భారత్, పాక్‌ మ్యాచ్‌తో ఏం సంబంధం? | TPCC Mahesh Kumar Goud Fires On Bandi Sanjay | Sakshi
Sakshi News home page

భారత్, పాక్‌ మ్యాచ్‌తో ఏం సంబంధం?

Published Wed, Feb 26 2025 5:09 AM | Last Updated on Wed, Feb 26 2025 5:09 AM

TPCC Mahesh Kumar Goud Fires On Bandi Sanjay

ఎమ్మెల్సీ ఎన్నికలపై సంజయ్‌ది దిగజారుడు రాజకీయం

పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఫైర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు, దుబాయిలో జరిగిన భారత్, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌పై భారత్‌ విజయం సాధిస్తే ప్రతి భారతీయుడు సంతోషపడ్డాడని, కానీ అదేదో బీజేపీయే మ్యాచ్‌ను గెలిపించినట్లు దానికీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెట్టడం సిగ్గుచేటన్నారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

ఎన్నిక ఏదైనా హిందూ.. ముస్లిం, భారత్‌..పాకిస్తాన్‌ ముచ్చట తీయకుండా బీజేపీ ఓటడగదని విమర్శించారు. 2014లో శ్రీరాముడి పేరిట అధికారంలోకి వచి్చన బీజేపీ చేసిందేమీ లేదని, తర్వాత రెండుసార్లు దేవుడి పేరునే వాడుకుందని ధ్వజమెత్తారు. బీజేపీకి లాభం చేసేందుకే బీఆర్‌ఎస్‌ పోటీలో లేదన్నారు. బీసీలను అణగదొక్కే బీజేపీ ఒక వైపు, రెడ్డి సీఎంగా ఉన్నా బీసీలకు న్యాయం చేసే కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 

సంజయ్‌ది అవగాహనా రాహిత్యం 
    దేశంలో అన్ని ధరలు పెరిగాయని, పేదలకు మోదీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో సంజయ్‌ చెప్పాలన్నారు. ఈ ఫార్ములా రేసు కేసులో ఒక పక్క విచారణ జరుగుతుంటే, కేటీఆర్‌కు నోటీసు కూడా ఇవ్వలేదని అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎందుకు సీబీఐ విచారణ జరిపించకూడదని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని 3.1 శాతం కుటుంబాలు కూడా వివరాలు నమోదు చేసుకోవాలని, 28వ తేదీ వరకు కేసీఆర్, హరీశ్‌లాంటి వారికి కూడా అవకాశం ఇచ్చామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement