సాక్షి, ముంబై: లోకమాన్యతిలక్ టెర్మినస్ (కుర్లా-ముంబై)-నిజామాబాద్ మార్గంలో ప్రారంభమైన రైలు ప్రతినిత్యం నడపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి మూడు నాలుగు రోజులైన నడపాలని సూచిస్తున్నారు. రైల్వేశాఖ 2013-14 రైల్వే బడ్జెట్‌లో ఎల్టీటీ-నిజామాబాద్ మధ్య కొత్త రైలును ప్రకటించింది. ఈ రైలును అక్టోబరు 27వ తేదీన అధికారికంగా ప్రారంభించిన విషయం విదితమే. వారానికి ఒకసారి ప్రతి శనివారం నడవనున్న ఈ రైలు నవంబరు రెండో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
అయితే రైలు ప్రారంభమైన రెండోరోజే టికెట్లు అయిపోయాయి. అధికారికంగా ఎల్టీటీ-నిజామాబాద్ రైలుకు అక్టోబరు 26 నుంచి అడ్వాన్స్ టిక్కెట్లు తీసుకునేందుకు వీలు కల్పించారు. అయితే 27వ తేదీనే స్లీపర్‌క్లాస్ టిక్కెట్లు ఆర్‌ఏసీకి (రిజర్వేషన్ ఎగెనెస్ట్ క్యాన్సిలేషన్)వచ్చాయి. అక్టోబరు 28 నుంచి వెయిటింగ్‌లిస్టుకు చేరుకున్నాయి. అక్టోబరు 29 మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు అందిన వివరాల మేరకు స్లీపర్ కోచ్ వెయిటింగ్ లిస్ట్ 79, 3 టైర్ ఏసీ వెయిటింగ్ లిస్ట్ 15, 2 టైర్ వెయిటింగ్ లిస్ట్ ఎనిమిదికి చేరుకున్నాయి. ఇక దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లోనైతే వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 426కి చేరింది. విపరీతమైన రద్దీ ఉన్న కారణంగా ఈ రైలును నిత్యం నడపాలని, ఠాణేలో హాల్ట్ ఇవ్వాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నవంబర్ రెండు నుంచి అధికారిక సేవలు
వారానికి ఒకసారి నడిచే 11205 నంబర్ గల ఎల్‌టీటీ- నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 4.40 గంటలకు ఎల్‌టీటీ నుంచి బయలుదేరి, ఆది వారం ఉదయం 9.15 గంటలకు నిజామాబాద్‌కు చేరుకోనుంది. అక్కడి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు ఎల్‌టీటీ చేరనుంది. అయితే ఈ రైలు టైమ్‌టేబుల్ నవంబర్ రెండు, మూడవ తేదీల నుంచి అమల్లోకి రానుంది. నిజామాబాద్ రైలు ప్రారంభంతో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజ లకు ప్రయాణం మరింత సులువైంది. వీరందరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటివరకు ఒకే ఒక్క రైలు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లేందుకు ఇబ్బం దులు పడేవారు. కానీ ఇప్పుడు మరో రైలు రాకతో ఆనందం వ్యక్తమవుతోంది.
నిజామాబాద్-ఎల్టీటీ రైలు పై తెలుగుప్రజల డిమాండ్
Published Wed, Oct 30 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement