దేవునికి మతం ఉందా?
శరీర ఎదుగుదలకు మానవునికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మ బలపడడానికి ఆధ్యాత్మికత అంతే అవసరం. శారీరక ఆరోగ్యం గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. జిహ్వ చాపల్యం కారణంగా కోటానుకోట్ల వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిత్యం తయారవుతూనే ఉన్నాయి. కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, రచనలు, ప్రబోధాలు, భజనలు, వాటి స్ఫూర్తితో చేసే మంచి పనులు... ఇవన్నీ ఆధ్యాత్మి ఆహారాలే. శారీరక రగ్మతలను అధిగమించడానికి శారీరక దృఢత్వం దోహదపడుతుంది. అలాగే కనిపించని సమస్యలను, మానసిక ఒత్తిళ్లను జయించడానికి ఆధ్యాత్మిక బలం అవసరం. నేడు మనం ఎదుర్కొనే శారీరక సమస్యల కన్నా, మానసిక సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకత్వమే.ఇది కేవలం మానవునిలో ఆధ్యాత్మిక బలం తగ్గిపోవడం వల్లనే.
మతాలు వేరయినా, మానవజాతి ఒక్కటే. అన్ని మతాలూ మంచినే బోధిస్తాయి. దేవునికంటే మతమేదీ లేదు. నాది ఫలానా మతం అని దేవుడు ఎన్నడూ, ఎవరితోనూ చెప్పలేదు. ఏ మతగ్రంథంలోనే అలా అని రాసి లేదు. దేవుడు నిజానికి, మతాలకు అతీతంగా మానవ జాతినంతటినీ ప్రేమిస్తున్నాడు. మతాన్ని బట్టి కాక, వారి నిష్కల్మషమైన హృదయాన్ని బట్టి దేవుడు వారిని ప్రేమిస్తాడు.
కాబట్టి ఒకరినొకరు మతం పేరిట నిందించుకోకుండా, సత్యాన్ని గ్రహించి, ఒకరి పట్ల ఒకరు సమాధానంగాను, దేవుని పట్ల భక్తిగానూ మెలిగినప్పుడు ఈ భూలోకమే స్వర్గంగా మారుతుంది. అలాగైతే స్వర్గాన్ని మరణానంతరమే కాకుండా జీవించి ఉండగానే వీక్షించవచ్చు.
- యస్.విజయభాస్కర్