కలియుగ కల్పవృక్షం | Raghavendra Swamy Jeeva Samadhi In Family | Sakshi
Sakshi News home page

కలియుగ కల్పవృక్షం

Published Sun, Aug 18 2019 8:36 AM | Last Updated on Sun, Aug 18 2019 8:43 AM

Raghavendra Swamy Jeeva Samadhi In Family - Sakshi

తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండల శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 17), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 348 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి.
ఈ సందర్భంగా స్వామివారి గురించి...
మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన మధ్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారం చేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మధ్వ సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మధ్వ సిద్ధాంత ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణం కోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.

క్రీ.శ.1595 సంవత్సరం, మన్మథ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. 

శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక’ అనే గ్రంథానికి ‘ప్రకాశం’ అనే వివరణ రాశారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక’సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్‌ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు.

స్వామిని పరీక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ కప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రజలం చల్లగా మాంసం పువ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల’ గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్‌ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు.
స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు.

అందుకే ఆయన దేవుడయ్యాడు...
శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. 
రాఘవేంద్ర స్వామివారి మూల మంత్రం
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే

ఆ అక్షతలే లక్షింతలుగా... 
పూజ్య రాఘవేంద్ర స్వామి వారి బృందావన దర్శనానికి వచ్చిన భక్తులకు మఠాధిపతులు పరిమళ భరితమైన మంత్రాక్షతలను లేదా మృత్తికను ఇచ్చి ఆశీర్వదిస్తుంటారు. స్వామివారు భౌతిక శరీర ధారులై ఉన్నప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. స్వామి తన భక్తులకు స్వయంగా ఇచ్చిన మృత్తిక కూడా ఎంతో మహిమాన్వితమైనదిగా పేరొందింది. పవిత్రమైన ఈ కుంకుమాక్షతలను భక్తులు ఇళ్లకు తీసుకువెళ్లి శుభకార్యాలలోనూ, ఇతరత్రా ఏమైనా ఆపత్సమయంలోనూ శిరస్సున ధరిస్తుంటారు. 

మహా రథోత్సవం
ప్రతి యేటా శ్రావణ మాసంలో జరిగే రాఘవేంద్రుల ఆరాధనోత్సవానికి భక్తులు భారీ ఎత్తున హాజరవుతారు. ఇప్పటికే బుధవారం నాడు అంకురార్పణతో ఆరంభమైన ఈ ఉత్సవాలు శుక్ర, శని వారాలలో జరిగే పూర్వారాధన, మధ్యారాధన, నేడు జరగనున్న ఉత్తరారాధనగా జరుగుతాయి. ఈ రోజున మంత్రాలయంలో జరిగే మహా రథోత్సవం అత్యంత వైభవంగా... కన్నుల పండువగా జరుగుతుంది. ఆఖరిరోజైన 20వ తేదీన అనుమంత్రాలయంగా పేరొందిన తుంగభద్ర గ్రామంలో జరిగే రథోత్సవంతో స్వామివారి ఆరాధనోత్సవాలు ముగుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement