ఎనిమిదో వింత పక్షి మ్యూజియం | Jatayu Adventure Cente in kerala | Sakshi
Sakshi News home page

ఎనిమిదో వింత పక్షి మ్యూజియం

Published Mon, Nov 18 2024 9:43 AM | Last Updated on Mon, Nov 18 2024 10:08 AM

Jatayu Adventure Cente in kerala

పక్షి మ్యూజియం అంటే... రకరకాల పక్షుల రూపాలు, వాటి రెక్కలు, గుడ్లు, పొదిగిన పిల్లల రూపాలను ఒక చోట పొందు పరిచిన మ్యూజియం కాదు. పక్షి ఆకారంలో ఉన్న మ్యూజియం. జటాయు పక్షి ఆకారంలో ఉన్న ఈ మ్యూజియం పరిమాణం కూడా జటాయువులాగ భారీగానే ఉంటుంది. రెండు వందల అడుగుల పొడవు, నూట యాభై అడుగుల వెడల్పు, డెబ్బై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ మ్యూజియం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ మ్యూజియం కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలో ఉంది. ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్‌ సెంటర్‌ అంటారు. ఈ మ్యూజియం ఉన్న కొండ ప్రదేశాన్ని జటాయు నేచర్‌ పార్క్‌ అంటారు.

జటాయు పుర
జటాయు నేచర్‌ పార్క్‌... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో కీలక పాత్ర జటాయువుది. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. నేచర్‌ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్‌ మ్యూజియమ్‌ ఉంది. లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మాణం లోపల జటాయువు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్‌ ఫంక్షనల్‌ స్టాచ్యూ ఆఫ్‌ ఎ బర్డ్‌’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్‌ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్‌ క్లైంబింగ్, బైక్‌ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్‌ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్‌ సిటిజెన్‌ అందరికీ ఈ టూర్‌ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది.

రామాయణం గొప్పదనం ఇదే
వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు. శిల్పకారుడు రాజీవ్‌ ఆంచల్‌ నిర్మించాడు. సీతాపహరణం సమయంలో రావణాసురుడిని అడ్డగించిన జటాయువును రావణాసురుడు సంహరించాడని రామాయణం చెబుతుంది. ఈ ఘట్టానికి వేదిక ఈ జటాయుపుర అని కేరళవాళ్లు చెప్పుకుంటారు. తెలుగు వాళ్లుగా మనం అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా చెప్పుకుంటాం. రామాయణం గొప్పదనం అది. దేశం అంతటా ప్రతి ఒక్కరూ కథను స్వాగతిస్తూ ఐడింటిఫై అవుతారు.

జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్‌ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement