చార్మినార్/చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యా ప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తు లు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు.
అలాగే, అక్కన్నమాదన్న ఆలయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయంతోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్‌లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. గౌలిపురా నల్లపోచమ్మ దేవాలయం, మేకలబండ నల్లపోచమ్మ ఆల యం, కోట్ల అలిజా కోట మైసమ్మ, కసరట్టా మహంకాళి ఆలయాలు కిటకిటలాడాయి. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగా యి.
అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించా రు. లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. అహ్మద్‌నగర్ పోచమ్మబస్తీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో వైఎస్సార్ సీపీ నేతలు గట్టు రాంచందర్‌రావు, విజయారెడ్డి, పార్టీ నగర స్టీరింగ్ కమిటీ సభ్యులు జూడి విల్సన్, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జానపద కార్యక్రమాలను వారు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ప్రముఖల రాక..
బోనాల వేడుకలకు ప్రముఖులు తరలివచ్చారు. అన్ని ప్ర దాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శా ఖ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించా రు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రు లు జానారెడ్డి, దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, గీతారెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, రేణుకా చౌదరి, మధుయాష్కి, రాపోలు ఆనంద్‌భాస్కర్, వీహెచ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మాజీ మంత్రి బం డారు దత్తాత్రేయ, నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, విమలక్క తది తరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
ఓవైపు బోనాల ఉత్సవాలు, మరోవైపు పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు, రాత్రి ముస్లిం సోదరులు షబ్-ఏ-ఖదర్ జాగరణ ఉండడంతో అప్రమత్తమయ్యారు. శాలిబండ నుంచి నయాపూల్ వరకు రంజాన్ మార్కెట్‌ల ను అనుమతించరు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేడు రంగం
బోనాల జాతరలో విశిష్ట స్థానం ఉన్న రంగం సోమవారం జరగనుంది. లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయంలో సుశీలమ్మ అనే వివాహిత భవిష్యవాణిని వినిపిస్తారు.
భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది
Published Mon, Aug 5 2013 1:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement