ఇక సామగ్రి సోదా
సాక్షి, ముంబై: దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్ల బోగీలు తరచూ అగ్నిప్రమాదాలకు గురవుతుండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఇందులోభాగంగా ఇకపై ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నగర పరిధిలో బుధవారం ప్రారంభించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలాఉంచితే ఇప్పటిదాకా జరిగిన అగ్నిప్రమాదాలకు బాధ్యులెవరనే విషయం ఇంకా తేలలేదు. అయితే వందలాది మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాలిలో కలసిపోయాయి. నగరంలోని ఐదు స్టేషన్లనుంచి దూరప్రాంత ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్ రైళ్లు బయల్దేరతాయి. ఈ రైళ్లు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్ టెర్మినస్, కుర్లా లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), ముంబై సెంట్రల్, బాంద్రా టెర్మినస్‌లనుంచి బయల్దేరతాయి. ఇటీవల కాలంలో మూడు వేర్వేరు రైల్వే మార్గాల్లో బోగీలకు మంటలు అంటుకోవడంతో అనేకమంది చనిపోయారు.
పదిరోజుల క్రితం బెంగళూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంటల అంటుకున్న ఘటన నుంచి ఇంకా ప్రయాణికులు తేరుకోనేలేదు. తాజాగా స్థానిక బాంద్రా టెర్మినస్ నుంచి బయల్దేరిన డె హ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం తెల్లవారుజామున డహాణు స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మూడు బోగీలు మాడిమసయ్యాయి. ఇలా ఒకదాని వెంట మరో ఘటన చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బాణసంచా, సిగరెట్లు, బీడీలు,అగ్గిపెట్టె, గ్యాస్ లైటర్ తదితర మండే స్వభావం కలిగిన సామగ్రిని తీసుకెళ్లకూడదు. అయితే నగరంలోని పలు టోకు మార్కెట్లలో ఇవి అత్యంత చవక ధరలకు లభిస్తుండడంతో కొందరు ఇక్కడే కొనుగోలు చేసుకుని స్వగ్రామాలకు తీసుకెళుతుంటారు.
ఇలా చేయడం ప్రాణాలతో చెలగాటమాడడమేనని తెలిసినప్పటికీ వారు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. సాధారణ బోగీల్లోని ఫ్యాన్ జాలీల మధ్య తాగిపడేసిన సిగరెట్, బీడీ ముక్కలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఫలితం దక్కడం లేదు. దీంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తేరుకున్న రైల్వే పరిపాలనా విభాగం ఆర్పీఎఫ్‌ను అప్రమత్తం చేసింది. మండే పదార్థాలను తరలిస్తూ పట్టుబడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే పరిధిలోని సీఎస్టీ, దాదర్, ఎల్టీటీ, ఠాణే, కల్యాణ్, పన్వేల్ తదితర రద్దీ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. మండే స్వభావం కలిగిన పదార్థాలు తరలిస్తూ పట్టిబడితే పోలీసులు వారి వద్ద నుంచి కేవలం రూ.200 మాత్రమే జరిమానా కింద వసూలు చేస్తున్నారు. ఇది అతి తక్కువ కావడంతో ప్రయాణికులు తేలిగ్గా తీసుకుంటున్నారని, అందువల్ల ఈ మొత్తాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఓ రైల్వే అధికారి చెప్పారు.
బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
కొంతకాలంగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలతో రైళ్లలో రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రతిసారి దర్యాప్తునకు ఆదేశించడం, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. బాంద్రా-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మరణించడంతో ప్రయాణికుల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాగా గడచిన పదిరోజుల వ్యవధిలో మొత్తం మూడు అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 35 మంది ప్రయాణికులు మృతిచెందారు. డి సెంబర్ చివరివారంలో నాందేడ్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ అనంతరపురంలో అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. ఏసీ బోగీలో జరిగిన ఈ ఘటనలో 26 మంది మరణించారు. వీటితోపాటు ఈ నెల మూడో తేదీన ఠాణేలో నిలిచిఉన్న ఓ లోకల్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులెవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరో తేదీన చాలీస్‌గావ్ రైల్వేస్టేషన్ సమీపంలో ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది.