రామకృష్ణామృతం
పలుకు బంగారం
రామకృష్ణులు చాలా గొప్ప గురువు. ఎంతో క్లిష్టమైన ఆధ్యాత్మిక, వేదాంత సత్యాలను సైతం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చక్కటి కథలు, సూక్తుల రూపంలో చెప్పేవారు. తిథుల ప్రకారం మార్చి 10న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన పలుకు బంగారాలు కొన్ని...
యావత్ప్రపంచాన్నీ భగవన్మందిరంగానూ, అందులో ఉన్న ప్రతిజీవినీ భగవత్స్వరూపంగా భావించి వారిని సేవించాలి.తన దోషాన్ని తాను తెలుసుకోవడం మానవత్వం. తప్పును ఒప్పుగా కప్పిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నం దానవత్వం. ఆలోచనలే మనల్ని ముందుకు నడిపించే శక్తులు. అత్యున్నతమైన భావాలతో హృదయాన్ని నింపుకొన్ననాడు ప్రపంచాన్నే జయించగలం. చంద్రునిలో మచ్చలు ఉన్నాయి కానీ వాటివల్ల చంద్రుని ప్రకాశానికి లోటేమీ లేనట్లే గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికి దేహం మీద కొన్ని మచ్చలు పడవచ్చు. కానీ వాటితో అతడికి కలిగే నష్టమేమీ లేదు.
ప్రాపంచిక విషయాలు మనముందు ఈ క్షణంలో కనిపించి, మరుక్షణంలో మాయమైపోతాయి. నా వారు అని భావించేవారు కనుమరుగైపోతారు. పరమ పావనమైన భగవన్నామంపై సంపూర్ణ విశ్వాసముంటే, నిరంతర నామస్మరణతో మనస్సు రమిస్తే అలాంటి వ్యక్తి ముందు స్వయంగా ఆ భగవంతుడే సాక్షాత్కరిస్తాడు. సంసారమనే మహాసాగరాన్ని దాటేందుకు అరిషడ్వర్గాలే కెరటాలు. తుఫానులుగా ఆటంకపరుస్తాయి. భగవంతుణ్ణి నమ్మిన భక్తులకు అవే సంసార నావకు తెరచాపగా, తెడ్డుగా, నావను నడిపే సరంగుగా, లంగరుగా దరిచేరుస్తాయి.
- డి.వి.ఆర్.