‘మీలో ఎవరు చరిత్ర ఎక్స్‌పర్ట్’..
‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ మాదిరిగా వినూత్నకార్యక్రమం
సాక్షి, ముంబై : బోరివలిలోని వాజే-కేల్కర్ కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి కలిగించేందుకు ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర విభాగం బోధించే ప్రొఫెసర్ రవి కుమార్ చందుపట్ల తనకున్న పరిజ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కళాశాల విద్యార్థుల కోసం ’కౌన్ బనేగా కరోడ్ పతి’ మాదిరిగానే కాలేజీ ఆడిటోరియంలో ‘మీలో ఎవ్వరు చరిత్ర ఎక్స్‌పర్ట్’ అనే పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ బిబి శర్మ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్స్‌పల్ విద్యాధర్ జోషి పర్యవేక్షించారు.
12వ తరగతి చరిత్ర పాఠ్యాంశంలోని ప్రశ్నలను ఆధారంగా నిర్వహించారు. ఓ చిత్రాన్ని చూపించి నాలుగు జవాబులు (ఆప్షన్స్) ఇచ్చారు. జవాబు చెప్పేందుకు 45 సెకన్ల సమయం ఇచ్చారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విద్యార్థుల మంచి స్పందన లభించింది. ఇక మీదట 11వ తరగతి పుస్తకాలను కేబీసీ మాదిరిగా తయారు చేయాలన్నదే తన ఉద్దేశమని ప్రొఫెసర్ రవికుమార్ చందుపట్ల పేర్కొన్నారు. ఈ పోటీలను పలు కాలేజీలు, పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులల్లో చదువ పట్ల ఆసక్తి పెరుగుతోందని అన్నారు.