వర్సోవ/బోరివలి, న్యూస్‌లైన్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అంధేరీలోని గావ్‌దేవి ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి డోంగిరి గుట్టపై వెలసిన గంగమ్మ, మైసమ్మ, ఎల్లమ్మలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ముగ్గురు దేవతలు కొల్లాపూర్ నుంచి వచ్చి గ్రామదేవతల రూపంలో ఇక్కడ వెలిశారని ప్రతీతి. ఆదివారం గావ్‌దేవి ప్రాంతంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకొని బంధువులరాకతో ఇక్కడ రెండు రోజుల ముందే సందడి నెలకొంది. సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల తో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన నైవేద్యాన్ని, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పించారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మల్లికార్జున ఒగ్గు కథ కళాకారుల బృందం ఆలయంలోని ముగ్గురు అమ్మవార్ల చరిత్రను భక్తులకు తమ ఆటపాటల ద్వారా వినిపించారు. ఇదిలాఉండగా గత 40 ఏళ్లుగా బోనాల పండుగను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మందిరం చిన్నగా ఉండడంతో మూడేళ్ల క్రితమే పునర్నిర్మించామని సంఘం అధ్యక్షుడు మంగలి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒడి బియ్యం రూపంలో వచ్చిన ధాన్యాన్ని వండి భక్తులకు అన్నదానం చేస్తామని, అదే సమయంలో జంతు బలి కూడా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గొంగిడి సత్యనారాయణ, పూసపాండు, ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మయ్య, కార్యదర్శి ఎంకర్ల అంజయ్య, గడియ కృష్ణ, పచ్చు సత్తయ్య, కోశాధికారి పచ్చు కృష్ణ, యోగుల శ్రీనివాస్, మద్దెల సాయిబాబా గౌడ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రకటించడంతో ఈసారి బోనాలను ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నామని చెప్పారు.
ఘనంగా బోనాల పండుగ
Published Tue, Aug 20 2013 12:24 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement