2 గంటలు.. ఇద్దరు దొంగలు | Heist brings Nizam jewels back in focus, pleas get shrill for returning gems from RBI lockers | Sakshi
Sakshi News home page

2 గంటలు.. ఇద్దరు దొంగలు

Published Fri, Sep 7 2018 1:17 AM | Last Updated on Fri, Sep 7 2018 5:11 AM

Heist brings Nizam jewels back in focus, pleas get shrill for returning gems from RBI lockers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న మస్రత్‌ మహల్‌లోని నిజాం మ్యూజియంలో 3వ తేదీ తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కచ్చితంగా నిర్దేశించుకున్న గ్యాలరీలోకే దిగడానికి మ్యూజియం పైకప్పుపై మూడుచోట్ల మార్కింగ్‌ పెట్టుకున్నట్లు గుర్తించారు. గ్యాలరీలోకి ప్రవేశించిన వీరు దాదాపు 2 గంటల పాటు అక్కడే గడిపినట్లు తేల్చారు. ఈ యువకులు స్థానికులుగానే అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆయా ప్రాంతాల్లో జల్లెడపడుతున్నారు. మరోపక్క నగర వ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువుల అమ్మకం దుకాణాలు, క్రయవిక్రేతల పైనా కన్నేసి ఉంచారు.  

‘టిఫిన్‌ బాక్స్‌’ కోసం స్కెచ్‌ ఇలా...
ఈ చోరీ కోసం స్కెచ్‌ వేసిన నిందితులు పక్కాగా రెక్కీ చేశారు. ఒకటికి రెండుసార్లు మ్యూజియం లోపల, బయట, పై భాగంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ మార్గంలో రావాలి? ఎక్కడ నుంచి మ్యూజియం పైకి ఎక్కాలి? ఏ వెంటిలేటర్‌ వద్ద నిజాం టిఫిన్‌ బాక్స్‌తో కూడిన గ్యాలరీ ఉంది? దాని వద్దకు ఎలా వెళ్లాలి? సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నీ పక్కాగా అధ్యయనం చేశారు. ఆపై అదును చూసుకుని మ్యూజియం పైకి చేరుకుని ప్రధాన గోడపై పక్క భాగంలో ‘యారో’(బాణం), పై భాగంలో ‘స్టార్‌’(నక్షత్రం) గుర్తులు పెట్టుకున్నారు.

టిఫిన్‌ బాక్స్‌ ఉన్న మూడో గ్యాలరీ సమీపంలోని వెంటిలేటర్‌ వద్ద మరో ‘యారో’ మార్క్‌ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగానే తెల్లవారుజామున రంగంలోకి దిగారు. మ్యూజియం ప్రహరీ వెనుక వైపు ఉన్న ప్రార్థనా స్థలం వరకు బైక్‌పై వచ్చారు. ముందుగా ఓ దుండగుడు దాని పక్కనే ఉన్న ఇంటి మెట్ల మీదుగా పైకి వెళ్లి పరిస్థితిని గమనించి వచ్చాడు. దీనికోసం తన సెల్‌ఫోన్‌లో ఉన్న ‘టార్చ్‌లైట్‌’ను వినియోగించాడు. రెండు నిమిషాల తర్వాత అంతా తమకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకుని రెండో దుండగుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడు ఓ బ్యాగ్‌తో ముందుకు కదిలాడు. ఈ తతంగం అంతా ఆ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది.  

‘ఇనుప మెట్లెక్కి అద్దాన్ని తొలగించి...
దీనికి ముందు దాదాపు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇద్దరిలో ఓ దుండగుడు ఆ ప్రార్థనా స్థలం వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడి పరిస్థితుల్ని గమనించిన తర్వాత వెనక్కు వెళ్లిపోయాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఇద్దరూ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. 3.20 గంటల ప్రాంతంలో ఇద్దరూ మ్యూజియం వెనుక వైపు ఉన్న ఇళ్ల పైకప్పుల నుంచి అనుసంధానించి ఉన్న పురాతన ఇనుప మెట్లను వినియోగిస్తూ మ్యూజియం పైకి వెళ్లారు.

అప్పటికే ఉన్న మార్క్‌ల ఆధారంగా మూడో గ్యాలరీ వెంటిలేటర్‌ వద్దకు చేరుకున్నారు. ముందుగా పైభాగంలో ప్రత్యేక గమ్‌ అతికించిన అద్దాన్ని తొలగించి పక్కన పెట్టారు. ఆపై ఉన్న ఇనుప గ్రిల్‌కు లోపలి వైపు నుంచి కొట్టిన మేకుల్ని తొలగించారు. గ్రిల్‌ను అద్దం పెట్టిన వైపు కాకుండా మరో వైపు పెట్టారు. ఏది ధ్వంసం చేసినా ఆ శబ్దానికి అంతా అప్రమత్తం అవుతారనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పోలీసులు చెప్తున్నారు.  


టీ.. టిఫిన్‌.. సాసర్‌ బ్యాగులో సర్ది..
వెంటిలేటర్‌ ద్వారా తాడు సాయంతో మూడో గ్యాలరీలోకి ఓ దుండగుడు దిగాడు. ఈ తాడును వెంటిలేటర్‌కు 30 అడుగుల దూరంలో ఉన్న ఇనుపమెట్లకు కట్టారా? లేక ఒకరు పట్టుకోగా మరొకరు దిగారా? అనేది స్పష్టత రాలేదు. మ్యూజియం లోపలివైపు ఉన్న సీసీ కెమెరా తాడు లోపలకు పడటాన్ని రికార్డు చేసింది. ఆపై లోపలికి దిగిన దుండగుడు తన కాలితో ఆ కెమెరాను నేల వైపునకు తిప్పేశాడు.

బంగారం టిఫిన్‌ బాక్స్‌ ఉన్న ర్యాక్‌ అద్దాన్ని దుండగులు పగులకొట్టలేదు. దీని తలుపులు రెండూ కలిసేచోట కింది భాగంగా చిన్న రాడ్‌ను దూర్చి పైకి లేపడం ద్వారా సెంట్రల్‌ లాక్, పైన, కింద ఉన్న బోల్ట్‌లు విరిగిపోయేలా చేశాడు. ఆపై దర్జాగా టిఫిన్‌ బాక్స్, టీ కప్పు, సాసర్, స్పూన్‌ తీసుకుని తన బ్యాగ్‌లో సర్దుకున్నాడు. తర్వాత వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 5.20 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులూ తిరిగి వచ్చినట్లు ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. తిరిగి వస్తున్న సమయంలో వీరు మాస్క్‌లు ధరించి ఉండగా.. ఓ దుండగుడు ఎడమ కాలితో కుంటుతున్నాడు. దీంతో ఇతడే లోపలకు దిగి ఉండొ చ్చని, ఆ ప్రయత్నాల్లోనే కాలికి గాయమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement