ప్రమాదాల నివారణకు ‘ట్రెస్ పాసింగ్’
- బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్‌లో పనులు ప్రారంభం
- ఆ తర్వాత దశలలో మిగతా స్టేషన్లకు విస్తరిస్తామన్న అధికారులు
సాక్షి, ముంబై: నగరంలో వివిధ రైల్వే స్టేషన్‌లలో పట్టాలు దాటుతూ వేలాది మంది మృతి చెందుతుండడాన్ని రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రమాదాలను అరికట్టడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు రూ.130 కోట్ల వ్యయంతో ‘ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు’ను చేపట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ట్రాక్‌ల మధ్య రేలింగ్‌లు, పచ్చదనం పెంచడం, ఆర్‌సీసీ వాల్, గట్టర్లను ట్రాక్‌ల వెంబడి ఏర్పాటు చేస్తున్నారు.
తొలివిడతగా బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్‌లో ఇటీవలే పనులు ప్రారంభించారు. ‘రైలు ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్న 11 స్టేషన్లను గుర్తించాం. ఇక్కడ బారికేడ్లు నిర్మించినా ప్రయాణికులు వీటిని లెక్క చేయకుండా ముందుకెళ్లి ప్రమాదం బారినపడుతున్నారు. దీంతో వీటి ఎత్తును కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నామ’ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు.
ఈ 11 రైల్వే స్టేషన్లలో బారికేడ్లను ఏర్పాటుచేయడం ద్వారా 80 శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతగా బోరివలి స్టేషన్‌లో రూ.14.5 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వసైలో రూ.14.5 కోట్లు, నాలాసోపారాలో రూ.90 లక్షలు, కుర్లాలో రూ.8.1 కోట్లు, కన్జూర్‌మార్గ్‌లో రూ.8.1 కోట్లు, కల్యాణ్‌లో రూ.8.2 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. కాగా, ఈ ప్రాజెక్ట్ పనులు మొదటి విడతగా బోరివలి, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్లలో ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ ఎమ్మార్‌వీసీ చేపట్టింది.
ఆ తర్వాత కుర్లా, కల్యాణ్, వసై, నాలాసోపారా స్టేషన్లలో ప్రారంభించనున్నారు. రెండో విడతగా దాదర్, కాందివలి, బయంధర్, ఠాణే, ఠాకుర్లా స్టేషన్లలో ట్రెస్ పాసింగ్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టనున్నారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం టికెట్ వెండింగ్ మిషన్లు, వాటర్ కూలర్లు, ఔషధ దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఎస్కలేటర్లను కూడా ఏర్పాటుచేయనున్నారు.
రైల్వే చర్యలు శూన్యం...
రైల్వే ప్లాట్‌ఫాంలు రద్దీగా ఉండడంతో సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం ప్రయాణికులు పట్టాలు దాటుతున్నారని తెలిసింది. రద్దీ సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై కూడా రద్దీ ఉండడంతో వేరే గత్యంతరం లేక పట్టాలు దాటుతున్నారు. రైల్వే స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు వసతులు కొరవడ్డాయి. ఎస్కలేటర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. చివరి క్షణంలో రైలును మరో ప్లాట్‌ఫాంపైకి మార్చినట్లు ప్రకటించడం కూడా ప్రమాదాలకు కారణంగా తేలింది. ప్రస్తుతం పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ల ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు వీటి మీది నుంచి దూకేస్తున్నారు.