మొసళ్లనూ తరలిస్తున్నారు! | Crocodile smuggling gang busted in Borivali By Forest officers | Sakshi
Sakshi News home page

మొసళ్లనూ తరలిస్తున్నారు!

Published Fri, Sep 20 2019 4:01 AM | Last Updated on Fri, Sep 20 2019 5:26 AM

Crocodile smuggling gang busted in Borivali By Forest officers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొసలి ‘కన్నీరు’పెడుతోంది. మొసగాళ్ల వలలో మోసళ్లు చిక్కాయి. నగరం నుంచి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రెండు మొసలి పిల్లల్ని ముంబైకి తరలిస్తున్న ముఠాను మహారాష్ట్రలోని బొరివలి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ సహా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాదీలు ఉన్నారు. వివరాలు... హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మొసళ్ల అక్రమ రవాణా జరుగుతున్నట్లు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఓ ప్రత్యేక బృందం బొరివలి ప్రాంతంలో మాటు వేసింది. అక్కడి వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మీదుగా వచి్చన సదరు ప్రైవేట్‌ బస్సును ఆపి తనిఖీ చేసింది. డ్రైవర్‌ సీటు సమీపంలో కార్టన్‌ బాక్స్‌లో ప్యాక్‌ చేసిన బోనును గుర్తించి తెరిచి చూడగా అందులో రెండు ఆడ మొసలి పిల్లలున్నాయి. ఆ బాక్సును తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చారని, హైదరాబాద్‌ నుంచి ముంబై తీసుకువెళ్లాలంటూ రూ.1500 చెల్లించారని బస్సు డ్రైవర్‌ అయిన హైదరాబాద్‌వాసి మహ్మద్‌ అబ్దుల్‌ రహీం హఫీజ్‌ విచారణలో చెప్పాడు. అందులో కొన్ని ఔషధాలు ఉన్నాయని నమ్మబలికారని వెల్లడించాడు. అదేబస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాదీ శివాజీ బాలయ్య, కర్ణాటకకు చెందిన లతీఫ్‌ బేగ్‌ ఆపెట్టెను తీసుకువచ్చారని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మొసలిపిల్లలకు చికిత్స 
అధికారులు ఆ రెండు మొసలి పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని పశువైద్యులు పరిశీలించి ఆ పిల్లల వయస్సు మూడు నెలలలోపే ఉంటుందని, ఒక్కోటి రెండు అడుగుల పొడవు ఉందని తేల్చారు. చాలాసేపు ఓ చిన్న పెట్టెలో ప్యాక్‌ చేయడంతో అనారోగ్యానికి గురైన మొసలి పిల్లలకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.  ఈ మొసళ్లను ఎక్కడ నుంచి తీసువస్తున్నారనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. నాగార్జునసాగర్, మంజీరనది నుంచే వీటిని సేకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటివిలువ మార్కెట్‌లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో మొసలి పిల్లలకు భారీ డిమాండ్‌ ఉందని సమాచారం. ప్రముఖులకు చెందిన ఫామ్‌హౌస్‌ల్లోని కొలనుల్లో మొసళ్లను పెంచుకోవడం ఇటీవల కాలంలో పెరిగింది. అధికారికంగా పెంచుకోవడానికి అనుమతి లేకపోవడంతో అక్రమ రవాణా ద్వారా సేకరిస్తుననట్లు సమాచారం. బొరివాలి వ్యవహారంపై వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగనుంది. తదుపరి దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందం సిటీకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement