‘మహా’ వైభవం
చార్మినార్, న్యూస్‌లైన్: ఆషాఢ బోనాల జాతరలో ఆఖరి ఘట్టం శ్రీమాతేశ్వరి సామూహిక ఘటాల ఊరేగింపు సోమవారం మహావైభవంగా జరిగింది. అశేష భక్తజనం వెంటరాగా... డప్పుల చప్పుళ్లు... నృత్యాల ఉత్సాహంతో పాతబస్తీలోని వీధుల్లో ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓ పక్క రంజాన్ సంబరాలు... మరోవైపు బోనాల సందడులు... పోలీసుల వ్యూహం... ఉత్సవ కమిటీల సహకారంతో ఘటాల ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ముస్లింల షబ్బే-ఏ-ఖదర్ కావడంతో చీకటిపడకముందే ఊరేగింపును ముగించాలని పోలీసులు సూచించిన మేరకు... మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ స్పందించింది. మధ్యాహ్నం 1.05కు ప్రారంభమైన ఘటాల ఊరేగింపు సరిగ్గా సాయంత్రం 6.30కి మక్కామసీదు, చార్మినార్ దాటి వెళ్లింది. దీంతో అటు పోలీసులు.. ఇటు ఉత్సవ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
దారిపొడవునా స్వాగతం
పాతబస్తీ అన్ని దేవాలయాల్లోని అమ్మవార్ల ఘటాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. దారిపొడవునా ఘటాలకు భక్తులు, ప్రముఖులు స్వాగతం పలికారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక ద్వారా లాల్‌దర్వాజా సింహవాహిని ఘటాలలో కలిసింది. అక్కన్న మాదన్న దేవాలయం, మురాద్ మహల్, గౌలిపురా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి ఘటాలు లాల్‌దర్వాజా మోడ్‌కు చేరుకున్నాయి. శాలిబండ, హిమ్మత్‌పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్‌హౌస్‌ల మీదుగా నయాపూల్ మూసీ నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన శ్రీమహంకాళి ఘటం కోట్ల అలీజా, సర్దార్‌మహల్ ద్వారా చార్మినార్ చేరుకొని ప్రధాన ఊరేగింపులో కలిసింది.
మతసామరస్యానికి ప్రతీక: గీతారెడ్డి
పాతబస్తీ బోనాల ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని మంత్రి గీతారెడ్డి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కలిసిమెలిసి ప్రశాంతంగా ఉత్సవాలు చేసుకోవడం సంతోషకర విషయమన్నారు. ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్‌తివారీ, బీజేపీ అధ్యక్షుడు బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉస్మాన్‌గంజ్‌లో ఫలహారం బండి...
జాంబాగ్ న్యూ ఉస్మాన్‌గంజ్‌లో బోనాల ఫలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ ఊరేగింపును ప్రారంభించారు.