బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు గ్రామీణ యువత పోటీపడుతోంది. బోనాల పండుగ పురస్కారించుకుని అమ్మవారికి తొట్టెలను సమర్పించే కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు తూప్రాన్ యువజన సంఘాల వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తొట్టెల ఏర్పాట్లు, పోతరాజులు, బ్యాండు, న్యత్య కళాకారులు, వివిధ ఆకృతులతో కూడిన దేవతామూర్తుల విగ్రహాల ప్రదర్శనకు ముందస్తుగానే అడ్వాన్సులు చెల్లిస్తున్నారు.
ఇందుకుగాను రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బ్యాండు కోసం రూ.60 వేలు, పోతరాజులు, శివసత్తుల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి 15 వేలు, నృత్యకారులకు రూ.1,500 చొప్పున దేవతామూర్తుల విగ్రహల ప్రదర్శన కోసం విగ్రహానికి ఉన్న డిమాండ్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతోంది. జిల్లాలోనే తూప్రాన్ మండల కేంద్రంలో జరిపే బోనాల పండుగ కు మంచి పేరుంది. ఆరేళ్ల క్రితం డీజే సౌండ్ సిస్టంతోపాటు మహిళా డ్యాన్సర్లను రప్పించారు.
అయితే, పోలీసులు అభ్యంతరం చెప్పటంతో బ్యాండు మేళాల వైపు మళ్లారు. అప్పటి నుంచి ఏటా వివిధ హంగులతో అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఏటా 15 సంఘాల వరకు ఉత్సవాల నిర్వహణలో పాల్గొనేవారు. అయితే హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ముగిసిన అనంతరమే ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.
కాని, ఈ ఏడు సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల రోజునే తూప్రాన్‌లో ఈ నెల 31న నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. అయితే, ఒకే రోజున సికింద్రాబాద్, తూప్రాన్‌లో నిర్వహిస్తుండంతో బ్యాండుమేళాలు, నృత్యకళాకారులకు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే రెండింతలు ఎక్కవ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని యువజన సంఘాల వారు వాపోతున్నారు. ఏది ఏమైనా బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.