
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 93.55 శాతం
కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 70.42 శాతం
కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 91.90 శాతం
2019 ఎన్నికలతో పోలిస్తే మూడు స్థానాల్లో భారీగా పెరిగిన పోలింగ్
సాక్షిప్రతినిధి,కరీంనగర్/నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నుంచే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులుదీరారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ 93.55 శాతంగా నమోదైంది. ఈ నియోజకవర్గ పరిధిలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,132 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గతంలో 20,888 మంది ఓటర్లు ఉండగా అందులో 18,884 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు పోలింగ్ శాతం 90.41 కాగా, ఈసారి 3.14 శాతం అధికంగా నమోదైంది.
» యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 96.54 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 984 ఓట్లు ఉండగా, 950 ఓట్లు పోలయ్యాయి. ఇక హనుమకొండ జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. అక్కడ 5,215 మంది ఓటర్లు ఉండగా, 4,780 మంది (91.66 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓట్లపరంగా చూస్తే అత్యధిక ఓట్లు హనుమకొండ జిల్లాలో ఉండగా, అక్కడే అత్యధిక ఓట్లు పోలయ్యాయి.
» నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సులను భద్ర పరిచారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఏర్పాట్లను ఎన్నికల రిటరి్నంగ్ అధికారి ఇలా త్రిపాఠితో కలిసి నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్ గురువారం రాత్రి పరిశీలించారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
ఆ రెండు స్థానాల్లో ఇలా...
» కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సుల్తానాబాద్, చిగురుమామిడిలో ఓ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది.
» కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 2019 ఎన్నికలప్పుడు 1.96 లక్షల ఓట్లు ఉండగా.. ఈసారి అది 3.55 లక్షలకు చేరింది. మొత్తంగా ఈ నియోజకవర్గ పరిధిలో 70.42 శాతంగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 59.03 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
» కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 2019 ఎన్నికలప్పుడు 23,160 ఓటర్లు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 27,088 చేరింది. ఈ స్థానంలో 91.90 శాతంగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 83.54 శాతం మందే ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఆయా జిల్లాల్లో పోలింగ్ పదనిసలు ఇలా...
సాక్షి, నెట్‌వర్క్: మూడు స్థానాల్లో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్‌లో అనేక పదనిసలు చోటుచేసుకున్నాయి.
» జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్ర పరిధిలో 19 ఓట్లు తొలగించారని ధర్మకంచ జూనియర్ కళాశాల లెక్చరర్లు ఎ.శ్రీకాంత్‌రెడ్డి, చేర్యాల, మిడిదొడ్డి జూనియర్ కళాశాల అధ్యాపకులు కె.శ్రీధర్, గొల్లూరి రామచంద్రయ్య వాపోయారు.
» జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కేవలం ఒక్కరే ఉండగా, తనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయుడు సుధాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
» సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర్ డంప్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం ప్రజలు నెలరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపుతో పట్టభద్రులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. 295 మంది పట్టభద్రులైన ఓటర్లు ఉండగా, కేవలం 42 మంది మాత్రమే ఓటేశారు.
» మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రానికి చెందిన పట్టభద్రుడు అరిగెల మల్లాగౌడ్ జెడ్పీ హైసూ్కల్‌లో ఓటేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఎవరో ఓటేశారని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు. తన ఓటును వేరే ఎవరో ఎలా వేస్తారని అధికారులను నిలదీయడంతో అన్నీ పరిశీలించాక, చివరకు అతనితో టెండర్ ఓటు వేయించారు.
» సిద్దిపేట జిల్లా మర్రిముచ్చాలకు చెందిన అమరేందర్‌రెడ్డి జనగామలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఓటుపై అవగాహన కల్పించేందుకు సుమారు 22 కిలోమీటర్ల మేర గ్రామాల్లో జాగింగ్ చేశారు. అనంతరం కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
Comments
Please login to add a commentAdd a comment