తల్లీ బెలైల్లినాదో..
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బోనాలు గోల్కొండలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో, బోనాలనెత్తుకున్న మహిళలతో తెలంగాణ ప్రజల సంసృ్కతి సంప్రదాయాలకు అద్దం పట్టెలా అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి.
గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీజగదాంబిక అమ్మవారికి మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలతో కోట పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారికి సమర్పించడానికి ఊరేగింపుగా తెచ్చిన తొట్టెలకు జనం తండోప దండాలుగా వచ్చి మొక్కారు.
కోటలో శివసత్తుల పూనకాలు చూడడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ కోటపైకి ఎక్కారు. అంతేకాకుండా 23 కుల వృత్తుల వారు అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందించారు. తెలంగాణలో ప్రారంభమయ్యే మొట్టమొదటి బోనాల ఉత్సవం ఇక్కడే ప్రారంభమై 9 పూజల అనంతరం ఇక్కడే ముగుస్తుంది.