సాక్షి, ముంబై : నగరంలో అగ్ని ప్రమాదాలు జరిగిన లోకల్ రైళ్లలో ఎక్కువ శాతం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) కంపెనీ తయారుచేసిన బోగీలు ఉన్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే మార్గంలో భెల్ కంపెనీ తయారుచేసిన కొన్ని లోకల్ రైళ్లు తిరుగుతున్నాయి. వాటిలో మార్పులు చేయాలని లేదా కాలం చెల్లిన రైళ్లను కార్ షెడ్డుకు పరిమితం చేయాలని గతంలోనే అప్పటి రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారు. కానీ, నిరక్ష్యం చేయడంతో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
తొమ్మిది సార్లు అగ్నిప్రమాదం..
గత శుక్రవారం రాత్రి దాదర్ స్టేషన్‌లో లోకల్ రైలు బోగీకి మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు థానేలో సైడింగ్ ట్రాక్‌లోకి వెళుతున్న ఓ లోకల్ రైలుకు ఇలాగే మంటలు అంటుకున్నాయి. తాజాగా జరిగిన ఈ రెండు సంఘటనలతో ప్రయాణికుల భద్రత మరోసారి తెరమీదకు వచ్చింది. అదృష్టవశాత్తు ఈ రెండు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సెంట్రల్ రైల్వే మార్గంలో తిరుగుతున్న భెల్ కంపెనీ లోకల్ రైళ్లను ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని 2014 ఏప్రిల్ 16వ తేదీన సేవల నుంచి తొలగించాలని చేతన్ బక్షి రైల్వే బోర్డుకు ప్రతిపాదించారు.ప్రస్తుతం సెంట్రల్ రైల్వే అధీనంలో భెల్ కంపెనీ తయారీ రైళ్లు ఆరు ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో భెల్ కంపెనీ లోకల్ రైళ్లలో తొమ్మిది సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలా నిత్యం రద్దీగా ఉండే లోకల్ రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరగడం ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దాదర్‌లో జరిగిన ఘటనపై కారణాలను వెలికి తీసేందుకు సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కమిటీ నియమించింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించనుంది.
సెంట్రల్ రైల్వే మార్గంలో జరిగిన అగ్ని ప్రమాదాలు...
2014 ఏప్రిల్ 3వ తేదీ– కర్జత్ నుంచి సీఎస్‌ఎంటీ వెళుతున్న లోకల్ రైలుకు దాదర్ ఆరో నంబరు ప్లాట్‌ఫారంపై అగ్ని ప్రమాదం జరిగింది.
2012 డిసెంబర్ 4వ తేదీ–అంధేరీ–సీఎస్‌ఎంటీ వెళుతున్న రైలుకు డాక్‌యార్డ్ స్టేషన్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా, 8 మంది స్వల్పంగా గాయపడ్డారు.
2012 ఏప్రిల్ 8వ తేదీన–కోపర్ రైల్వే స్టేషన్‌లో బోగీ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు కిందికి దూకేశారు. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
2013 మార్చి 15వ తేదీ–ఘాట్కోపర్ స్టేషన్‌లో బోగీకి మంటలు అంటుకున్నాయి.
2018 ఫిబ్రవరి 2వ తేదీ– దాదర్ స్టేషన్‌లో ఒకటో నంబరు ప్లాట్‌పారంపై థానే వెళుతున్న లోకల్ రైలుకు మంటలు అంటుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment