BHEL industry
-
జీఈఎం ద్వారా రూ.1,500 కోట్లు: బీహెచ్ఈఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది. ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్‌లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది. చదవండి: భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో.. -
రాష్ట్రంలో బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన సత్ఫలితాలిచ్చింది. బీహెచ్ఈఎల్ సంస్థ ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) ఏర్పాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినట్లు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. సీఓఈ ఏర్పాటుకు ఒక కేంద్ర బృందాన్ని కూడా ఏర్పాటుచేయనున్నట్లు బీహెచ్ఈఎల్ సీఎండీ నళిన్ సింఘాల్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పాఠశాల విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం–బీహెచ్ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు అందించడానికి బీహెచ్ఈఎల్ ముందుకు వచ్చిందని చెప్పారు. ఆయన మూడ్రోజుల ఢిల్లీ పర్యటన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఆయనేమన్నారంటే.. సీఎం జగన్‌పై నీతి ఆయోగ్ ప్రశంసలు ► రాష్ట్రంలో పాలనపరంగా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కీలక సంస్కరణలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది. ► కరోనా విపత్తు సమయంలో ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులలో కూడా ఏపీ మొదటి స్థానం కైవసం చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. ► కరోనా కష్టకాలంలో ప్రభుత్వ పాలన బాగుందని అమితాబ్ కాంత్ అభినందించారు. ► ఈశాన్య భారత్ అభివృద్ధిలో ఏపీ పోర్టుల పాత్ర కీలకమని.. రాష్ట్రంలో భావనపాడు పోర్టును తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ► అక్టోబర్ నుంచి ఎప్పుడైనా విశాఖలో ‘డిజిటల్ కాన్క్లేవ్’ నిర్వహించేందుకు నీతి ఆయోగ్ ముందుకొచ్చింది. రక్షణ రంగ పెట్టుబడులపై గురి ► మరోవైపు.. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశీయ రక్షణ రంగంలో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి గౌతమ్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందుకోసం వాయు, నేవీ చీఫ్ మార్షల్స్, డీఆర్డీవో చైర్మన్‌తో సమావేశమయ్యారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా రక్షణ రంగం పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఆ రంగంలో అభివృద్ధికి తగిన సహకారమందించాల్సిందిగా డీఆర్డీఓ చైర్మన్ గుండ్రా సతీష్‌ని కోరినట్లు మంత్రి వివరించారు. ► నౌకాదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్‌తో కూడా సమావేశమై దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. యుద్ధాల సమయంలో ఉపయోగపడే ‘నేవల్ బేస్’ను ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద స్థాపించాలని కూడా కోరారు. ► వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాను మంత్రి కలిసి రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ అభివృద్ధికి సహకారంపై చర్చించారు. -
సింగరేణి చూపు.. సోలార్ వైపు
సాక్షి, కొత్తగూడెం: బొగ్గు వెలికితీతలో 129 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తాజాగా సోలార్ విద్యుదుత్పత్తికి రంగంలోకి దిగింది. ఇప్పటికే సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టును మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్మించి 2016 నుంచి 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం సోలార్ విద్యుదుత్పత్తి విషయంలోనూ వడివడిగా అడుగులు వేస్తోంది. వచ్చే అక్టోబర్ 1వ తేదీ నాటికి మొదటి విడతలో 129 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొదటి దశలో 129 మెగావాట్లు మొదటి దశలో 129 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యం తో ముందుకు వెళుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం–3 సింగరేణి ఏరియాలో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్, భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియాలో 30 మెగావాట్ల ప్లాంట్, ఇల్లెందు ఏరియాలో 39 మెగావాట్ల ప్లాంట్, మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఏరియాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 1 నాటికి మొదటిదశలో ఈ 4 చోట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండో దశలో 90 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో 43 మెగావాట్లు, జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఏరియాలో 10 మెగావాట్లు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏరియాలో 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్మిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ప్రతిపాదించిన మూడోవిడత కింద 81 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి రెండు దశలకు భిన్నంగా మూడో విడతలో సోలార్ ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి 2 విడతల్లో సింగరేణి ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్లు నిర్మిస్తుండగా, మూడో విడతలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన చోట్ల సోలార్ విద్యుదుత్పత్తికి ప్రణాళికలు తయారు చేశారు. మూసేసిన గనులు, ఉపరితల గనుల డంప్‌లపైన అవకాశాలను బట్టి సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు డ్యాం, దిగువ మానేరు డ్యాం, ఎల్లంపల్లి బ్యారేజ్, మంచిర్యాల జిల్లాలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ‘రా’వాటర్ జలాశయంపైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సింగరేణి జిల్లాల్లోని సింగరేణి భవనాలపై సోలార్ సిస్టమ్ అమర్చాలని నిర్ణయించారు. రూ.1,361.5 కోట్లు కేటాయింపు సోలార్ విద్యుదుత్పత్తి రంగంలోకి దిగాలనుకున్న వెంటనే సింగరేణి యాజమాన్యం ఇందుకోసం రూ.1,361.5 కోట్లు కేటాయించింది. సింగరేణి విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో మూడు విడతల్లో సోలార్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆయా ఏరియాల్లో అందుబాటులో ఉన్న 1,535 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు నిర్మించి 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే లక్ష్యంతో ముందుకెళుతోంది. మొత్తం మూడు విడతల్లో ఈ ప్లాంట్ల నిర్మాణానికి బీహెచ్ఈఎల్తో సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. సోలార్ ప్లాంట్లు నిర్మించడంతో పాటు, ఆయా ప్లాంట్లను పదేళ్ల పాటు బీహెచ్ఈఎల్ సంస్థే నిర్వహిం చాలని కూడా ఒప్పందం చేసుకున్నారు. -
భెల్ బోగీలు ఆహుతి!
సాక్షి, ముంబై : నగరంలో అగ్ని ప్రమాదాలు జరిగిన లోకల్ రైళ్లలో ఎక్కువ శాతం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) కంపెనీ తయారుచేసిన బోగీలు ఉన్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే మార్గంలో భెల్ కంపెనీ తయారుచేసిన కొన్ని లోకల్ రైళ్లు తిరుగుతున్నాయి. వాటిలో మార్పులు చేయాలని లేదా కాలం చెల్లిన రైళ్లను కార్ షెడ్డుకు పరిమితం చేయాలని గతంలోనే అప్పటి రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారు. కానీ, నిరక్ష్యం చేయడంతో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తొమ్మిది సార్లు అగ్నిప్రమాదం.. గత శుక్రవారం రాత్రి దాదర్ స్టేషన్లో లోకల్ రైలు బోగీకి మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు థానేలో సైడింగ్ ట్రాక్‌లోకి వెళుతున్న ఓ లోకల్ రైలుకు ఇలాగే మంటలు అంటుకున్నాయి. తాజాగా జరిగిన ఈ రెండు సంఘటనలతో ప్రయాణికుల భద్రత మరోసారి తెరమీదకు వచ్చింది. అదృష్టవశాత్తు ఈ రెండు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సెంట్రల్ రైల్వే మార్గంలో తిరుగుతున్న భెల్ కంపెనీ లోకల్ రైళ్లను ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని 2014 ఏప్రిల్ 16వ తేదీన సేవల నుంచి తొలగించాలని చేతన్ బక్షి రైల్వే బోర్డుకు ప్రతిపాదించారు.ప్రస్తుతం సెంట్రల్ రైల్వే అధీనంలో భెల్ కంపెనీ తయారీ రైళ్లు ఆరు ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో భెల్ కంపెనీ లోకల్ రైళ్లలో తొమ్మిది సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలా నిత్యం రద్దీగా ఉండే లోకల్ రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరగడం ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దాదర్‌లో జరిగిన ఘటనపై కారణాలను వెలికి తీసేందుకు సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కమిటీ నియమించింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో జరిగిన అగ్ని ప్రమాదాలు... 2014 ఏప్రిల్ 3వ తేదీ– కర్జత్ నుంచి సీఎస్ఎంటీ వెళుతున్న లోకల్ రైలుకు దాదర్ ఆరో నంబరు ప్లాట్‌ఫారంపై అగ్ని ప్రమాదం జరిగింది. 2012 డిసెంబర్ 4వ తేదీ–అంధేరీ–సీఎస్ఎంటీ వెళుతున్న రైలుకు డాక్‌యార్డ్ స్టేషన్లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా, 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. 2012 ఏప్రిల్ 8వ తేదీన–కోపర్ రైల్వే స్టేషన్లో బోగీ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు కిందికి దూకేశారు. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 2013 మార్చి 15వ తేదీ–ఘాట్కోపర్ స్టేషన్లో బోగీకి మంటలు అంటుకున్నాయి. 2018 ఫిబ్రవరి 2వ తేదీ– దాదర్ స్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్‌పారంపై థానే వెళుతున్న లోకల్ రైలుకు మంటలు అంటుకున్నాయి. -
భెల్.. గోల్ మాల్!
♦ నాసిరకం షూస్ ఇచ్చారని కార్మికుల ఆగ్రహం ♦ సుమారు రూ.40 లక్షలు చేతులు మారినట్టు ♦ ఆరోపణలు సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్న కార్మికులు ♦ కరపత్రాలు విడుదల చేసిన నేతలు భెల్: కార్మికుల భద్రతే లక్ష్యం... వారి శ్రేయస్సే ముఖ్యం అంటూ ప్రకటనలు గుప్పించే భెల్ పరిశ్రమ కమీషన్లకు కక్కుర్తి పడింది. కార్మికుల భద్రత కోసం ఇచ్చే షూస్ కొనుగోళ్లలోనూ అధికారులు కమీషన్లకు ఆశపడి నాసిరకం సరఫరా చేశారు. ప్రస్తుతం పరిశ్రమకు ఆర్డర్లు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రతి అంశంలోనూ కోతలు విధిస్తూ డబ్బు ఆదాకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కొందరు అధికారులు అందినకాడికి దండుకునే పనిచేయడంపై కార్మిక సంఘాల నాయకులు గుర్రుమంటున్నారు. రామచంద్రాపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్) కార్మికులకు అందించే షూస్ నాసిరకం కొనుగోలు చేయడంపై కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 4,961 మంది కార్మికులకు గాను రూ.1,195 చొప్పున షూస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. యాజమాన్యం కొనుగోలు చేసిన షూస్ కనీసం రూ.250 విలువ కూడా ఉండదని, వాటికి అంత మొత్తంలో బిల్లులు చెల్లించడం ఏమిటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. షూస్ కొనుగోళ్లలో సుమారు రూ.40 లక్షలకుపైగా చేతులు మారిన ట్టు ఆ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భెల్ సంస్థ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సేఫ్టీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భెల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయగా అదే బాటలో మరికొన్ని యూనియన్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు కార్మికుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంలో భెల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బులిటెన్ కూడా జారీ చేసినా యాజమాన్యం వైపు నుంచి స్పందన లేకపోవడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని పలువురు పేర్కొంటున్నారు. ఈ కొనుగోళ్ల విషయంలో అధికార యూనియన్ మాట్లాడ క పోవడంపై యాజమాన్యంతో కుమ్మక్కైనట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో విచారణ జరిపి బాధ్యులుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు నగదు చెల్లిస్తే వారే నాణ్యమైన షూ కొనుగోలు చేస్తారని పలువురు చెబుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.