bonal festival
-
బోనాల పండుగ 2024 ప్రాముఖ్యత, ఆసక్తికర సంగతులు
తెలంగాణాలో అత్యంత ఘనంగా, వైభవంగా జరిగే బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండగ పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలకు పూజలు, బోనం, రంగం, భవిష్యవాణి.. ఇలా నెల రోజుల పాటు ఈ సందడి కొనసాగుతుంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజుఈ బోనాల ఉత్సవం షురు అవుతుంది. తరువాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంల ఒక్కో గుడిలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి ఎందుకని బోనాల పండుగ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెలంతా తెలంగాణా ఆడబడుచులు ఉత్సాహంగా గడుపుతారు. డప్పులు, వాయిద్యాలు పోతరాజు నృత్యం మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మూడు ఆదివారాల ఉత్సవం తర్వాత నాలుగో ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున రంగం, ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. ఘటం చివరి ఊరేగింపు. దేవతలా అలంకరించబడిన కుండను పూజారి తీసుకువెళ్లి పవిత్రనీటిలో నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఉన్న కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.ప్రతి ఏటా బోనాల పండుగ సంబురాల సందర్భంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్ల దేవాలయాలన్నీ ముస్తాబవుతాయి. గోల్కోండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు.భోజనంనుంచి వచ్చిందే బోనంసంస్కృత పదం భోజనం నుంచి వచ్చింది బోనం అని అర్థం. బోనం అంటే కుండలలో వండి అమ్మవారికి సమర్పించే నైవేద్యం. వివిధ ప్రాంతాలలో, బోనాలు పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ , నూకాలమ్మ వంటి అనేక పేర్లతో అమ్మవారిని ఆరాధించడం. ఈ బోనాల పండగ దాదాపు వెయ్యేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమితినిచ్చారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం, రెండో బోనం బల్కం పేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో వారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు.ప్రజలు ప్రతి ఆదివారం స్త్రీలు ఉదయాన్నే లేచి, శుచిగా స్నానం చేసి, శుభ్రంగా, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త మట్టి కుండలో అన్నం, పెరుగు, నీరు ,బెల్లం కలిపి క్షీరాన్ని వండుతారు. కుండను ఎరుపు, తెలుపు పసుపు రంగుల కలయికతో అలంకరిస్తారు. ఈ కుండపై కప్పి, పైన వేప ఆకులను ఉంచి, పైన దీపం వెలిగిస్తారు. ఇదే బోనం జ్యోతి. దీనితోపాటు మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులు , చీరలను సమర్పిస్తారుబోనాలు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పోతురాజే. పోతరాజును మహంకాళి దేవి సోదరుడని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబురాలు మస్తుగా షురూ అవుతయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల విశ్వాసం.అతేకాదు బోనంతో విషజ్వరాలకు, అనేక రకాల వైరస్లకుచెక్ పెట్టే ఆచారం ఉంది. వర్షాకాలంలలో వచ్చే ఆఫాఢంలో పలు అంటు రోగాలు వస్తుంటాయి. అలాంటివేమీ రాకుండా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూసి. శుభ్రమైన వేపాకులు కడతారు. సహజ క్రిమి సంహారిణి అయిన పసుపు, వేపగాలి పీల్చడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు నాశనమవుతాయి. ఇది పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యానికి మంచిదని విశ్వాసం.ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్రసికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ య్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు. అపుడు అమ్మవారి దయతో వ్యాధి తగ్గిపోవడం, ప్రజలు సంతోషంగా ఉండటంతో , ఇక అప్పటినుంచి 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అలా ఆషాఢంలో బోనాల సంబురాలు జరుగుతున్నాయి.విదేశాల్లోనూ బోనాల పండుగ..కేవలం తెలంగాణలోనే కాదు, దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పేలా ఈ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. -
Telangana Bonalu 2024: అమ్మా బైలెల్లినాదో...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఎనిమిది వందల ఏళ్లుగా వస్తోంది. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా,ఈ బోనాల వేడుకలు మాత్రం అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరద నీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకు సమర్పిస్తారు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, ΄÷ంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాలపాటలు ఆడమగ, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు‘‘గండిపేట గండెమ్మా దండ బెడత ఉండమ్మా....., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే....., అమ్మా బైలెల్లినాదే....అమ్మా సల్లంగ సూడమ్మ..... మైసమ్మా మైసమ్మా.... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. అమ్మవార్లకు సోదరుడు పోతురాజుపోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు చేస్తారు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు.బోనం అంటే... భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయ లతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.ఇంటి ఆడబిడ్డ లెక్కఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ్రపాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ్రపాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ్రపాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ జగదంబికదే తొలిబోనంబోనాల మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ్రపాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్రపారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.– డి.వి.ఆర్. భాస్కర్ -
పాతబస్తీలో అంబారీపై ఊరేగిన అమ్మవారు (ఫొటోలు)
-
జజ్జనకరి జనాలే..బోనాలు భళారే
ఆలయాలకు పోటెత్తిన భక్తజనం భారీగా బోనాలు శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు సందడిగా మారిన నగర వీధులు నేడు ఘటాల ఊరేగింపు చార్మినార్/చాంద్రాయణగుట్ట/యాకుత్‌పురా: బోనాల జాతర సందర్భంగా నగరంలోని వీధులన్నీ దద్దరిల్లాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద డీజేల హోరు మొదలైంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పాతబస్తీతోపాటు నగరంలోని మిగతా చోట్ల సందడి నెలకొంది. మహంకాళి, మైసమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ శంకరయ్యగౌడ్, గౌలిపురాలోని ఆలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి మల్లేశం గౌడ్, సుల్తాన్షాహి జగదాంబ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, మీరాలం మండిలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, మేకల బండ నల్లపోచమ్మ దేవాలయంలో అక్కడి కమిటీ చైర్మన్ పొన్న సుదర్శన్, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో కమిటీ అధ్యక్షులు జి.నిరంజన్, బేలా ముత్యాలమ్మ దేవాలయంలో కమిటీ అధ్యక్షులు పొటేల్ సదానంద్ యాదవ్, హరిబౌలీ బంగారు మైసమ్మ దేవాలయంలో కమిటీ చైర్మన్ ప్రవీణ్కుమార్గౌడ్లు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. పురానాపూల్‌లోని గొల్లకిడికి కోట మైసమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలతోపాటు బోనాలు సమర్పించారు. కోట మైసమ్మ దేవాలయం కమిటీ నిర్వాహకులు మక్కర యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అధికారులతోపాటు ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రధాన దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలరించిన పోతరాజుల విన్యాసాలు.. అమ్మవారికి ఊయల (తొట్టెల)ను సమర్పించేందుకు లాల్‌దర్వాజా, మీరాలం మండి, కసరట్ట, దూద్‌బౌలీ, ఛత్రినాక, ఉప్పుగూడ, గౌలిపురా, మేకలబండ, సీఐబీ క్వార్టర్స్, లలితాబాగ్, నరహరినగర్, కందికల్‌గేట్, అరుంధతీ కాలనీ, హరిబౌలి, అలియాబాద్ తదితర ప్రాం తాల్లోని బస్తీ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ తొట్టెల ఊరేగింపులు నిర్వహించారు. పోతరాజుల నృత్యాలను మహిళలు, పురుషులు, పిల్లలు, యువకులు ఆసక్తిగా తిలకించారు. నేడు ఘటాల ఊరేగింపు.. జాతరలో భాగంగా సోమవారం జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపునకు ఉత్సవాల నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహం కాళి దేవాలయం, మీరాలం మండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్షాహి శీతల్‌మాత, గౌలిపురా నల్లపోచమ్మ, గౌలిపురా మహంకాళి, మురాద్‌మహాల్ మహంకాళి, అక్కన్నమాదన్న మహంకాళి, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి బంగారు మైసమ్మ తదితర ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. సోమవారం నాటి ఘటాల ఊరేగింపు కోసం అదనపు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠి తెలిపారు. నేటి సాయంత్రం 6లోగా.. పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు సోమవారం సాయంత్రం 6 గంటలకు చార్మినార్ దాటేలా దక్షిణ మండలం పోలీసులు కార్యాచర ణ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్సవాల నిర్వాహకులతో ఇప్పటికే సమావేశమై పలు సూచనలు చేశారు. అక్కన్న మాదన్న దేవాలయం ఘటం ఊరేగింపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు హిమ్మత్‌పురా చౌరస్తాకు, సాయంత్రం 6 గంటలకు చార్మినార్‌కు చేరుకునేలా నిర్వాహకులకు సూచించారు. మీరాలం మండి మహాకాళి ఘటం ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి 6 గంటలకు చార్మినార్ చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం ఇఫ్తార్ విందులు కొనసాగనుండడంతో ఇరువర్గాలకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హరిబౌలిలో స్వల్ప ఉద్రిక్తత యాకుత్‌పురా: బోనాల పండుగలో భాగంగా ఆదివారం అక్కన్న మాదన్న దేవాలయానికి బయలు దేరిన పోతరాజుల ఊరేగింపు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం నుంచి మధ్యాహ్నం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోతరాజుల నృత్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో నృత్యాలు చేస్తూ యువకులు మరో వర్గం వారిపై పడ్డారు. దీంతో ఇషత్ ్రమహల్ ఫంక్షన్ హాల్ వైపు కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వగా ఉద్రిక్తతకు దారితీసింది. మహిళలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. హరిబౌలి చౌరస్తాతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. -
ఆధ్యాత్మిక శోభ
జంట పండుగలతో అలరారనున్న మహానగరం ఓవైపు బోనాలు, మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలు నేడు గోల్కొండ కోటలో బోనాలు మతసామరస్యం వెల్లివిరిసేలా నెలరోజుల పండుగలు సాక్షి, సిటీబ్యూరో: జంట పండుగల వేళ మహానగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మతసామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల వారు భక్తిపూర్వకంగా జరుపుకొనే పండుగలివి. భిన్న సంస్కృతుల మధ్య ఐక్యతకు చాటే సమయమిది. ఓ వైపు ఆనందం ఉట్టిపడేలా జరుపుకొనే ఆషాఢం బోనాల జాతర.. మరోవైపు ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర రంజాన్ ప్రార్థనలు ఒకేసారి రావడంతో నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆషాఢంలో అమ్మవారి బోనాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఆషాఢ మాసం ప్రవేశించడంతో ఆదివారం భక్తజనసందోహం నడుమ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వందల ఏళ్లుగా భక్తుల ఆరాధ్యదైవంగా, కొంగుబంగారంగా వెలుగొందుతోన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఓ వైపు బోనమెత్తుకొని బారులు తీరే మహిళలు, మరోవైపు గుగ్గిలం, మైసాక్షిల పరిమళాలు, పోతరాజుల విన్యాసాలు అమ్మవారిని వేనోల్లా కీర్తిస్తూ ఆలపించే పాటలతో నగరం పులకించిపోనుంది. గోల్కొండలో ప్రారంభమయ్యే జాతర వరుసగా పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తరువాత నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలతో నెల పాటు కొనసాగుతుంది. మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. మరోవైపు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇది కూడా నెల పాటు కొనసాగనుంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాను ఆరాధిస్తూ, ఉపవాసాలతో మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిల్లిపాది కఠోరమైన ఉపవాసదీక్షలు పాటిస్తారు. అన్ని వర్గాలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు అందజేసే ఆర్థిక సహాయం రంజాన్ మాసంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించనుంది. వరుస పండుగలు... ఆషాఢం తరువాత శ్రావణంలోనూ వరుగా పండుగలే వస్తున్నాయి. శ్రావణమాసం కూడా పవిత్రమైంది. ఆ నెలంతా భక్తులు, మహిళలు పూజలు, వ్రతాలు, నోములతో గడిపేస్తారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడనుంది. ఈ వరుస పండుగలు మానసిక ప్రశాంతతను, ఆహ్లాదాన్ని, ప్రేమ, ఆప్యాయతలను పంచుతాయి. ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతోపాటు, మానవ సంబంధాల్లోని మహోన్నతమైన విలువలను ఆవిష్కరిస్తాయి. -
ఘనంగా బోనాల పండుగ
వర్సోవ/బోరివలి, న్యూస్‌లైన్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అంధేరీలోని గావ్‌దేవి ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి డోంగిరి గుట్టపై వెలసిన గంగమ్మ, మైసమ్మ, ఎల్లమ్మలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ముగ్గురు దేవతలు కొల్లాపూర్ నుంచి వచ్చి గ్రామదేవతల రూపంలో ఇక్కడ వెలిశారని ప్రతీతి. ఆదివారం గావ్‌దేవి ప్రాంతంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకొని బంధువులరాకతో ఇక్కడ రెండు రోజుల ముందే సందడి నెలకొంది. సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల తో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన నైవేద్యాన్ని, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మల్లికార్జున ఒగ్గు కథ కళాకారుల బృందం ఆలయంలోని ముగ్గురు అమ్మవార్ల చరిత్రను భక్తులకు తమ ఆటపాటల ద్వారా వినిపించారు. ఇదిలాఉండగా గత 40 ఏళ్లుగా బోనాల పండుగను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మందిరం చిన్నగా ఉండడంతో మూడేళ్ల క్రితమే పునర్నిర్మించామని సంఘం అధ్యక్షుడు మంగలి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒడి బియ్యం రూపంలో వచ్చిన ధాన్యాన్ని వండి భక్తులకు అన్నదానం చేస్తామని, అదే సమయంలో జంతు బలి కూడా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గొంగిడి సత్యనారాయణ, పూసపాండు, ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మయ్య, కార్యదర్శి ఎంకర్ల అంజయ్య, గడియ కృష్ణ, పచ్చు సత్తయ్య, కోశాధికారి పచ్చు కృష్ణ, యోగుల శ్రీనివాస్, మద్దెల సాయిబాబా గౌడ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రకటించడంతో ఈసారి బోనాలను ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నామని చెప్పారు. -
‘మహా’ వైభవం
చార్మినార్, న్యూస్‌లైన్: ఆషాఢ బోనాల జాతరలో ఆఖరి ఘట్టం శ్రీమాతేశ్వరి సామూహిక ఘటాల ఊరేగింపు సోమవారం మహావైభవంగా జరిగింది. అశేష భక్తజనం వెంటరాగా... డప్పుల చప్పుళ్లు... నృత్యాల ఉత్సాహంతో పాతబస్తీలోని వీధుల్లో ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓ పక్క రంజాన్ సంబరాలు... మరోవైపు బోనాల సందడులు... పోలీసుల వ్యూహం... ఉత్సవ కమిటీల సహకారంతో ఘటాల ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ముస్లింల షబ్బే-ఏ-ఖదర్ కావడంతో చీకటిపడకముందే ఊరేగింపును ముగించాలని పోలీసులు సూచించిన మేరకు... మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ స్పందించింది. మధ్యాహ్నం 1.05కు ప్రారంభమైన ఘటాల ఊరేగింపు సరిగ్గా సాయంత్రం 6.30కి మక్కామసీదు, చార్మినార్ దాటి వెళ్లింది. దీంతో అటు పోలీసులు.. ఇటు ఉత్సవ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. దారిపొడవునా స్వాగతం పాతబస్తీ అన్ని దేవాలయాల్లోని అమ్మవార్ల ఘటాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. దారిపొడవునా ఘటాలకు భక్తులు, ప్రముఖులు స్వాగతం పలికారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ప్రారంభమైన మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు ఛత్రినాక ద్వారా లాల్‌దర్వాజా సింహవాహిని ఘటాలలో కలిసింది. అక్కన్న మాదన్న దేవాలయం, మురాద్ మహల్, గౌలిపురా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి ఘటాలు లాల్‌దర్వాజా మోడ్‌కు చేరుకున్నాయి. శాలిబండ, హిమ్మత్‌పురా చౌరస్తా, మక్కా మసీదు, చార్మినార్, గుల్జార్హౌస్ల మీదుగా నయాపూల్ మూసీ నదిలోని ఢిల్లీ దర్బార్ మైసమ్మ దేవాలయం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మీరాలంమండి నుంచి ప్రారంభమైన శ్రీమహంకాళి ఘటం కోట్ల అలీజా, సర్దార్‌మహల్ ద్వారా చార్మినార్ చేరుకొని ప్రధాన ఊరేగింపులో కలిసింది. మతసామరస్యానికి ప్రతీక: గీతారెడ్డి పాతబస్తీ బోనాల ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని మంత్రి గీతారెడ్డి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కలిసిమెలిసి ప్రశాంతంగా ఉత్సవాలు చేసుకోవడం సంతోషకర విషయమన్నారు. ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్‌తివారీ, బీజేపీ అధ్యక్షుడు బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఉస్మాన్‌గంజ్‌లో ఫలహారం బండి... జాంబాగ్ న్యూ ఉస్మాన్‌గంజ్‌లో బోనాల ఫలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ ఊరేగింపును ప్రారంభించారు.