశేషం. జర్మన్ సౌవార్తికుడు (మిషనరీ) బెంజిమన్ షుల్జ్, ఇద్దరు తెలుగు స్వర్ణకారుల చేత అచ్చులు పోయించి ‘నూరుజ్ఞాన వచనాలు’ జర్మనీ దేశంలో ప్రచురించాడు. అప్పటికింకా ప్రెస్ రాలేదు, ‘వావిళ్ళ’వారు కూడా పుట్టనేలేదు. ఈక్రమంలో విలియం కేరీ అనే మరో సౌవార్తికుడు1818లో మొట్టమొదటిసారి ‘పరిశుద్ధ గ్రంథం’ పేరుతో తెలుగు బైబిల్ తీసుకువచ్చాడు. ఆ తరువాత చాలా బైబిళ్ళు తర్జుమా చేయబడ్డాయి. ఈనాటికీ ఎంత పేద క్రైస్తవుల ఇంట్లోనైనా ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనల పుస్తకం, తెలుగు బైబిల్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవే తమ ఆస్తులుగా ఆ విశ్వాసులు భావిస్తూ ఉంటారు. ∙∙ ఎందరో గీతరచయితలు అజారమరమైన కీర్తనలు రచించి ఆంధ్ర క్రైౖ స్తవ కీర్తనలకు తెలుగు శోభను సంతరించారు. కథోలిక (కాథలిక్) గీతాలు కూడా విశేష ప్రాముఖ్యాన్ని పొందాయి. క్రిస్మస్ గీతాల వస్తురూపాలన్నీ క్రీస్తు జన్మదిన విశేషాల మీదే ఆధారపడి ఉంటాయి. అట్లా అని ఇతర ప్రక్రియలు లేవా అంటే చాలానే ఉన్నాయి. తెలుగు క్రైౖ స్తవ సాహిత్యానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రబంధాలు, కావ్యాలు, నాటక నాటికలు, గేయ మాలికలు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం గుర్రం జాషువ 1921లో ‘చిదానంద ప్రభాతము’ అనే క్రిస్మస్ నాటకం సంప్రదాయ పద్ధతిలో రాశాడు.’క్రీస్తు చరిత్ర’ (1964) అనే కావ్యం కూడా వెలువరించాడు. ఈ కావ్యానికి 1965లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అటు నాటకానికి, ఇటు కావ్యానికి దళిత క్రై స్తవుడిగా జాషువాయే ‘ఆదికవి’ అనడంలో అనౌచిత్యం లేదు. మళ్లీ క్రిస్మస్ గీతాల దగ్గరికి వస్తే తొలినాటి పాటలన్నీ జర్మన్లోంచో, ఆంగ్లంలోంచో అనువాదం చేసుకున్నవే. వీటి స్వరగతులు కూడా యథాతథంగా ఉంటాయి. అందరికీ తెలిసిన ఈ ఉభయ భాషల గీతం పరిశీలించండి. "Silent night, ho-ly night All is calm, all is bright Round you virgin mother and child Holy infant so tender and mild Sleep in heavenly peace" ‘శుద్ధ రాత్రి! సద్దణంగ నందరు నిద్రపోవ శుద్ధ దంపతులే మేల్కొనంగా బరిశుద్ధుడౌ బాలకుడా! దివ్య నిద్ర పోమ్మా! దివ్య నిద్ర పోమ్మా!! ఈ ప్రపంచ ప్రసిద్ధి పొందిన గీతాన్ని అన్ని ఖండాల ప్రజలు తమ తమ భాషల్లో భావ గాంభీర్యంతో, ఏక కంఠంతో పియానో శ్రుతులతో అత్యంత ప్రేమగా పాడుకుంటారు. క్రిస్మస్ రోజుల్లో ఏ క్రైౖస్తవ గృహాన్ని సందర్శించినా సందడే సందడి. అతిథులతో ఆత్మీయులతో, రకరకాల కేకు రుచులతో పిల్లలూ పెద్దలు క్రిస్మస్ తాతలతో కేరింతలు కొడుతూ ఉంటారు. బాలక్రీస్తు గీతాలకు తన్మయులవుతారు. ఆకాశం రంగులీనుతూ ధగధగా మెరిసిపోతున్నపుడు ఎక్కడి నుంచో ‘నడిపించు నా నావ’, ‘మార్గము చూపుము ఇంటికి/నా తండ్రి ఇంటికి’ లాంటి పాటలు రాసిన ప్రసిద్ధ గీతరచయిత రెవ.డా.ఎ.బి మాసిలామణిగారి’ అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో/ అవతార మూర్తి యేసయ్యకీర్తి అవని జాటుచున్’ అనే గీతం విన్నప్పుడు మనం కూడా ఆ ఆనందసముద్రంలో తేలిపోతుంటాం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మమత, సమత, మానవత ప్రకటించాడు. ‘నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించ’మని గొప్ప శాంతిసందేశాన్ని అందించి సిలువ మీద నెత్తుటి కొవ్వొత్తిలా కరిగిపోయాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి అత్యవసరమైనది ప్రేమ. ఆ ప్రేమమయుని జన్మదినమే క్రిస్మస్. -ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట
ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిణి, సీనియర్ సివిల్ సర్వెంట్ రాఖీ గుప్తా ఇటీవల విడుదల చేసిన భక్తి గీతం ‘మై తోహ్ రతుంగి రాధా నామ్’ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నాలుగన్నర నిడివి గల ఈ పాటను అక్టోబర్ 18వ తేదీన యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. ఈ వీడియో రాధా కృష్ణలకు సంబంధించింది. ఇది కృష్ణుని పట్ల భక్తులకు ఉండే భావాన్ని తెలియజేస్తోంది. ఈ వీడియోని రాఖీ గుప్తా ఆమె తల్లికి, తన కుటుంబ సభ్యులకు అంకితమిచ్చింది. శ్రీకృష్ణుడు జన్మించిన బృందావనంలోనే ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో తీయాలని గత ఏడాదే అనకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. దీనికి గౌరవ్ దేవ్, కార్తీక్ దేవ్ సంగీతమందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలా బాగా నటించారు అని కొందరు నెటిజన్లు ప్రశంసించగా, మీ స్వరంతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు మేడం అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. చదవండి: అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే -
హరోం హర
‘‘దేవగణార్చిత సేవిత లింగం భావై ర్భక్తిభిరేవ చ లింగమ్! దినకర కోటి ప్రభాకర లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్!!’’ ...శైవక్షేత్రాల్లో భక్తిగీతాలు మార్మోగుతుండగా ‘హరహర శంకర భ క్తవ శంకర.. శంభో హరహర నమోఃనమోః’ అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం అన్ని రోడ్లూ, వాహనాలు భక్తులతో కిటకిటలాడారుు. అర్చకులు మంత్రోచ్ఛారణ చేసి స్వామివారికి పూలు, విభూది, రుద్రాక్ష లు, బిళ్వదళాలు సమర్పించారు. శివలింగాలకు పాలాభిషేకం చేశారు. జాతర జరిగే ప్రాంతాలకు వేలాది గా తరలివచ్చిన భక్తులు అక్కడే ఉన్న కొలను, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు ప్రముఖులు క్షేత్రాలను సందర్శించి పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఖమ్మం కల్చరల్: ద్వాదశ జ్యోతిర్లింగాల ఏర్పాటు జిల్లాకే గర్వకారణమని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పోంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైలాస, ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, చైతన్య అలంకారాల ప్రదర్శన మంగళవారంతో నాలుగో రోజుకు చేరింది. మహాశివరాత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా నాల్గో రోజు ఇక్కడకు విచ్చేసి ప్రదర్శనను తిలకించారు. బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాల విశిష్టతను ఎంపీకి వివరించారు. ఆధ్యాత్మికత వల్ల లభించే ప్రశాంతత గురించి చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రలకు చెందిన జ్యోతిర్లింగాలను ప్రత్యేక చొరవ తీసుకుని ఖమ్మంలో ప్రదర్శనగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వాటి విశిష్టతను తెలియజెప్పేందుకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్న బ్రహ్మాకుమారీల కృషిని కొనియాడారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శన విజయవంతం కావాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం శివాలయూల్లో ప్రత్యేక పూజలు చేశా.. ప్రజల శ్రేయస్సుకోసం జిల్లాలోని వివిధ శివాలయాల్లో శివరాత్రిని పురష్కరించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు ఎంపీ తెలిపారు. క్షీరాభిషేకం, రుద్రాభిషేకం తదితర పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. జిల్లా ప్రజానీకం పాడిపంటలతో తులతూగాలని పరమేశ్వరుని కోరానన్నారు. శివాలయూల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటిని బ్రహ్మకుమారీలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలాసంపత్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి సాధు రమేశ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు, పత్తి శ్రీను పాల్గొన్నారు. -
గురుపౌర్ణమికి షిర్డీ ముస్తాబు
సాక్షి, ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ ముస్తాబైంది. రకరకాల పూలతో, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ముస్తాబుచేసే అలంకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. షిర్డీలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో గురుపౌర్ణమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సాయిబాబా ఆలయ సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉత్సవాల సమయంలో ఆలయంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. భజన బృందాలు భక్తి పాటలు, కీర్తనలు ఆలపించేందుకు ఆలయం పక్కన 75 వేల చ.ట. భారీ మండపం ఏర్పాటు చేశారు. వర్షాలతో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులందరికి ప్రసాదం సులభంగా లభించాలనే ఉద్దేశంతో 275 క్వింటాళ్ల చక్కెర లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. పల్లకీలతో వచ్చే భక్తులు బస చేసేందుకు సాయి ఆశ్రమం-2 లో ఉచితంగా సౌకర్యం కల్పించి, బస, భోజన ఏర్పాట్లు చేసినట్లు బాబా ఆలయ సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి కుందన్‌కుమార్ సోనవణే తెలిపారు. రెండు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో వైద్యులు రెండు షిప్టులకీ పనిచేస్తారని సోనవణే అన్నారు. ఈ ఉత్సవాలు పారదర్శకంగా నిర్వహించేందుకు బాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి, సంస్థాన్ పదాధికారి అనీల్ కవాడే, ఇతర పదాధికారులు కృషి చేస్తారని ఆయన అన్నారు. మూడు రోజులు జరిగే కార్యక్రమాలు : 11న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మాధవ్‌రావ్ ఆజేగావ్కర్గారి కీర్తనలు ఉంటాయి. రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు సుమీత్ బోపాల్ గారి సాయి అమృత్ కథ కార్యక్రమం ఉంటుంది. 12న సాయంత్రం నాలుగు గంటలకు వివిధ భక్తుల కీర్తనలు ఉంటాయి. రాత్రి 7.30 నుంచి వివిధ భక్తి నాటకాల ప్రదర్శన ఉంటుంది. 13న ఉదయం 10.30 గంటలకు ఉట్టి ఉత్సవం, కీర్తనల ఆలాపన, రాత్రి 7.30 గంటలకు సాయి మిలన్ అనే భక్తి కార్యక్రమం ఉంటుందని కుందన్‌కుమార్ అన్నారు. హైదరాబాద్, ముంబై, జబల్పూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు అందజేసిన విరాళాలతో ఈ మూడు రోజుల పాటు షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచిత భోజన వసతి కల్పించినట్లు ఆయన చెప్పారు.