కీవ్‌లో జెలెన్‌స్కీతో బోరిస్ జాన్సన్
కీవ్: రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడితో 50 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్న రష్యాపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరింది. బుచాను తలపించే ఈ మారణకాండకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బాధ్యున్ని చేసి తీరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. రష్యా యుద్ధ నేరాలకు కావాల్సినన్ని రుజువులు దొరికాయని చెప్పారు.
‘‘మా పౌరులను ఎలా అపహరించింది, ఎలా నిర్దాక్షిణ్యంగా కాల్చేసిందీ, చేతికందిన వాటినల్లా ఎలా దోచేసిందీ రష్యా సైనికులు తమ కుటుంబీకులకు చెప్తున్న ఫోన్ సంభాషణలను రికార్డు చేశాం. మాకు పట్టుబడ్డ రష్యా పైలట్ల దగ్గర పౌర నివాస ప్రాంతాలున్న మ్యాపులు దొరికాయి కూడా’’ అన్నారు. ప్రధాన కారకుడైన పుతిన్‌తో పాటు ఈ దారుణాలకు ప్లాన్ చేసిన, ఆదేశాలిచ్చిన, వాటిని అమలు చేసిన వారందరిపైనా విచారణ జరిగి కఠినాతి కఠినమైన శిక్షలు పడాల్సిందేనన్నారు.
ఈ ఘోరాన్ని వర్ణించేందుకు మాటలే లేవని కీవ్‌లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. రష్యా శాడిజం నానాటికీ పరాకాష్టను చేరుతోందని దుయ్యబట్టారు. అయితే తనను దోషిగా చూపేందుకు ఉక్రెయినే రైల్వేస్టేషన్‌పై దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. బుచాలో పౌరులను రష్యా దళాలు సామూహికంగా పొట్టన పెట్టుకున్న కనీసం మూడు చోట్లను తాజాగా గుర్తించినట్టు నగర మేయర్ చెప్పారు. ఒక చోట సామూహికంగా ఖననం చేసిన 70 శవాలను బయటికి తీశామన్నారు.
ఈ మారణకాండలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ హస్తముందని జర్మనీ అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక శక్తిలో కనీసం 20 శాతాన్ని కోల్పోయిందని అమెరికా తాజాగా అంచనా వేసింది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తామని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం కీవ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. మరోవైపు, ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ కూడా తమ రాయబారిని కీవ్‌కు తిరిగి పంపించింది. ఇటలీ కూడా త్వరలో కీవ్‌లో తమ ఎంబసీని తెరుస్తామని ప్రకటించింది.
ఆదుకోండి: ప్రియాంక
శరణార్థులను ఆదుకోవాలని నటి, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘20 లక్షలకు పైగా ఉక్రెయిన్ చిన్నారులు దేశం విడిచారు. 30 లక్షలకు పైగా స్వదేశంలోనే నిరాశ్రయులుగా మిగిలారు. కనీవినీ ఎరగని సంక్షోభమిది. యుద్ధం మిగిల్చిన ఈ తీరని వేదన వారి మనసుల్లోంచి ఎన్నటికీ పోయేది కాదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. తన అభిమానులు, ఫాలోవర్లు కూడా వీలైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
భద్రతామండలి నుంచి రష్యాను బహిష్కరించలేం: అమెరికా
ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా బహిష్కరణ సాధ్యం కాదని అమెరికా అభిప్రాయపడింది. రష్యా అందులో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశమ ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి గుర్తు చేశారు.
రష్యాకు భారత్ దూరమవాలి: అమెరికా
రష్యాతో జి77 అలీన భాగస్వామ్య బంధం నుంచి భారత్ తప్పుకోవాలని అమెరికా విదేశాంగ ఉప మంత్రి వెండీ షెర్మన్ సూచించారు. అమెరికా–భారత్ మధ్య రక్షణ వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎం తో అవకాశముందన్నారు. ‘అమెరికా, ఆస్ట్రేలి యా, జపాన్‌లతో కూడిన క్వాడ్ కూటమిలో కూ డా భాగస్వామి అయినా భారత్ వెంటనే రష్యాతో బంధానికి దూరమైతే మేలు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment