evidences found
-
యుద్ధ నేరాలకు... సాక్ష్యాలివిగో
కీవ్: రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడితో 50 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్న రష్యాపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరింది. బుచాను తలపించే ఈ మారణకాండకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బాధ్యున్ని చేసి తీరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. రష్యా యుద్ధ నేరాలకు కావాల్సినన్ని రుజువులు దొరికాయని చెప్పారు. ‘‘మా పౌరులను ఎలా అపహరించింది, ఎలా నిర్దాక్షిణ్యంగా కాల్చేసిందీ, చేతికందిన వాటినల్లా ఎలా దోచేసిందీ రష్యా సైనికులు తమ కుటుంబీకులకు చెప్తున్న ఫోన్ సంభాషణలను రికార్డు చేశాం. మాకు పట్టుబడ్డ రష్యా పైలట్ల దగ్గర పౌర నివాస ప్రాంతాలున్న మ్యాపులు దొరికాయి కూడా’’ అన్నారు. ప్రధాన కారకుడైన పుతిన్‌తో పాటు ఈ దారుణాలకు ప్లాన్ చేసిన, ఆదేశాలిచ్చిన, వాటిని అమలు చేసిన వారందరిపైనా విచారణ జరిగి కఠినాతి కఠినమైన శిక్షలు పడాల్సిందేనన్నారు. ఈ ఘోరాన్ని వర్ణించేందుకు మాటలే లేవని కీవ్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. రష్యా శాడిజం నానాటికీ పరాకాష్టను చేరుతోందని దుయ్యబట్టారు. అయితే తనను దోషిగా చూపేందుకు ఉక్రెయినే రైల్వేస్టేషన్‌పై దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. బుచాలో పౌరులను రష్యా దళాలు సామూహికంగా పొట్టన పెట్టుకున్న కనీసం మూడు చోట్లను తాజాగా గుర్తించినట్టు నగర మేయర్ చెప్పారు. ఒక చోట సామూహికంగా ఖననం చేసిన 70 శవాలను బయటికి తీశామన్నారు. ఈ మారణకాండలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ హస్తముందని జర్మనీ అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక శక్తిలో కనీసం 20 శాతాన్ని కోల్పోయిందని అమెరికా తాజాగా అంచనా వేసింది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తామని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం కీవ్‌లో జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మరోవైపు, ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ కూడా తమ రాయబారిని కీవ్‌కు తిరిగి పంపించింది. ఇటలీ కూడా త్వరలో కీవ్‌లో తమ ఎంబసీని తెరుస్తామని ప్రకటించింది. ఆదుకోండి: ప్రియాంక శరణార్థులను ఆదుకోవాలని నటి, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘20 లక్షలకు పైగా ఉక్రెయిన్ చిన్నారులు దేశం విడిచారు. 30 లక్షలకు పైగా స్వదేశంలోనే నిరాశ్రయులుగా మిగిలారు. కనీవినీ ఎరగని సంక్షోభమిది. యుద్ధం మిగిల్చిన ఈ తీరని వేదన వారి మనసుల్లోంచి ఎన్నటికీ పోయేది కాదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. తన అభిమానులు, ఫాలోవర్లు కూడా వీలైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రతామండలి నుంచి రష్యాను బహిష్కరించలేం: అమెరికా ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా బహిష్కరణ సాధ్యం కాదని అమెరికా అభిప్రాయపడింది. రష్యా అందులో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశమ ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి గుర్తు చేశారు. రష్యాకు భారత్ దూరమవాలి: అమెరికా రష్యాతో జి77 అలీన భాగస్వామ్య బంధం నుంచి భారత్ తప్పుకోవాలని అమెరికా విదేశాంగ ఉప మంత్రి వెండీ షెర్మన్ సూచించారు. అమెరికా–భారత్ మధ్య రక్షణ వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎం తో అవకాశముందన్నారు. ‘అమెరికా, ఆస్ట్రేలి యా, జపాన్‌లతో కూడిన క్వాడ్ కూటమిలో కూ డా భాగస్వామి అయినా భారత్ వెంటనే రష్యాతో బంధానికి దూరమైతే మేలు’ అన్నారు. -
2 గంటలు.. ఇద్దరు దొంగలు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న మస్రత్ మహల్‌లోని నిజాం మ్యూజియంలో 3వ తేదీ తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కచ్చితంగా నిర్దేశించుకున్న గ్యాలరీలోకే దిగడానికి మ్యూజియం పైకప్పుపై మూడుచోట్ల మార్కింగ్ పెట్టుకున్నట్లు గుర్తించారు. గ్యాలరీలోకి ప్రవేశించిన వీరు దాదాపు 2 గంటల పాటు అక్కడే గడిపినట్లు తేల్చారు. ఈ యువకులు స్థానికులుగానే అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆయా ప్రాంతాల్లో జల్లెడపడుతున్నారు. మరోపక్క నగర వ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువుల అమ్మకం దుకాణాలు, క్రయవిక్రేతల పైనా కన్నేసి ఉంచారు. ‘టిఫిన్ బాక్స్’ కోసం స్కెచ్ ఇలా... ఈ చోరీ కోసం స్కెచ్ వేసిన నిందితులు పక్కాగా రెక్కీ చేశారు. ఒకటికి రెండుసార్లు మ్యూజియం లోపల, బయట, పై భాగంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ మార్గంలో రావాలి? ఎక్కడ నుంచి మ్యూజియం పైకి ఎక్కాలి? ఏ వెంటిలేటర్ వద్ద నిజాం టిఫిన్ బాక్స్‌తో కూడిన గ్యాలరీ ఉంది? దాని వద్దకు ఎలా వెళ్లాలి? సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నీ పక్కాగా అధ్యయనం చేశారు. ఆపై అదును చూసుకుని మ్యూజియం పైకి చేరుకుని ప్రధాన గోడపై పక్క భాగంలో ‘యారో’(బాణం), పై భాగంలో ‘స్టార్’(నక్షత్రం) గుర్తులు పెట్టుకున్నారు. టిఫిన్ బాక్స్ ఉన్న మూడో గ్యాలరీ సమీపంలోని వెంటిలేటర్ వద్ద మరో ‘యారో’ మార్క్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగానే తెల్లవారుజామున రంగంలోకి దిగారు. మ్యూజియం ప్రహరీ వెనుక వైపు ఉన్న ప్రార్థనా స్థలం వరకు బైక్‌పై వచ్చారు. ముందుగా ఓ దుండగుడు దాని పక్కనే ఉన్న ఇంటి మెట్ల మీదుగా పైకి వెళ్లి పరిస్థితిని గమనించి వచ్చాడు. దీనికోసం తన సెల్ఫోన్లో ఉన్న ‘టార్చ్‌లైట్’ను వినియోగించాడు. రెండు నిమిషాల తర్వాత అంతా తమకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకుని రెండో దుండగుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడు ఓ బ్యాగ్‌తో ముందుకు కదిలాడు. ఈ తతంగం అంతా ఆ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ‘ఇనుప మెట్లెక్కి అద్దాన్ని తొలగించి... దీనికి ముందు దాదాపు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇద్దరిలో ఓ దుండగుడు ఆ ప్రార్థనా స్థలం వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడి పరిస్థితుల్ని గమనించిన తర్వాత వెనక్కు వెళ్లిపోయాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఇద్దరూ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. 3.20 గంటల ప్రాంతంలో ఇద్దరూ మ్యూజియం వెనుక వైపు ఉన్న ఇళ్ల పైకప్పుల నుంచి అనుసంధానించి ఉన్న పురాతన ఇనుప మెట్లను వినియోగిస్తూ మ్యూజియం పైకి వెళ్లారు. అప్పటికే ఉన్న మార్క్‌ల ఆధారంగా మూడో గ్యాలరీ వెంటిలేటర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పైభాగంలో ప్రత్యేక గమ్ అతికించిన అద్దాన్ని తొలగించి పక్కన పెట్టారు. ఆపై ఉన్న ఇనుప గ్రిల్‌కు లోపలి వైపు నుంచి కొట్టిన మేకుల్ని తొలగించారు. గ్రిల్‌ను అద్దం పెట్టిన వైపు కాకుండా మరో వైపు పెట్టారు. ఏది ధ్వంసం చేసినా ఆ శబ్దానికి అంతా అప్రమత్తం అవుతారనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. టీ.. టిఫిన్.. సాసర్ బ్యాగులో సర్ది.. వెంటిలేటర్ ద్వారా తాడు సాయంతో మూడో గ్యాలరీలోకి ఓ దుండగుడు దిగాడు. ఈ తాడును వెంటిలేటర్‌కు 30 అడుగుల దూరంలో ఉన్న ఇనుపమెట్లకు కట్టారా? లేక ఒకరు పట్టుకోగా మరొకరు దిగారా? అనేది స్పష్టత రాలేదు. మ్యూజియం లోపలివైపు ఉన్న సీసీ కెమెరా తాడు లోపలకు పడటాన్ని రికార్డు చేసింది. ఆపై లోపలికి దిగిన దుండగుడు తన కాలితో ఆ కెమెరాను నేల వైపునకు తిప్పేశాడు. బంగారం టిఫిన్ బాక్స్ ఉన్న ర్యాక్ అద్దాన్ని దుండగులు పగులకొట్టలేదు. దీని తలుపులు రెండూ కలిసేచోట కింది భాగంగా చిన్న రాడ్‌ను దూర్చి పైకి లేపడం ద్వారా సెంట్రల్ లాక్, పైన, కింద ఉన్న బోల్ట్‌లు విరిగిపోయేలా చేశాడు. ఆపై దర్జాగా టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, స్పూన్ తీసుకుని తన బ్యాగ్‌లో సర్దుకున్నాడు. తర్వాత వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 5.20 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులూ తిరిగి వచ్చినట్లు ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. తిరిగి వస్తున్న సమయంలో వీరు మాస్క్‌లు ధరించి ఉండగా.. ఓ దుండగుడు ఎడమ కాలితో కుంటుతున్నాడు. దీంతో ఇతడే లోపలకు దిగి ఉండొ చ్చని, ఆ ప్రయత్నాల్లోనే కాలికి గాయమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కుందులి కేసులో ఇద్దరు అధికారుల విచారణ
జయపురం: కొరాపుట్ జిల్లా కుందులిలో బాలికపై సామూహిక లైంగికదాడి ఆరోపణల కేసులో దర్యాప్తు కమిషన్ (జయపురం జిల్లా జడ్జి) ఆదివారం మరో ఇద్దరు అధికారుల సాక్ష్యాలను సేకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ సౌభాగ్యలక్షి పట్నాయక్ తో పాటు లక్ష్మీపూర్ డీఎస్పీ తపన నారాయణ రథ్‌లను కమిషనర్ విద్యుత్ కుమార్ మిశ్రా ప్రశ్నించి వారినుంచి దర్యాప్తు రికార్డులను పరిశీలించి విషయాలను సేకరించారు. ఈ విచారణలో ప్రభుత్వ న్యాయవాది, దర్యాప్తు కమిషన్ ప్రత్యేక న్యాయవాది ప్రభాకర పట్నాయక్ కూడా పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్ 10 వ తేదీన కొరాపుట్ జిల్లా కుందులి సమీప సొరిసిపొదర్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ముషిగుడ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక కుందులి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో జవాన్ దుస్తులు ధరించి ఆయుధాలు గలిగిన నలుగురు వ్యక్తులు ఆమెను ఎత్తుకు పోయి సమీప అడవిలో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత బాలిక ఆరోపించిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొరాపుట్ జిల్లా జడ్జి విద్యుత్ కుమార్ మిశ్రాతో దర్యాప్తు కమిషన్‌ను నియమించింది. -
కృపామణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు
కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రథమ నిందితుడిగా పోలీసులు పేర్కొన్న గుడాల నివాస్ ఇంట్లోనే ఈ ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సాయినివాస్ విశాఖపట్నం పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా సెల్ ఫోన్ సిగ్నళ్ల వల్ల తెలిసింది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌తో పాటు సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. గాలింపు చర్యలు ప్రారంభించారు. గుడాల సాయినివాస్, అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అతడికి చెందిన రెండు కార్లు, బైకును స్వాధీనం చేసుకున్నారు. సాయి నివాస్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ కేసులో ఎ1గా గుడాల సాయి నివాస్, ఎ2గా తల్లి లక్ష్మి, ఎ3గా తండ్రి రామలింగేశ్వరరావు, ఎ4గా రాజ్ కుమార్‌లను పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులపై సెక్షన్ 344, 306, 370 క్లాజ్ 1, 2, 3, 376 క్లాజ్ 1, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కృపామణి కేసు విచారణాధికారిగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావును నియమించారు. గుడాల సాయినివాస్పై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.