
ఈ దఫా ఎన్నికల్లో భారీగా చెల్లకుండా పోయిన ఎమ్మెల్సీ ఓట్లు
గ్రాడ్యుయేట్ పరిధిలో 28 వేలు, టీచర్లవి 1,396 ఓట్లు ఇన్‌వ్యాలిడ్
చెల్లని ఓట్లు ఎవరి కొంపముంచుతాయోనని గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఆందోళన
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పేరుకు వారు పీజీలు, పీహెచ్‌డీలు చేసిన పట్టభద్రులు... పది మందికి పాఠాలు చెప్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. అయితే వారిలో కొందరు ఎమ్మెల్సీ ఓటు కూడా సరిగ్గా వేయలేకపోయారు.కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లకుగాను 2,52,100 ఓట్లు పోలయ్యారు. అందులో సుమారు 28,000 ఓట్లను చెల్లనివిగా పరిగణించారు.
ఇందుకోసం ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ కూడా చేశారు. కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీలో 897 ఓట్లు, వరంగల్–ఖమ్మం–నల్లగొంట టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో 499 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండటంలో అవి ఎవరి కొంపముంచుతాయోనన్న ఆందోళన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
అవగాహన లేకపోవడం వల్లే..
వాస్తవానికి ఈసారి ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో అధికారులు మంచి ప్రచారమే కల్పించారు. దీనికితోడు అభ్యర్థులు సైతం ఓటు నమోదులో కీలకంగా వ్యవహరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ పరిధిలో 1.95 లక్షల ఓట్లకు 1.15 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఈసారి అదే సెగ్మెంట్‌లో 3.55 లక్షల ఓట్లు నమోదు కాగా, 2.52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లకుండా పోయిన గ్రాడ్యుయేట్ 28 వేలు ఉండటంతో, ఓటు వేసే విషయంలో ముందస్తుగా ఎలాంటి అవగాహన కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న విమర్శలున్నాయి.
డబ్బులు తీసుకొని ఓట్లు చెల్లకుండా చేసి..
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మొత్తంలో టీచర్ ఓటర్లకు డబ్బులు పంచేవారని వార్తలొచ్చాయి. కొందరు అభ్యర్థులు ఓటును బట్టి.. రూ.5,000, రూ.8,000, రూ.10,000 వరకూ పంచారన్న విమర్శలు ఉన్నాయి. ఇక పట్టభద్రుల విషయానికి వస్తే కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.1,000, మరికొందరు రూ.1,500 చొప్పున పంచినట్టు ప్రచారం జరిగింది. అభ్యర్థులు చదువుకున్న వారని, తమ వైపునకు తిప్పుకునేందుకు డబ్బులు ఇస్తే.. తీరా వేలాది ఓట్లు చెల్లకుండా చేసి తమ డబ్బును నీళ్లలో పోశారని లోలోపల బాధపడుతున్నారు. చెల్లకుండాపోయిన ఓట్లు ఎవరి ఓటమికి దారితీస్తాయోనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాలామంది ఓటు వేశాక.. ప్రాధాన్య అంకెకు ముందు సున్నా పెట్టడం, లేదా అంకెకు సున్నా చుట్టడం, ఫొటోలు చించడం, తొలి ప్రాధాన్యం ఒకరి కంటే ఎక్కువ మందికి ఇవ్వడం, ఫొటోలకు ముందు టిక్ పెట్టడం, సంతకం చేయడం, ముద్రలు వేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాయడం, వ్యక్తిగత సమస్యలు రాయడం తదితర పొరపాట్ల వల్ల ఓట్లు చెల్లకుండా పోయాయి. మరోవైపు భారీగా ఓట్లు చెల్లకుండా పోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. వీరి కంటే చదువురాని నిరక్షరాస్యులు నయమంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
కొనసాగుతున్న ‘గ్రాడ్యుయేట్’ కౌంటింగ్
» ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు
»ఐదు రౌండ్ల వరకు బీజేపీ, ఆరోరౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం
»7,118 ఓట్ల మెజారిటీతో అంజిరెడ్డి ముందంజ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు మంగళవారం మొదలైంది. ఈ ఎన్నికల్లో అంజిరెడ్డి (బీజేపీ), నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ)ల మధ్య త్రిముఖపోరు నెలకొంది. బీజేపీ అభ్యర్థి మిగిలిన ఇద్దరి అభ్యర్థుల కంటే స్వల్ప ఆధికత్యను ప్రదర్శిçస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో మొత్తం 3.55 లక్షల ఓట్లలో..పోస్టల్ బ్యా లెట్‌తో కలిపి 2,52,100 ఓట్లు పోల్ కాగా, అందులో 2,24,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.
దాదాపు 28వేల ఓట్లు చెల్లలేదు. వాస్తవానికి సోమవారం ఉదయం నుంచి చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లను వేరు చేసి వడబోసే కార్యక్రమం ప్రారంభమైనా.. అది మంగళవారం మధ్యా హ్నం వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు కేటాయించారు. అందులో ప్రతీ టేబుల్‌కు 1,000 చొప్పున ప్రతీ రౌండ్‌కు 21,000 ఓట్లను 12 రౌండ్లలో లెక్కిస్తామని అధికారులు తెలిపారు.
మొదటి రౌండ్ : లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలిరౌండ్ ఫలితం మధ్యా హ్నం 2.30 గంటలకు వెలువడింది. బీజేపీ అభ్యర్థి అంజిరె డ్డికి 6,712 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 6,676, బీఎస్పీ అభ్యరి్థకి ప్రసన్న హరికృష్ణకు, 5,867 ఓట్లు సాధించారు. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప అభ్యర్థి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 36 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు.
రెండో రౌండ్ : ఈ రౌండ్‌లోనూ బీజేపీ మెజారిటీ కొనసాగింది. అంజిరెడ్డికి 7,979 (రెండు రౌండ్లు కలిపి 14,691), నరేందర్‌రెడ్డికి 6,522 (రెండు రౌండ్లు కలిపి 13,198), ప్రసన్న హరికృష్ణకు 4,927 (రెండురౌండ్లు కలిపి 10,794) ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యరి్థపై 1,457 ఓట్లు ఆధిక్యం ప్రదర్శించి.. మొత్తంగా 1,493 ఓట్లు మెజారిటీ సాధించారు.
మూడవ రౌండ్ : మూడో రౌండ్‌లోనూ బీజేపీ తన హవాను కొనసాగించింది. అంజిరెడ్డి 8,619 ఓట్లు (3రౌండ్లు కలిపి 23,310), నరేందర్‌రెడ్డి 5,614 (3 రౌండ్లు కలిపి 18,812), ప్రసన్న హరికృష్ణ 5,086 (3రౌండ్లు కలిపి 15,880) ఓట్లు సాధించారు. మూడో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప అభ్యర్థి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 3,005 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించగా, మెజారిటీ 4,498 ఓట్లకు చేరింది.
నాలుగో రౌండ్: ఈ రౌండ్‌లోనూ అంజిరెడ్డి దూకుడు సాగింది. అంజిరెడ్డి 7,807 (4 రౌండ్లు కలిపి (31,117), నరేందర్‌రెడ్డి 6,544 (4 రౌండ్లు కలిపి 25,356), ప్రసన్న హరికృష్ణకు 5,271 (4 రౌండ్లు కలిపి 21,151)ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి తన సమీప అభ్యర్థి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 1,263 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించగా, మెజారిటీ 5,761 ఓట్లకు చేరింది.
ఐదో రౌండ్: ఈ రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగింది. అంజిరెడ్డి 7,850 (5 రౌండ్లు కలిపి 38,967), నరేందర్‌రెడ్డి– 6,288 (5 రౌండ్లు కలిపి 31,644), ప్రసన్న హరికృష్ణ 5,411 (5 రౌండ్లు కలిపి 26,562)ఓట్లు సాధించారు. కాగా అంజిరెడ్డి నరేందర్‌రెడ్డిపై 7,323 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
ఆరోరౌండ్ : ఈ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 205 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అంజిరెడ్డి 6,855 (6 రౌండ్లు కలిపి 45,822), నరేందర్‌రెడ్డి– 7,060 (6 రౌండ్లు కలిపి 38,704), ప్రసన్న హరికృష్ణ 5548 (6 రౌండ్లు కలిపి 32110)ఓట్లు సాధించారు. మొత్తంగా 7,118 ఓట్ల మెజారిటీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నాడు. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000 కాగా, ఆరోరౌండ్ వరకు 1,26,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment