నదులు.. ఏ దేశానికైనా జీవనాధారంగా భాసిల్లుతుంటాయి. నదులు మనిషి సమస్త అవసరాలను తీరుస్తుంటాయి. మానవ నాగరికత నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు తమ దారిన తాము వెళ్లిపోతూ, తమకు అడ్డుపడే వాటిని కూడా తమతోపాటు తీసువెళ్లిపోతాయని చెబుతుంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు,లేదా మూడు నదులు కలవడాన్ని మనం చూసుంటాం. ఉదాహరణకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదులు కలవడంతో అక్కడి త్రివేణీ సంగమం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఐదు నదులు కలిసే ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రాంతం మన దేశంలోనే ఉంది.
ప్రపంచంలో ఎక్కడా కనిపించని కొన్ని అద్భుతాలు భారత్‌లో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని పచ్‌నద్‌కు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారత కాలంలో పాండవులు తమ ప్రయాణంలో ఈ ప్రాంతంలో బస చేశారని చెబుతారు. పాండవులలో ఒకడైన భీముడు ఈ ప్రాంతంలోనే బకాసురుడిని వధించాడని చెబుతారు. శ్రీరాముని భక్తుడైన తులసీదాసు ఈ ప్రాంతంలోనే పర్యటించాడని చెబుతారు.
బుందేల్‌ఖండ్ పరిధిలోని జాలౌన్‌లో ఐదు నదులు సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్నే పచ్‌నద్ అంటారు. ప్రకృతి సౌందర్యానికి, హిందూ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఏడాదిలో ఒకసారి ఇక్కడ మేళా జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి లెక్కకుమించిన సంఖ్యలో భక్తులు వస్తారు. పచ్‌నద్‌ను మహాతీర్థరాజం అని కూడా అంటారు. ప్రపంచంలో ఐదు నదులు సంగమించే ప్రాంతం ఇదొక్కటే కావడం విశేషం. ఇక్కడ యమున, చంబల్, సింధు, పహుజ, కన్వరి నదులు సంగమిస్తాయి.
పచ్‌నద్ సంగమతీరంలో బాబా సాహెబ్ మందిరం ఉంది. ఈయన గోస్వామి తులసీదాసు సమకాలికుడని చెబుతారు. ఈయన ఇక్కడే తపమాచరించి, ఒక గుహలో విలీనమైపోయారని స్థానికులు చెబుతుంటారు. ఈ పంచనదుల సంగమప్రాంతంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే కాన్ఫూర్, దేహాత్, జాలౌన్, ఔరయ్యా ప్రాంతాల రైతులకు మేలు జరగనుంది.
ఇది కూడా చదవండి: అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు?
Comments
Please login to add a commentAdd a comment