దుర్గ రాసింది సీతా చాలీసా!  | Sita Chalisa written by Durga | Sakshi
Sakshi News home page

దుర్గ రాసింది సీతా చాలీసా! 

Published Wed, Nov 29 2023 3:40 AM | Last Updated on Wed, Nov 29 2023 6:03 AM

Sita Chalisa written by Durga - Sakshi

హనుమాన్‌ చాలీసా, సాయి చాలీసా గురించి మనకు తెలుసు.సీతా చాలీసాను రాసి, వినిపిస్తున్నారు డాక్టర్‌ జిఎల్‌కె దుర్గ.ఆంధ్రమహిళా సభ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ అయిన దుర్గ మోటివేషనల్‌ స్పీకర్‌గానూ యువతలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు.అరవైఏడేళ్ల వయసులో జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుంటూ స్ఫూర్తిని కలిగించే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. 

‘‘నేటి మహిళల పరిస్థితి చూస్తుంటే ఒక పక్కన ఆకాశంలోకి దూసుకుపోతున్నాం... మరోపక్కన అథోలోకంలోకి కూడా వెళుతున్నామా అనిపిస్తుంది. ఓవైపు అమ్మాయిలను ఆకాశం అంత ఎత్తు ఎదగాలని ప్రోత్సహిస్తున్నాం.. మరోవైపు ఇంకా స్త్రీ భ్రూణహత్యలు జరగడం చూస్తున్నాం. మహిళలు ఎదగాలంటే మగవారిలోనూ మార్పు రావాలి. ఇప్పటికన్నా ఇతిహాస కాలం నాటి రోజులను తెలుసుకుంటే నాటి మహిళ తెగువ, సమయస్ఫూర్తి మనకు కనిపిస్తాయి. సీతా చాలీసా స్త్రీ కేంద్రకంగా ఉంటుంది.

తెలుసుకుంటూ చేసిన ప్రయత్నం
శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి మా అత్తగారి ఊరు వెళ్లాం. అక్కడ అమ్మవారికి మంగళసూత్రధారణ జరిగేటప్పుడు రామ, హనుమాన్‌ చాలీసా ఉంది, సీతాచాలీసా గురించి లేదే... అనిపించింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అదే విషయం మనసులో మెదులుతుండటంతో ఇంటర్నెట్‌లో శోధించాను. నాకున్న స్నేహితులు, పెద్దలను అడిగాను. తెలుగులో సీతా చాలీసా లేదు. హిందీలో ఉంది కానీ... బాణీ వేరుగా ఉంది. దీంతో తెలుగులో సీతా చాలీసా రాయాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం వాల్మీకి రామాయణాన్ని పారాయణ చేస్తూ... అందులో నుంచి సీతాదేవి గురించి ఉన్న వ్యాఖ్యానాలు రాసుకుంటూ వచ్చాను.

ఈ ప్రయాణంలో చాలా మంది మిత్రులు, పెద్దలు నాకు సాయం చేశారు. నిజానికి వాల్మీకి మహాకవి, రామాయణ కథానాయిక అయిన సీత గురించి చాలా గొప్పగా... రాముడికి ఏ మాత్రం తీసిపోని విధంగా చెప్పారు. అందం, సుగుణాలలోనే కాదు సహనం, ధైర్యం, తెలివితేటలు, ఔదార్యం, సమయస్ఫూర్తి, మాటలు .. ఇలా అన్నింటì లోనూ ఆమె గొప్పతనం గురించి వివరించారు.

సీతాదేవి బాల్యం, యవ్వనం, స్వయంవరం, కల్యాణం, అరణ్యవాసం, అశోకవనం, రావణ వధానంతరం రామునితో తిరిగి అయోధ్య చేరడం, పట్టాభిషేకం, అనంతరం అడవులకు వెళ్లడం, అక్కడినుంచి వాల్మీకి ఆశ్రమం చేరడం, లవకుశులను పెంచడం, చివరగా తల్లి భూదేవిలో కలిసిపోవడం వరకు ఆమె జీవనం ఎంత శక్తిమంతమైనదో... అదంతా చాలీసాలో వచ్చేలా కూర్చాను. బాల్యంలో ఆడుకుంటూ శివధనస్సును ఉంచిన మంజూషను జరిపినది అని ఉంటే.. ‘శివధనస్సును అవలీలగా జరిపిన బాలవు నీవు’ అని,  హనుమతో మాట్లాడేటప్పుడు..‘రాముని ధ్యాసే శ్వాసగ నిలిపి తపమొనరించిన తాపసి వీవు’ అని అశోకవనంలో చెప్పడం.. పట్టాభిషేక సమయంలో హనుమకు పుత్రవాత్సల్యంతో ఇచ్చిన అపురూపమైన మణిహారం గురించి ..  ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని ఆమె గుణగణాలను వివరిస్తూ చేసే చాలీసా మనలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. 

నాన మ్మ చెప్పిన కథలు.. 
నేను కామర్స్‌ సబ్జెక్ట్‌తో పీహెచ్‌డి పూర్తి చేసి, ఆంధ్ర మహిళా సభలో 35 ఏళ్లుగా లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా చేసి రిటైర్‌ అయ్యాను. ఆంధ్ర మహిళాసభ, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభకు వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నాను. కాలేజీ రోజుల్లో బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డ్‌తో పాటు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు పొందాను. కామర్స్‌ స్టూడెంట్‌ని అయినా తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అలా, సంస్కృతం కూడా నేర్చుకున్నాను. అందుకు మా నానమ్మే కారణం. నా చిన్నతనంలో ఆమె ప్రతిరోజూ పడుకునే సమయంలో రామాయణంలోని కథలు చెప్పేది. ఆధ్యాత్మికతను పెంచే గజేంద్ర మోక్షం, రామాయణ, మహాభారతాల గురించి చెప్పేది. ఆ ఆసక్తితోనే పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. ఇప్పటికి కూడా ప్రతి రోజూ ఉదయం రెండు గంటల సమయం రాయడానికి కేటాయిస్తే, రాత్రి రెండు గంటల సేపు చదవడానికి కేటాయిస్తాను. 

ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి.. 
పదేళ్లుగా మోటివేషనల్‌ స్పీకర్‌గా ఉన్నాను. టీచింగ్‌ వృత్తిలో కొనసాగడం వల్ల యువతకు, మహిళలకు మంచి విషయాలు నా ద్వారా వెళ్లడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో మార్పు వచ్చేందుకు చేసే ఏ చిన్న పని అయినా ముందుండేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, ఆ రోజు ఏ టీచర్‌ అయితే రాలేదో ఆ స్థానంలో నేను మోటివేషనల్‌ క్లాస్‌ తీసుకుంటాను. జైలుకు వెళ్లి ఖైదీలకు మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. 

మహిళల కోసం ప్రత్యేకం.. 
స్టాండప్‌ కామెడీ చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. అత్తగారు–కోడళ్ల మధ్య ఉండాల్సిన బంధాలు, మహిళల ఆరోగ్యం, చదువుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, నాదైన బాణీలో నవ్విస్తూనే వారిని వారు దిద్దుకునే ఆలోచన కలిగించడానికి ప్రయత్నిస్తుంటాను. యువత కోసం వివేకానందుని రచనలు చేస్తున్నాను.ఇటీవల జరిగిన ఓ భక్తి కార్యక్రమంలో సీతాచాలీసాను బృందంగా ఆలపించడంతో ఎన్నాళ్లుగానో నా మనసులో మెదిలిన ఒక ఆలోచన ఇలా రూపుదిద్దుకొని, ప్రజల ముందుకు రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. ‘పద్యం, గద్యం ఎరుగని దుర్గకు నిను కొలిచే భాగ్యం దక్కెను’ అని సీతామాతకు వందనం చెప్పాను’’ అని వివరించారు దుర్గ. – నిర్మలారెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement