మా ఊరు మణిపూస
- సంపూర్ణ మద్య నిషేధం అమలు
- వివేకానందుని బోధనలే స్ఫూర్తి
- పేద విద్యార్థులకు చదువు
- డొంకాడ ఆదర్శం
పచ్చదనం కనువిందు చేస్తుంది. అది కోనసీమ కాదు. మద్యపాన నిషేధం అమలవుతోంది. అది గుజరాత్ కాదు. వేసిన పంట చక్కగా పండుతుంది. ఊరిపక్కన నది లేదు. అంతేనా... ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. అంతకుమించి ఒక్క మాటపై నిలబడుతుంది. పల్లె బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసిస్తోంది. ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది.... దాని పేరు డొంకాడ.
యలమంచిలి/నక్కపల్లి రూరల్ : ఇంటినే కాదు... ఊరిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని నక్కపల్లి మండలం డొంకాడ గ్రామస్తులు సగర్వంగా చెబుతారు. పచ్చదనం, పరిశుభ్రతలోనే కాదు... అయిదేళ్లుగా మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామం బాగుపడింది సరే.... మరి మీ బతుకు గురించి చెప్పండంటే... మాకేం..గతంలో ఎన్నడు లేని విధంగా వ్యవసాయం బాగుపడిందంటున్నారు గ్రామ అన్నదాతలు. గతంలో భూములన్నీ వర్షాధారమే. ఇప్పుడంతా వ్యవసాయ బోర్లతో సాగు చేస్తున్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం
మూడేళ్ల క్రితం గ్రామంలో బెల్టు దుకాణాలుండేవి. తరచూ గ్రామంలో గొడవలు జరిగేవి. దీంతో యువకులంతా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని సంకల్పించారు. గ్రామ పెద్దలను సమావేశ పరచి బెల్టు దుకాణాల వేలం పాటను రద్దు చేయించారు. గ్రామంలో మద్యం విక్రయించకుండా, ఇతర ప్రాంతాలనుంచి తెచ్చుకుని సేవించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సమీప గ్రామాలైన డీజీ కొత్తూరు, సీతానగరంలో కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం విశేషం.
ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి
గ్రామంలో లభించే తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు తరచూ మోకాళ్ల నొప్పులు, జ్వరాలతో బాధపడేవారు. పిల్లలు అంగవైకల్యంతో పుడుతుండటంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు నడుం బిగించారు. గ్రామస్తుల చందాలతో పాటు రామకృష్ట మఠం, విశాఖ డెయిరీ అందించిన సహకారంతో వివేకా జలం పేరుతో మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది.
ఊరంతా నందనవనం
పచ్చదనంలో డొంకాడ కోనసీమను తలపిస్తోంది. గ్రామంలో కొబ్బరి, అరటి చెట్లతో పాటు రోడ్లు కిరువైపులా మొక్కలు నాటి పెంచుతున్నారు. దీంతో గ్రామమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ఇక్కడి విద్యార్థులు, మహిళలు, పెద్దల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. రోజూ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తుంటారు. దీంతో పాటు రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరాన్ని నిర్మించుకుని ధ్యానం చేస్తుంటారు. ఈ మందిరం వద్ద ఆహ్లాదకరమైన రీతిలో ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు.
వ్యవసాయ బోర్లతో పంటల సాగు
గతంలో వర్షాధారంపై రైతులు పంటలు పండించేవారు. వర్షాలు కురవకపోతే ఆర్థిక సమస్యలతో పాటు పశువులకు గ్రాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో విశాఖ డెయిరీ 10మంది రైతులకు వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించింది.
మరో 30 మంది వరకు గ్రామస్తులు సొంతంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అన్ని రకాల కూరగాయలు, చెరకు, బొప్పాయి, అరటి, పశుగ్రాసం పెంపకంతో పచ్చగా కళకళలాడుతోంది. మండలంలోనే ఈ గ్రామం వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచింది.
వివేకానందుడే స్ఫూర్తి
స్వామీ వివేకానందుని స్ఫూర్తితో యువకులు గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రామకృష్ణ మఠం పీఠాధిపతి సహకారంతో విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నగదాధర ప్రకల్ప పథకం ద్వారా 1వ తరగతి నుంచి 5 వరకు చదువుకుంటున్న 120 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం దేశంలోని 106 గ్రామాల్లో అమలవుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న 4 గ్రామాల్లో డొంకాడ ఒకటి.
ఇందుకోసం నెలకు రూ.35 వేలు ఖర్చు చేస్తున్నారు. రామకృష్ణ మఠం ద్వారా తుని, పాయకరావుపేటలలో చదువుకుంటున్న విద్యార్థినులకు రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. గ్రామంలో నిరుపేదలైన వృద్ధులకు సాయం చేసేందుకు యువకులంతా శ్రీ కృష్ణ అక్షయ పాత్ర పథకాన్ని రూపొందించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఒక డబ్బా ఇస్తారు. ఈ డబ్బాలో ప్రతి కుటుంబం రోజూ ఒక రూపాయి, లేదా కొంత బియ్యాన్ని దానంగా వేస్తారు. చదువుకుంటున్న విద్యార్థులు వీటిని సేకరించి నెలకు 20 పేద కుటుంబాలకు 20 కేజీల బియ్యం, కొంత నగదు అందజేసి ఆదుకుంటున్నారు.
పోలీసుస్టేషన్ వరకూ వెళ్లం
గతంలో మా గ్రామం విద్య, వ్యవసాయ రంగాల్లో బాగా వెనుకబడి ఉండేది. తునికి చెందిన శర్మ ద్వారా రామకృష్ణ మఠం ఏర్పాటు చేశాం. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకుల్లో చైతన్యం వచ్చింది. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించాం. గ్రామంలో ఉత్సాహంగా ఉన్న 21 మందితో కమిటీ వేశాం. ఏ చిన్న తగాదా వచ్చినా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించుకుంటున్నాం.
- చందిన వెంకటరమణ, డొంకాడ
మద్య నిషేధంతో మార్పు
గతంలో గ్రామంలో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించడం వల్ల మగవారంతా మద్యం సేవించేవారు. వ్యవసాయం, కూలి పనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు పడేవాళ్లం. గ్రామంలో మద్య నిషేధం విధించడంతో ఎంతో హాయిగా ఉంది.
- అర్లంక అమ్మాజీ, డొంకాడ
విద్యాభివృద్ధికి ప్రోత్సాహం
గ్రామంలో విద్య వికాసానికి చర్యలు చేపట్టాం. చదువుకుంటున్న విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. మంచి చదువులు చదివిన సుమారు 20 మంది వరకు ఉపాధ్యాయులుగా, రైల్వే శాఖలో స్థిరపడ్డారు.
- రాజు, గ్రామస్తుడు, డొంకాడ
వ్యవసాయంలో మా గ్రామం ఆదర్శం
నాకు పొలం ఉన్నా నీరు లేక ఇబ్బం దులు పడేవాడిని. ప్రస్తుతం వ్యవసాయ బోరు వేయించడంతో మామి డి, కూరగాయలు, పండ్ల తోటలు, పశుగ్రాసం పెంచుతున్నాను. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తున్నా యి.
- ప్రగడ శివ, రైతు, డొంకాడ