నవరాత్రి సందర్భంగా దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్ తోపాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్బ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
‘గర్బ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్బ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్బ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్బ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు.
కేలరీల ఖర్చు
గంటసేపు గర్బ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగిమల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్బ చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్బ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్‌ను విడుదల చేయడమే ఇందుకు కారణం. అదీగాక ఇది బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయంలోనే కాదు సంవత్సరం పొడగునా గర్బా డ్యాన్స్ చేయమని ఫిట్‌నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు.
గుండెకు మంచిది
గర్బలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరుగుతుంది కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం.
(చదవండి: అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..)
Comments
Please login to add a commentAdd a comment