ఆధునిక విజ్ఞానం దూరాలను దగ్గర చేసింది. కాని మనుషులను, మనసులను దగ్గర చేయలేక పోయింది. విజ్ఞానం విస్తరించిన కొద్దీ అజ్ఞానం పటాపంచలు కావలసింది పోయి వెర్రితలలు వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. నిజానికి దేవుడు మనిషిని బుధ్ధిజీవిగా, విజ్ఞాన స్రష్టగా, మంచీచెడుల విచక్షణ తెలిసిన వాడుగా సృష్టించాడు. అంతేకాదు, మానవజాతి మూలాల రహస్యాన్నీ విడమరచి చెప్పాడు. మానవులంతా ఒకేజంట సంతానమన్నయదార్ధాన్ని ఎరుక పరిచాడు. సఛ్ఛీలత, నైతిక విలువలు, దైవభక్తి విషయాల్లో తప్ప ఎవరికీ ఎవరిపై ఎలాంటి ఆధిక్యతా లేదని స్పష్టం చేశాడు.
కనుక కులం, మతం, జాతి, ప్రాతం, భాషల ఆధారంగా అడ్డుగోడలు నిర్మించుకోడానికి, సరిహద్దులు గీసుకోడానికి లవలేశమైనా అవకాశంలేదు. కాని కులం, మతం, జాతి, భాష, ప్రాంతీయతలను ప్రాతిపదికగా చేసుకొని, మనిషి మరోమనిషిపై దాడికి దిగుతున్నాడు. ఇతరుల ధనమాన ప్రాణాలను హరిస్తున్నాడు. వారి గౌరవ మర్యాదలతో చెలగాట మాడుతున్నాడు. తల్లి, చెల్లి, ఇల్లాలు అని కూడా చూడకుండా స్త్రీలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. సృష్టిలో శ్రేష్ట జీవి అయిన మానవుడు తన స్థాయిని, శ్రేష్టతను, ఔన్నత్యాన్ని మరిచి విలువలకు తిలోదకాలిచ్చి, మానవుడిగా చేయకూడని పనులన్నీ చేస్తూ మానవత్వానికి కళంకం తెచ్చి పెడుతున్నాడు.
ఎందుకిలా జరుగుతోంది... దీనికి కారణమేమిటంటే, మానవుడు జీవన సత్యాన్ని గుర్తించడంలేదు. పుట్టుక, చావుకు మధ్యనున్న జీవన్నాటకమే సర్వస్వమని భ్రమిస్తున్నాడు. నేటి తరువాత రేపు ఎంత నిజమో, మరణం తరువాత మరణానంతర జీవితమూ అంతే నిజమన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు. ఇక్కడ ఈ జీవితంలో చేసిన ప్రతి పనికీ, పలికిన ప్రతిమాటకు రేపు ఆ జీవితంలో, పరమ ప్రభువైన అల్లాహ్ సన్నిధిలో సమాధానం చెప్పుకోవాలన్న విషయాన్నే మరిచి పొయ్యాడు. అందుకే ఈ బరితెగింపు.
పరలోక జీవితాన్ని నమ్మి, దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉందన్న విషయం మనసా, వాచా, కర్మణా విశ్వసించినట్లయితే మనసులో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలూ తలెత్తవు. ఇతరులకు హాని చేయాలన్న తలంపే మనసులో రాదు. అందరూ తనలాంటి వారే అన్న స్పృహ జాగృతమవుతుంది. వసుధైక కుటుంబ భావన పాదుకుంటుంది. దైవం సమస్త మానవాళినీ సన్మార్గపథాన నడిపింప జేయాలని, శాంతి వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment