
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మరో ముందడుగు పడింది. సహయకచర్యలకు ఆటంకంగా ఉన్న బురద, శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహయక చర్యలు వేగవంతం కానున్నాయి. టన్నెల్‌లో 11 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి. త్వరలో తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్‌హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ ఇలా 12 విభాగాలకు చెందిన దాదాపు 650 సభ్యులతో నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాద సమయంలో పెద్దమొత్తంలో సీపేజ్ వాటర్, మట్టి పడటంతో టన్నెల్లో బురద పేరుకుపోయి సహయక చర్యలకు ఆటంకంగా మారింది. అదే సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ధ్వంసం అయ్యింది. మిషన్‌కు అను సంధానంగా పనిచేసే కన్నేయర్ బెల్ట్ సైతం దెబ్బతింది.దీంతో టన్నెల్‌లో ఉన్న శిథిలాలు, బురద అలాగే ప్లాస్మా కట్టర్స్ ద్వారా తొలగిస్తున్న టీబీఎం మిషన్ పరికరాల తొలగింపు సమస్యగా మారింది. ఇప్పటి వరకు లోకో ట్రైన్ ద్వారా రెండు బోగీలలో వాటిని తొలగిస్తూ వచ్చారు.

ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన బురద, శిథిలాలు తొలగించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సహయక చర్యలు వేగవంతం కావాలంటే కన్వేయర్ బెల్ట్ పునరద్దరణే శరణ్యమని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో వెంటనే కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇంజనీయర్లు రెండు రోజులు శ్రమించి ఇవాళ సాయంత్రం దాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం వ్యర్దాలను ఈ బెల్ట్ ద్వార బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో టన్నెల్‌లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, బురద ఉన్నట్టు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణతో తప్పిపోయిన వారి ఆచూకీ త్వరలోనే గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.

రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి సహయకచర్యలు చేపట్టడం మాత్రం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment