- ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
- భారీగా బోనాలు
- శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు
- సందడిగా మారిన నగర వీధులు
- నేడు ఘటాల ఊరేగింపు
చార్మినార్/చాంద్రాయణగుట్ట/యాకుత్‌పురా: బోనాల జాతర సందర్భంగా నగరంలోని వీధులన్నీ దద్దరిల్లాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద డీజేల హోరు మొదలైంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పాతబస్తీతోపాటు నగరంలోని మిగతా చోట్ల సందడి నెలకొంది. మహంకాళి, మైసమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు.
లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ శంకరయ్యగౌడ్, గౌలిపురాలోని ఆలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి మల్లేశం గౌడ్, సుల్తాన్‌షాహి జగదాంబ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, మీరాలం మండిలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, మేకల బండ నల్లపోచమ్మ దేవాలయంలో అక్కడి కమిటీ చైర్మన్ పొన్న సుదర్శన్, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో కమిటీ అధ్యక్షులు జి.నిరంజన్, బేలా ముత్యాలమ్మ దేవాలయంలో కమిటీ అధ్యక్షులు పొటేల్ సదానంద్ యాదవ్, హరిబౌలీ బంగారు మైసమ్మ దేవాలయంలో కమిటీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌లు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు.
పురానాపూల్‌లోని గొల్లకిడికి కోట మైసమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలతోపాటు బోనాలు సమర్పించారు. కోట మైసమ్మ దేవాలయం కమిటీ నిర్వాహకులు మక్కర యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అధికారులతోపాటు ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రధాన దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలరించిన పోతరాజుల విన్యాసాలు..
అమ్మవారికి ఊయల (తొట్టెల)ను సమర్పించేందుకు లాల్‌దర్వాజా, మీరాలం మండి, కసరట్ట, దూద్‌బౌలీ, ఛత్రినాక, ఉప్పుగూడ, గౌలిపురా, మేకలబండ, సీఐబీ క్వార్టర్స్, లలితాబాగ్, నరహరినగర్, కందికల్‌గేట్, అరుంధతీ కాలనీ, హరిబౌలి, అలియాబాద్ తదితర ప్రాం తాల్లోని బస్తీ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ తొట్టెల ఊరేగింపులు నిర్వహించారు. పోతరాజుల నృత్యాలను మహిళలు, పురుషులు, పిల్లలు, యువకులు ఆసక్తిగా తిలకించారు.
నేడు ఘటాల ఊరేగింపు..
జాతరలో భాగంగా సోమవారం జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపునకు ఉత్సవాల నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహం కాళి దేవాలయం, మీరాలం మండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్‌షాహి శీతల్‌మాత, గౌలిపురా నల్లపోచమ్మ, గౌలిపురా మహంకాళి, మురాద్‌మహాల్ మహంకాళి, అక్కన్నమాదన్న మహంకాళి, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి బంగారు మైసమ్మ తదితర ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. సోమవారం నాటి ఘటాల ఊరేగింపు కోసం అదనపు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు దక్షిణ మండలం డీసీపీ ఎస్‌ఎస్ త్రిపాఠి తెలిపారు.
నేటి సాయంత్రం 6లోగా..
పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు సోమవారం సాయంత్రం 6 గంటలకు చార్మినార్ దాటేలా దక్షిణ మండలం పోలీసులు కార్యాచర ణ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్సవాల నిర్వాహకులతో ఇప్పటికే సమావేశమై పలు సూచనలు చేశారు. అక్కన్న మాదన్న దేవాలయం ఘటం ఊరేగింపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు హిమ్మత్‌పురా చౌరస్తాకు, సాయంత్రం 6 గంటలకు చార్మినార్‌కు చేరుకునేలా నిర్వాహకులకు సూచించారు. మీరాలం మండి మహాకాళి ఘటం ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి 6 గంటలకు చార్మినార్ చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం ఇఫ్తార్ విందులు కొనసాగనుండడంతో ఇరువర్గాలకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
హరిబౌలిలో స్వల్ప ఉద్రిక్తత
యాకుత్‌పురా: బోనాల పండుగలో భాగంగా ఆదివారం అక్కన్న మాదన్న దేవాలయానికి బయలు దేరిన పోతరాజుల ఊరేగింపు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం నుంచి మధ్యాహ్నం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోతరాజుల నృత్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో నృత్యాలు చేస్తూ యువకులు మరో వర్గం వారిపై పడ్డారు. దీంతో ఇషత్ ్రమహల్ ఫంక్షన్ హాల్ వైపు కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వగా ఉద్రిక్తతకు దారితీసింది. మహిళలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. హరిబౌలి చౌరస్తాతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.