పదిరాత్రులు తర్వాత నామకరణం.. | Shodasha Samskara Spiritual Article In Sakshi Devotion | Sakshi
Sakshi News home page

జాతకర్మ... నామకరణం

Published Mon, Dec 21 2020 6:40 AM | Last Updated on Mon, Dec 21 2020 6:40 AM

Shodasha Samskara Spiritual Article In Sakshi Devotion

మనిషికి జరిపే ప్రథమ సంస్కారం జాతకర్మ. ఈ సంస్కారాన్ని, బిడ్డ పుట్టిన రోజేకానీ లేదా పదకొండురోజులలో ఏదో ఒక రోజునకానీ జరపాలని శాస్త్రం. ప్రసవానికి ఒక మాసం ముందే ప్రసూతి గృహాన్ని వాస్తు శిల్పాచార్యుల సూచనల మేరకు తూర్పు/ఉత్తరం/దక్షిణ వాకిలితో నిర్మించి, వారి ఆశీర్వాదం తీసుకుని, దేవతలను పూజించి, సంతానం గల ముత్తైదువలు, మంత్రసానులతో ప్రసవదినానికి మూడు/నాలుగు రోజుల ముందు ఆ గృహంలో ప్రవేశించాలి. ప్రసవ దినాన, స్వర్ణశిల్పాచార్యులచే నూత్నంగా చేయించిన బంగారు చెంచాతో బాగా రుద్దిన తేనెను నెయ్యితో కలిపి శిశువుకు నాకించాలి. తర్వాత బియ్యాన్ని, యవలను కూడా నాకించాలి. తదుపరి శోష్యంతీ హోమం చేయాలి.

సంస్కార విధానం: శుభదినాన, సంకల్పం చెప్పుకుని, గణపతిపూజ, పుణ్యహవాచనం జరిపించి, తండ్రి తన ఒడిలో శిశువునుంచుకోవాలి. కొన్ని వేదమంత్రాలను శిశువు కుడిచెవిలో చదివి, శిశువుచేత నెయ్యి కలిపిన తేనెనూ, బియ్యాన్నీ, యవలనూ నాకించాలి. తరువాత శిశువుకి స్నానం చేయించి శోష్యంతీ హోమం జరిపించాలి. తరువాత శిశువుకు మాతృస్తన్యం ఇప్పించాలి. తదుపరి కులాచారాన్ని, కుటుంబాచారాలను అనుసరించి ఒక శుభనక్షత్రాన శిశువు తల్లికి పగటిపూట స్నాన ం చేయించాలి. 12వ రోజున గృహ శుద్ధి కొరకు స్వస్తి పుణ్యహవాచనం జరిపించి శాంతిహోమం చేసి ఆచార్యులకు భోజన దక్షిణ తాంబూలాదులను ఇచ్చి పంపాలి.

నిష్క్రమణం: శిశువును ప్రసూతి గృహం నుంచి శాస్త్రం చెప్పిన ప్రకారం బైటకు తీసుకు రావడాన్నే నిష్క్రమణం అంటారు. ఈ సంస్కారాన్ని శిశువు పుట్టిన పన్నెండవరోజునుండి మూడుమాసాలలోపల చెయ్యాలని శాస్త్రవచనం. ఈ సంస్కారాన్ని శిశువు మేనమామ చేయించాలి. ఒకరోజు ఒక శుభ ముహుర్తాన సూర్యదర్శనం చేయించి ఆ తర్వాత మరొక రోజు మరొక శుభముహుర్తాన చంద్ర దర్శనం చేయించాలని స్మృతివాక్యం. 

సంస్కార విధానం: శుభదినాన ఉదయాన్నే, ఇంటి ఆవరణలో ఒకచోట సూర్యరశ్మి పడుస్థలాన్ని ఆవుపేడతో అలికి ముగ్గులుపెట్టాలి. దానిపై అక్షింతలు, నవధాన్యాలు చల్లాలి. శిశువుమేనమామ శిశువును ఎత్తుకుని ప్రసూతి గృహమునుండి బైటకు నడుచుచుండగా, ఆచార్యులు శుభ సూక్తాలు పఠించుచుండగా, శిశువుతల్లిదండ్రులు, బంధువులు మంగళవాద్యాలతో అనుసరించాలి. శుభప్రదేశంలో, కూర్చుని, గణపతిపూజ, సూర్యావాహనం, అష్టదిక్పాలక ఆవాహనం, ఇష్టదేవతాపూజ జరిపించి, అందరిచేత శిశువుకు ఆశీర్వచనాలు ఇప్పించి భోజనాదులను చేయించి పంపాలి. ఇలాగే ఒక రాత్రిపూట, శిశువుకు చంద్రదర్శనం కూడా చేయించాలి.ఈ సంస్కారంలో హోమం చేయించాలని కొందరు స్మృతికారులు చెప్పియున్నారు.

నామకరణం: శిశువుపుట్టిన పదిరాత్రులు గడచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం. కొందరు స్మృతికారులు సంవత్సరంలోపు చేయవచ్చని చెప్పియున్నారు. శిశువుకు మూడురకాల పేర్లు పెట్టవచ్చని శాస్త్రాలలో చెప్పారు. అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి, గ్రహదోషాలు, పాపపీడలుపోవుటకు రహస్య నామం (నక్షత్రం నామం) ఒకటి, అందరూ పిలుచుకోవడానికి వ్యవహార నామం ఒకటి. శిశువులకు పెట్టే పేరు విషయంలో చాలా నియమాలను పాటించాలని స్మృతికారులు చెప్పియున్నారు. వారిలో భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ, ఏతావాతా ప్రధానంగా కొన్ని సారూప్యాలు గమనించగలం. మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో, ఆడ శిశువుకు మూడు లేక ఐదు అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం. మరొక స్మృతికారుడు, మగ శిశువుకు సరి సంఖ్యలో, ఆడ శిశువుకు బేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య వుండాలని చెప్పాడు. గ, ఘ, ఙ, జ, ఝ, ఞ, డ, ఢ, ణ, ద, ధ, న, బ, భ, మ, య, ర, ల, వ, హ, అను అక్షరాలతో పేరు మొదలవ్వాలని నియమం చెప్పారు. 

మాతృభాషలోగానీ, దేవభాషలోగానీ పేరు పెట్టుకోవాలని శాస్త్ర నియమం. దేవతల పేర్లు, ప్రకృతి సంబంధమైన పేర్లుగానీ పెట్టుకోవాలని స్మతికర్తలు సూచించారు. పితామహ (జేజినాయన), ప్రపితామహ (జేజినాయన తండ్రి) , మాతమహ (తాత), గోత్రకర్త, మొదలగువారి పేర్లు పెట్టుకోవచ్చు. అర్థం మాలినవి, మనకు సంబంధం లేని భాషలపదాలు, రెండుమూడు భాషలలోని పదాలు కలిపి, అశుభాన్ని సూచించేవి, పలకడానికి కష్టంగా వుండేవి, ఎక్కువ దీర్ఘాక్షరాలతో వుండేవి, లకారాంతం వుండేవి పనికిరావని స్మృతికారులు చెప్పియున్నారు.

సరళమైనవి, శుభకరమైనవి, పేరు చివరలో దీర్ఘం కానీ విసర్గగానీ వుండేవి, స్పష్టమైన అర్థంకలవి, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం. పురుషుల పేర్లు స్త్రీలకు, అలాగే స్త్రీలపేర్లు పురుషులకు పెట్టరాదు అని నియమం. కొన్ని కొన్ని సార్లు, ఎక్కువమంది పిల్లలు పుట్టి చనిపోతుంటే, దుష్టశక్తులబారినుండి శిశువులను కాపాడేందుకు, విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది. 

సంస్కార విధానం: శుభ ముహుర్తాన, శిశువు తల్లిదండ్రులు నూతన వస్త్రాలు ధరించి, గణపతి పూజ, పుణ్యహవాచనము జరిపించాలి. ఒక ఇత్తడి పళ్ళెంలో బియ్యంపోసి, ఆ శిశువు జన్మించిన మాస నామం, నక్షత్ర నామం, వ్యావహారిక నామం బంగారంతో వ్రాసి, వానిపై నక్షత్రాధిదేవతలనూ, ఇంటి ఇలవేల్పులనూ, సకల దేవతలనూ ఆవాహనంచేసి షోడశోపచారాలతో పూజించాలి. ఆవుపాలను నైవేద్యంగా సమర్పించి, ఆ పాలను శిశువుచేత తాగించాలి. శిశువుకుపెట్టిన వ్యావహారిక నామంతో, శిశువు తండ్రి, తల్లి, శిశువు చెవిలో మూడుసార్లు పిలవాలి.

శాస్త్రానుసారం హోమాది ఇతర ఆచారాలను పూర్తిచేసి, అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత శిశువు తల్లి మండలం రోజులవరకు వంటచేయరాదు. శిశువు జన్మించినది మొదలు సంవత్సరం వరకు తల్లిదండ్రులు మాంసాహారం తినరాదని శాస్త్రం. ఎందుకనగా, సంవత్సరం వరకూ శిశువు తల్లిదండ్రులు ప్రతిమాసంలో జన్మదినమందు స్థాలీపాకం చేయాలి. జన్మ నక్షత్రంలో దోషముండినగానీ, లేక ఇతర దోషాలుండినచో, నక్షత్ర శాంతి, లేక దోషానికి సంబంధించిన శాంతులు శాస్త్రోక్తంగా జరిపించాలి. ఆరోజుకానీ, మరుసటిరోజుకానీ, శిశువును ఊయలలో పడుకోబెట్టాలి.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు
(సశేషం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement