Borivali
-
మొసళ్లనూ తరలిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: మొసలి ‘కన్నీరు’పెడుతోంది. మొసగాళ్ల వలలో మోసళ్లు చిక్కాయి. నగరం నుంచి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రెండు మొసలి పిల్లల్ని ముంబైకి తరలిస్తున్న ముఠాను మహారాష్ట్రలోని బొరివలి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సహా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాదీలు ఉన్నారు. వివరాలు... హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొసళ్ల అక్రమ రవాణా జరుగుతున్నట్లు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఓ ప్రత్యేక బృందం బొరివలి ప్రాంతంలో మాటు వేసింది. అక్కడి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా వచి్చన సదరు ప్రైవేట్ బస్సును ఆపి తనిఖీ చేసింది. డ్రైవర్ సీటు సమీపంలో కార్టన్ బాక్స్‌లో ప్యాక్ చేసిన బోనును గుర్తించి తెరిచి చూడగా అందులో రెండు ఆడ మొసలి పిల్లలున్నాయి. ఆ బాక్సును తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చారని, హైదరాబాద్ నుంచి ముంబై తీసుకువెళ్లాలంటూ రూ.1500 చెల్లించారని బస్సు డ్రైవర్ అయిన హైదరాబాద్‌వాసి మహ్మద్ అబ్దుల్ రహీం హఫీజ్ విచారణలో చెప్పాడు. అందులో కొన్ని ఔషధాలు ఉన్నాయని నమ్మబలికారని వెల్లడించాడు. అదేబస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాదీ శివాజీ బాలయ్య, కర్ణాటకకు చెందిన లతీఫ్ బేగ్ ఆపెట్టెను తీసుకువచ్చారని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొసలిపిల్లలకు చికిత్స అధికారులు ఆ రెండు మొసలి పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని పశువైద్యులు పరిశీలించి ఆ పిల్లల వయస్సు మూడు నెలలలోపే ఉంటుందని, ఒక్కోటి రెండు అడుగుల పొడవు ఉందని తేల్చారు. చాలాసేపు ఓ చిన్న పెట్టెలో ప్యాక్ చేయడంతో అనారోగ్యానికి గురైన మొసలి పిల్లలకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ మొసళ్లను ఎక్కడ నుంచి తీసువస్తున్నారనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. నాగార్జునసాగర్, మంజీరనది నుంచే వీటిని సేకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటివిలువ మార్కెట్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో మొసలి పిల్లలకు భారీ డిమాండ్ ఉందని సమాచారం. ప్రముఖులకు చెందిన ఫామ్‌హౌస్‌ల్లోని కొలనుల్లో మొసళ్లను పెంచుకోవడం ఇటీవల కాలంలో పెరిగింది. అధికారికంగా పెంచుకోవడానికి అనుమతి లేకపోవడంతో అక్రమ రవాణా ద్వారా సేకరిస్తుననట్లు సమాచారం. బొరివాలి వ్యవహారంపై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగనుంది. తదుపరి దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందం సిటీకి రానుంది. -
‘మీలో ఎవరు చరిత్ర ఎక్స్పర్ట్’..
‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ మాదిరిగా వినూత్నకార్యక్రమం సాక్షి, ముంబై : బోరివలిలోని వాజే-కేల్కర్ కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి కలిగించేందుకు ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర విభాగం బోధించే ప్రొఫెసర్ రవి కుమార్ చందుపట్ల తనకున్న పరిజ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కళాశాల విద్యార్థుల కోసం ’కౌన్ బనేగా కరోడ్ పతి’ మాదిరిగానే కాలేజీ ఆడిటోరియంలో ‘మీలో ఎవ్వరు చరిత్ర ఎక్స్పర్ట్’ అనే పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ బిబి శర్మ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్స్‌పల్ విద్యాధర్ జోషి పర్యవేక్షించారు. 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశంలోని ప్రశ్నలను ఆధారంగా నిర్వహించారు. ఓ చిత్రాన్ని చూపించి నాలుగు జవాబులు (ఆప్షన్స్) ఇచ్చారు. జవాబు చెప్పేందుకు 45 సెకన్ల సమయం ఇచ్చారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విద్యార్థుల మంచి స్పందన లభించింది. ఇక మీదట 11వ తరగతి పుస్తకాలను కేబీసీ మాదిరిగా తయారు చేయాలన్నదే తన ఉద్దేశమని ప్రొఫెసర్ రవికుమార్ చందుపట్ల పేర్కొన్నారు. ఈ పోటీలను పలు కాలేజీలు, పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులల్లో చదువ పట్ల ఆసక్తి పెరుగుతోందని అన్నారు. -
శివసేనకే మా మద్దతు
బోరివలి, న్యూస్‌లైన్: రాబోయే శాసన సభ ఎన్నికలల్లో శివసేన పార్టీకే మద్దతు ఇవ్వనున్నట్లు గోరేగావ్ నియోజక వర్గం పరిధిలోని తెలుగు చర్చీల పాస్టర్లు తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం పశ్చి మ గోరేగావ్ పరిధి మోతీలాల్ నగర్లో ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ అనే తెలుగు చర్చిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పాస్టరు ఆర్.ఎస్. రత్నం మాట్లాడారు. స్థానిక తెలుగు పాస్టర్లు అందరూ గతంలో వేర్వేరు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఐక్యత దెబ్బతిన్నదన్నారు. తమ సమస్యల పరిష్కారానికి అన్ని చర్చీలు ఏకతాటిపైకి వచ్చి శివసేన పార్టీకి మద్దతు ఇవ్వాల్సి న అవసరం ఉన్నదన్నారు. సిటింగ్ ఎమ్మెల్యే సుభా ష్ దేశాయ్‌ను గెలిపు కోసం కృషి చేయాలని కోరా రు. శివసేన నాయకుడు ప్రకాష్ స్వామి మాట్లాడుతూ శివసేన పార్టీకి మద్దతు ప్రకటించిన తెలుగు పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. శివసేన మహారాష్ట్ర తెలుగు సంఘటన కార్యధ్యక్షుడు ప్రకాష్ స్వామి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరేగావ్ నియోజక వర్గం పరిధిలోని 12 మంది తెలుగు చర్చీల పాస్టర్లు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు ‘ట్రెస్ పాసింగ్’
- బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లో పనులు ప్రారంభం - ఆ తర్వాత దశలలో మిగతా స్టేషన్లకు విస్తరిస్తామన్న అధికారులు సాక్షి, ముంబై: నగరంలో వివిధ రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటుతూ వేలాది మంది మృతి చెందుతుండడాన్ని రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రమాదాలను అరికట్టడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు రూ.130 కోట్ల వ్యయంతో ‘ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు’ను చేపట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ట్రాక్‌ల మధ్య రేలింగ్‌లు, పచ్చదనం పెంచడం, ఆర్సీసీ వాల్, గట్టర్లను ట్రాక్‌ల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడతగా బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లో ఇటీవలే పనులు ప్రారంభించారు. ‘రైలు ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్న 11 స్టేషన్లను గుర్తించాం. ఇక్కడ బారికేడ్లు నిర్మించినా ప్రయాణికులు వీటిని లెక్క చేయకుండా ముందుకెళ్లి ప్రమాదం బారినపడుతున్నారు. దీంతో వీటి ఎత్తును కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నామ’ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు. ఈ 11 రైల్వే స్టేషన్లలో బారికేడ్లను ఏర్పాటుచేయడం ద్వారా 80 శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతగా బోరివలి స్టేషన్లో రూ.14.5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వసైలో రూ.14.5 కోట్లు, నాలాసోపారాలో రూ.90 లక్షలు, కుర్లాలో రూ.8.1 కోట్లు, కన్జూర్మార్గ్లో రూ.8.1 కోట్లు, కల్యాణ్‌లో రూ.8.2 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. కాగా, ఈ ప్రాజెక్ట్ పనులు మొదటి విడతగా బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లలో ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ ఎమ్మార్వీసీ చేపట్టింది. ఆ తర్వాత కుర్లా, కల్యాణ్, వసై, నాలాసోపారా స్టేషన్లలో ప్రారంభించనున్నారు. రెండో విడతగా దాదర్, కాందివలి, బయంధర్, ఠాణే, ఠాకుర్లా స్టేషన్లలో ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టనున్నారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం టికెట్ వెండింగ్ మిషన్లు, వాటర్ కూలర్లు, ఔషధ దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఎస్కలేటర్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. రైల్వే చర్యలు శూన్యం... రైల్వే ప్లాట్‌ఫాంలు రద్దీగా ఉండడంతో సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం ప్రయాణికులు పట్టాలు దాటుతున్నారని తెలిసింది. రద్దీ సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై కూడా రద్దీ ఉండడంతో వేరే గత్యంతరం లేక పట్టాలు దాటుతున్నారు. రైల్వే స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు వసతులు కొరవడ్డాయి. ఎస్కలేటర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. చివరి క్షణంలో రైలును మరో ప్లాట్‌ఫాంపైకి మార్చినట్లు ప్రకటించడం కూడా ప్రమాదాలకు కారణంగా తేలింది. ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ల ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు వీటి మీది నుంచి దూకేస్తున్నారు. -
పక్షి జాతులపై సర్వే
సాక్షి, ముంబై: బోరివలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్జీఎన్పీ) అధికారులు పక్షుల జాతులపై సర్వే నిర్వహించనున్నారు. ఈ నెల చివరన జరిగే సర్వేలో పార్కు సిబ్బంది, పక్షి శాస్త్రవేత్తలు, పక్షి ప్రేమికులు పాల్గొననున్నారు. ఈ అధ్యయనం పూర్తి అవడానికి కనీసం మూడు నెలల సమయం తీసుకునే అవకాశముందని ఎస్జీఎన్పీ డెరైక్టర్ వికాస్ గుప్తా తెలిపారు. పక్షుల వివరాలను సేకరించడం ద్వారా ఈ పార్కులో ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుస్తుందని, ఎడ్యుకేషన్ మెటీరియల్‌కు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రచారం కోసం సీతాకోక చిలుకలు, పక్షులు, పార్కులోని వృక్షజాతులపై కొత్త బుక్లెట్లను ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా నిర్వహించే ఈ అధ్యయనం తమకు ఎంతో దోహదకరంగా ఉంటుందన్నారు. పక్షి శాస్త్రవేత్తల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ప్రకృతి శాస్త్రవేత్త సంజయ్ మోంగా ఆధ్వర్యంలో బృందం 2011-12 మధ్య కాలంలో ఈ పార్కులోని పక్షులపై ప్రాథమిక అధ్యయనం చేశారు. వీరు తయారుచేసిన నివేదికను పార్కు పరిపాలన విభాగానికి కూడా సమర్పించారు. 251 పక్షి జాతులు ఉండగా, 155 సీతాకోక చిలుకల జాతులు, 40 జాతుల పాలిచ్చు జంతువులు, 800 రకాల జాతుల చెట్లు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈసారి అధ్యయనాన్ని వారాంతంలో, రాత్రి వేళ్లలో నిర్వహిస్తామని వికాస్ గుప్తా తెలిపారు. అన్ని రకాల పక్షులు ఒకే చోట చేరడానికి శీతాకాలం అనువైన కాలమని తెలిపారు. పార్కులో భద్రత... ఈ పార్కు ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద అత్యాధునిక కెమెరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం రిజల్యూషన్ తక్కువగా నమోదయ్యే కెమెరాలను కీలక ప్రదేశాలలో అమర్చారు. ఇవి వాహనం పార్కు లోపలికి ప్రవేశించిన సమయం, సందర్శకులు గడిపిన సమయం, నిష్ర్కమణ సమయం కూడా నమోదు చేస్తుంది. ఈ పార్కులో అత్యవసర సమయాల్లో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. -
ఘనంగా బోనాల పండుగ
వర్సోవ/బోరివలి, న్యూస్‌లైన్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అంధేరీలోని గావ్‌దేవి ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు. నల్లగొండ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి డోంగిరి గుట్టపై వెలసిన గంగమ్మ, మైసమ్మ, ఎల్లమ్మలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ముగ్గురు దేవతలు కొల్లాపూర్ నుంచి వచ్చి గ్రామదేవతల రూపంలో ఇక్కడ వెలిశారని ప్రతీతి. ఆదివారం గావ్‌దేవి ప్రాంతంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకొని బంధువులరాకతో ఇక్కడ రెండు రోజుల ముందే సందడి నెలకొంది. సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల తో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన నైవేద్యాన్ని, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మల్లికార్జున ఒగ్గు కథ కళాకారుల బృందం ఆలయంలోని ముగ్గురు అమ్మవార్ల చరిత్రను భక్తులకు తమ ఆటపాటల ద్వారా వినిపించారు. ఇదిలాఉండగా గత 40 ఏళ్లుగా బోనాల పండుగను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మందిరం చిన్నగా ఉండడంతో మూడేళ్ల క్రితమే పునర్నిర్మించామని సంఘం అధ్యక్షుడు మంగలి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒడి బియ్యం రూపంలో వచ్చిన ధాన్యాన్ని వండి భక్తులకు అన్నదానం చేస్తామని, అదే సమయంలో జంతు బలి కూడా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గొంగిడి సత్యనారాయణ, పూసపాండు, ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మయ్య, కార్యదర్శి ఎంకర్ల అంజయ్య, గడియ కృష్ణ, పచ్చు సత్తయ్య, కోశాధికారి పచ్చు కృష్ణ, యోగుల శ్రీనివాస్, మద్దెల సాయిబాబా గౌడ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రకటించడంతో ఈసారి బోనాలను ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నామని చెప్పారు.