old Basti
-
2 గంటలు.. ఇద్దరు దొంగలు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న మస్రత్ మహల్‌లోని నిజాం మ్యూజియంలో 3వ తేదీ తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కచ్చితంగా నిర్దేశించుకున్న గ్యాలరీలోకే దిగడానికి మ్యూజియం పైకప్పుపై మూడుచోట్ల మార్కింగ్ పెట్టుకున్నట్లు గుర్తించారు. గ్యాలరీలోకి ప్రవేశించిన వీరు దాదాపు 2 గంటల పాటు అక్కడే గడిపినట్లు తేల్చారు. ఈ యువకులు స్థానికులుగానే అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆయా ప్రాంతాల్లో జల్లెడపడుతున్నారు. మరోపక్క నగర వ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువుల అమ్మకం దుకాణాలు, క్రయవిక్రేతల పైనా కన్నేసి ఉంచారు. ‘టిఫిన్ బాక్స్’ కోసం స్కెచ్ ఇలా... ఈ చోరీ కోసం స్కెచ్ వేసిన నిందితులు పక్కాగా రెక్కీ చేశారు. ఒకటికి రెండుసార్లు మ్యూజియం లోపల, బయట, పై భాగంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ మార్గంలో రావాలి? ఎక్కడ నుంచి మ్యూజియం పైకి ఎక్కాలి? ఏ వెంటిలేటర్ వద్ద నిజాం టిఫిన్ బాక్స్‌తో కూడిన గ్యాలరీ ఉంది? దాని వద్దకు ఎలా వెళ్లాలి? సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నీ పక్కాగా అధ్యయనం చేశారు. ఆపై అదును చూసుకుని మ్యూజియం పైకి చేరుకుని ప్రధాన గోడపై పక్క భాగంలో ‘యారో’(బాణం), పై భాగంలో ‘స్టార్’(నక్షత్రం) గుర్తులు పెట్టుకున్నారు. టిఫిన్ బాక్స్ ఉన్న మూడో గ్యాలరీ సమీపంలోని వెంటిలేటర్ వద్ద మరో ‘యారో’ మార్క్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగానే తెల్లవారుజామున రంగంలోకి దిగారు. మ్యూజియం ప్రహరీ వెనుక వైపు ఉన్న ప్రార్థనా స్థలం వరకు బైక్‌పై వచ్చారు. ముందుగా ఓ దుండగుడు దాని పక్కనే ఉన్న ఇంటి మెట్ల మీదుగా పైకి వెళ్లి పరిస్థితిని గమనించి వచ్చాడు. దీనికోసం తన సెల్ఫోన్లో ఉన్న ‘టార్చ్‌లైట్’ను వినియోగించాడు. రెండు నిమిషాల తర్వాత అంతా తమకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకుని రెండో దుండగుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడు ఓ బ్యాగ్‌తో ముందుకు కదిలాడు. ఈ తతంగం అంతా ఆ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ‘ఇనుప మెట్లెక్కి అద్దాన్ని తొలగించి... దీనికి ముందు దాదాపు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇద్దరిలో ఓ దుండగుడు ఆ ప్రార్థనా స్థలం వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడి పరిస్థితుల్ని గమనించిన తర్వాత వెనక్కు వెళ్లిపోయాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఇద్దరూ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. 3.20 గంటల ప్రాంతంలో ఇద్దరూ మ్యూజియం వెనుక వైపు ఉన్న ఇళ్ల పైకప్పుల నుంచి అనుసంధానించి ఉన్న పురాతన ఇనుప మెట్లను వినియోగిస్తూ మ్యూజియం పైకి వెళ్లారు. అప్పటికే ఉన్న మార్క్‌ల ఆధారంగా మూడో గ్యాలరీ వెంటిలేటర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పైభాగంలో ప్రత్యేక గమ్ అతికించిన అద్దాన్ని తొలగించి పక్కన పెట్టారు. ఆపై ఉన్న ఇనుప గ్రిల్‌కు లోపలి వైపు నుంచి కొట్టిన మేకుల్ని తొలగించారు. గ్రిల్‌ను అద్దం పెట్టిన వైపు కాకుండా మరో వైపు పెట్టారు. ఏది ధ్వంసం చేసినా ఆ శబ్దానికి అంతా అప్రమత్తం అవుతారనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. టీ.. టిఫిన్.. సాసర్ బ్యాగులో సర్ది.. వెంటిలేటర్ ద్వారా తాడు సాయంతో మూడో గ్యాలరీలోకి ఓ దుండగుడు దిగాడు. ఈ తాడును వెంటిలేటర్‌కు 30 అడుగుల దూరంలో ఉన్న ఇనుపమెట్లకు కట్టారా? లేక ఒకరు పట్టుకోగా మరొకరు దిగారా? అనేది స్పష్టత రాలేదు. మ్యూజియం లోపలివైపు ఉన్న సీసీ కెమెరా తాడు లోపలకు పడటాన్ని రికార్డు చేసింది. ఆపై లోపలికి దిగిన దుండగుడు తన కాలితో ఆ కెమెరాను నేల వైపునకు తిప్పేశాడు. బంగారం టిఫిన్ బాక్స్ ఉన్న ర్యాక్ అద్దాన్ని దుండగులు పగులకొట్టలేదు. దీని తలుపులు రెండూ కలిసేచోట కింది భాగంగా చిన్న రాడ్‌ను దూర్చి పైకి లేపడం ద్వారా సెంట్రల్ లాక్, పైన, కింద ఉన్న బోల్ట్‌లు విరిగిపోయేలా చేశాడు. ఆపై దర్జాగా టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, స్పూన్ తీసుకుని తన బ్యాగ్‌లో సర్దుకున్నాడు. తర్వాత వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 5.20 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులూ తిరిగి వచ్చినట్లు ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. తిరిగి వస్తున్న సమయంలో వీరు మాస్క్‌లు ధరించి ఉండగా.. ఓ దుండగుడు ఎడమ కాలితో కుంటుతున్నాడు. దీంతో ఇతడే లోపలకు దిగి ఉండొ చ్చని, ఆ ప్రయత్నాల్లోనే కాలికి గాయమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
బాలుడిపై థర్డ్‌డిగ్రీ!
యాకుత్‌పురా: దాడి కేసులో అరెస్టైన ఓ బాలుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడంతో పాతబస్తీలో కలకలం రేగింది. థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన భవానీనగర్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంబీటీ నాయకులతో పాటు బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అయితే అలాంటిదేమీ జరగలేదని పోలీసులు అంటున్నారు. భవానీనగర్ ఎస్సై నార్ల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీకి చెందిన మహ్మద్ చాంద్ (24), అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15) అన్నదమ్ములు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు రెయిన్బజార్కి చెందిన మహ్మద్ ముజఫర్ (24)పై మహ్మద్ చాంద్, మెహఫేజ్ (15) కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ముజఫర్ వెంటనే భవానీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. అతనిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిలో ఒకడైన మెహఫేజ్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా బెయిల్‌పై విడుదలయ్యాడు. మహ్మద్ చాంద్ పరారీలో ఉన్నాడు. కాగా, తలాబ్కట్టాకి చెందిన బాలుడు అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15)పై భవానీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారని ఆజంపురా కార్పొరేటర్, ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ ఆరోపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు. బాలల హక్కుల సంఘం ఖండన మెహఫేజ్పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడాన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడి స్టేషన్ హౌజ్ఆఫీసర్ను వెంటనే తొలగించి విచారణ జరిపించాలని సంఘం అధ్యక్షురాలు అనురాధ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
జజ్జనకరి జనాలే..బోనాలు భళారే
ఆలయాలకు పోటెత్తిన భక్తజనం భారీగా బోనాలు శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు సందడిగా మారిన నగర వీధులు నేడు ఘటాల ఊరేగింపు చార్మినార్/చాంద్రాయణగుట్ట/యాకుత్‌పురా: బోనాల జాతర సందర్భంగా నగరంలోని వీధులన్నీ దద్దరిల్లాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద డీజేల హోరు మొదలైంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పాతబస్తీతోపాటు నగరంలోని మిగతా చోట్ల సందడి నెలకొంది. మహంకాళి, మైసమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ శంకరయ్యగౌడ్, గౌలిపురాలోని ఆలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి మల్లేశం గౌడ్, సుల్తాన్షాహి జగదాంబ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, మీరాలం మండిలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, మేకల బండ నల్లపోచమ్మ దేవాలయంలో అక్కడి కమిటీ చైర్మన్ పొన్న సుదర్శన్, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో కమిటీ అధ్యక్షులు జి.నిరంజన్, బేలా ముత్యాలమ్మ దేవాలయంలో కమిటీ అధ్యక్షులు పొటేల్ సదానంద్ యాదవ్, హరిబౌలీ బంగారు మైసమ్మ దేవాలయంలో కమిటీ చైర్మన్ ప్రవీణ్కుమార్గౌడ్లు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. పురానాపూల్‌లోని గొల్లకిడికి కోట మైసమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలతోపాటు బోనాలు సమర్పించారు. కోట మైసమ్మ దేవాలయం కమిటీ నిర్వాహకులు మక్కర యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అధికారులతోపాటు ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రధాన దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలరించిన పోతరాజుల విన్యాసాలు.. అమ్మవారికి ఊయల (తొట్టెల)ను సమర్పించేందుకు లాల్‌దర్వాజా, మీరాలం మండి, కసరట్ట, దూద్‌బౌలీ, ఛత్రినాక, ఉప్పుగూడ, గౌలిపురా, మేకలబండ, సీఐబీ క్వార్టర్స్, లలితాబాగ్, నరహరినగర్, కందికల్‌గేట్, అరుంధతీ కాలనీ, హరిబౌలి, అలియాబాద్ తదితర ప్రాం తాల్లోని బస్తీ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ తొట్టెల ఊరేగింపులు నిర్వహించారు. పోతరాజుల నృత్యాలను మహిళలు, పురుషులు, పిల్లలు, యువకులు ఆసక్తిగా తిలకించారు. నేడు ఘటాల ఊరేగింపు.. జాతరలో భాగంగా సోమవారం జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపునకు ఉత్సవాల నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహం కాళి దేవాలయం, మీరాలం మండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్షాహి శీతల్‌మాత, గౌలిపురా నల్లపోచమ్మ, గౌలిపురా మహంకాళి, మురాద్‌మహాల్ మహంకాళి, అక్కన్నమాదన్న మహంకాళి, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి బంగారు మైసమ్మ తదితర ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. సోమవారం నాటి ఘటాల ఊరేగింపు కోసం అదనపు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠి తెలిపారు. నేటి సాయంత్రం 6లోగా.. పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు సోమవారం సాయంత్రం 6 గంటలకు చార్మినార్ దాటేలా దక్షిణ మండలం పోలీసులు కార్యాచర ణ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్సవాల నిర్వాహకులతో ఇప్పటికే సమావేశమై పలు సూచనలు చేశారు. అక్కన్న మాదన్న దేవాలయం ఘటం ఊరేగింపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు హిమ్మత్‌పురా చౌరస్తాకు, సాయంత్రం 6 గంటలకు చార్మినార్‌కు చేరుకునేలా నిర్వాహకులకు సూచించారు. మీరాలం మండి మహాకాళి ఘటం ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి 6 గంటలకు చార్మినార్ చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం ఇఫ్తార్ విందులు కొనసాగనుండడంతో ఇరువర్గాలకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హరిబౌలిలో స్వల్ప ఉద్రిక్తత యాకుత్‌పురా: బోనాల పండుగలో భాగంగా ఆదివారం అక్కన్న మాదన్న దేవాలయానికి బయలు దేరిన పోతరాజుల ఊరేగింపు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం నుంచి మధ్యాహ్నం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోతరాజుల నృత్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో నృత్యాలు చేస్తూ యువకులు మరో వర్గం వారిపై పడ్డారు. దీంతో ఇషత్ ్రమహల్ ఫంక్షన్ హాల్ వైపు కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వగా ఉద్రిక్తతకు దారితీసింది. మహిళలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. హరిబౌలి చౌరస్తాతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.