బోనాల పండుగ 2024 ప్రాముఖ్యత, ఆసక్తికర సంగతులు | Telangana Bonalu 2024: Bonalu Festival Importance And Significance In Telugu | Sakshi
Sakshi News home page

బోనాల పండుగ 2024: ప్రాముఖ్యత, ఆసక్తికర సంగతులు

Published Sun, Jul 28 2024 12:10 PM | Last Updated on Sun, Jul 28 2024 2:30 PM

Bonalu 2024  Bonalu Festival importnace and significance

తెలంగాణాలో అత్యంత ఘనంగా, వైభవంగా జరిగే బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండగ పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలకు పూజలు, బోనం, రంగం, భవిష్యవాణి.. ఇలా నెల రోజుల పాటు ఈ సందడి  కొనసాగుతుంది.  ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజుఈ బోనాల ఉత్సవం షురు అవుతుంది. తరువాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. భాగ్యనగరంలో నాలుగు వారాల పాటు ఒక్కో వారంల ఒక్కో గుడిలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించి ఎందుకని బోనాల పండుగ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెలంతా తెలంగాణా ఆడబడుచులు ఉత్సాహంగా  గడుపుతారు. డప్పులు, వాయిద్యాలు పోతరాజు నృత్యం మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మూడు ఆదివారాల ఉత్సవం తర్వాత నాలుగో ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున రంగం, ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. ఘటం చివరి ఊరేగింపు. దేవతలా అలంకరించబడిన కుండను  పూజారి తీసుకువెళ్లి పవిత్రనీటిలో నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఉన్న కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.

ప్రతి ఏటా బోనాల పండుగ సంబురాల సందర్భంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్ల దేవాలయాలన్నీ ముస్తాబవుతాయి.  గోల్కోండలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు.

భోజనంనుంచి వచ్చిందే బోనం
సంస్కృత పదం  భోజనం నుంచి వచ్చింది బోనం అని అర్థం. బోనం అంటే కుండలలో వండి అమ్మవారికి సమర్పించే  నైవేద్యం. వివిధ  ప్రాంతాలలో, బోనాలు పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ , నూకాలమ్మ వంటి అనేక పేర్లతో అమ్మవారిని ఆరాధించడం.   ఈ బోనాల పండగ దాదాపు వెయ్యేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది.   కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమితినిచ్చారు. ముఖ్యంగా  భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది.  అందుకే ఇక్కడ తొలి బోనం, రెండో బోనం బల్కం పేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో వారం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు.

ప్రజలు ప్రతి ఆదివారం  స్త్రీలు ఉదయాన్నే లేచి,  శుచిగా స్నానం చేసి, శుభ్రంగా, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త మట్టి కుండలో అన్నం, పెరుగు, నీరు ,బెల్లం కలిపి క్షీరాన్ని వండుతారు. కుండను ఎరుపు, తెలుపు  పసుపు రంగుల కలయికతో అలంకరిస్తారు. ఈ కుండపై కప్పి, పైన వేప ఆకులను ఉంచి, పైన దీపం వెలిగిస్తారు. ఇదే బోనం జ్యోతి. దీనితోపాటు  మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులు ,  చీరలను సమర్పిస్తారు

బోనాలు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పోతురాజే. పోతరాజును మహంకాళి దేవి సోదరుడని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబురాలు మస్తుగా షురూ అవుతయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా  ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. 

ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల విశ్వాసం.అతేకాదు బోనంతో  విషజ్వరాలకు, అనేక రకాల వైరస్‌లకుచెక్‌  పెట్టే ఆచారం ఉంది. వర్షాకాలంలలో వచ్చే ఆఫాఢంలో పలు అంటు రోగాలు వస్తుంటాయి. అలాంటివేమీ రాకుండా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూసి.  శుభ్రమైన వేపాకులు  కడతారు. సహజ క్రిమి సంహారిణి అయిన పసుపు, వేపగాలి  పీల్చడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ లు నాశనమవుతాయి.  ఇది పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యానికి  మంచిదని  విశ్వాసం.

ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్ర
సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి  ఒక చరిత్ర ఉంది. బ్రిటీష్‌ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినికి బదిలీ య్యాడు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. అది తెలుసుకున్న తను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు.  అపుడు అమ్మవారి దయతో వ్యాధి తగ్గిపోవడం,  ప్రజలు సంతోషంగా ఉండటంతో , ఇక అప్పటినుంచి 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అలా ఆషాఢంలో బోనాల సంబురాలు జరుగుతున్నాయి.

విదేశాల్లోనూ బోనాల పండుగ..
కేవలం తెలంగాణలోనే కాదు,  దేశవిదేశాల్లో ఉన్న  తెలంగాణ బిడ్డలు కూడా   తెలంగాణ సంస్కృతిని సైతం చాటి చెప్పేలా ఈ బోనాల పండుగను   ఘనంగా జరుపుకోవడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement