ఆధ్యాత్మికత లేకే ఆత్మహత్యలు!
రైతుల ఆత్మహత్యలపై శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్య
ముంబై: దేశానికి అన్నంపెట్టే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడానికి పేదరికం ఒక్కటే కారణం కాదని, ఆధ్యాత్మిక భావాలు లోపించడమూ ఒక కారణమని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ వ్యాఖ్యానించారు. కరువు కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని 512 గ్రామాల్లో పాదయాత్ర చేసిన సమయంలో రైతులతో మమేకమయ్యాక ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక భావాలతో ముందుకెళ్తున్న వారు రైతన్నల్లో ఆత్మస్థైర్యం నింపాలని కోరారు.
కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో ఆత్మహత్యకు పురిగొల్పే చెడు భావాలను యోగా, ప్రాణాయామంతో మటుమాయం చేయవచ్చని రవిశంకర్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వివాదంపైనా ఆయన మాట్లాడారు. ‘నిర్దిష్ట కాలపరిమితో ప్రతీ మతవిధానాల్లో సంస్కరణలొస్తాయి. ట్రిపుల్ తలాక్‌ను వెంటనే నిషేధించాలని నేను అనను. ప్రతీ ఒక్కరి మానవ, సామాజిక హక్కులు పరిరక్షించేలా ఆ మతాధికారులే ఒక పరిష్కారాన్ని వెతకాలి’ అని ఆయన అన్నారు.