హోలీ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా? | Holi Festival Special Story In Telugu | Sakshi
Sakshi News home page

హోలీ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Mar 28 2021 7:38 AM | Updated on Mar 28 2021 7:59 AM

Holi Festival Special Story In Telugu - Sakshi

చతుర్దశినాడు కామ దహనం జరిపి, పశ్చాత్తాపంతో పరిశుద్ధుడైన పంచబాణుడిని పౌర్ణమినాడు మళ్లీ ఆహ్వానించి, అర్చించుకోవటం చాలా ప్రాంతాలలో సంప్రదాయం.

హోలీ పండుగను రెండు భాగాలుగా జరుపుకోవటం ఆనవాయితీ. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు ముక్కంటి తన కంటి మంటతో కాముడిని కాల్చివేశాడనీ, దేవతల ప్రార్థనలు మన్నించి, ఫాల్గుణ పౌర్ణమినాడు మన్మథుడికి మళ్లీ ప్రాణం పోశాడనీ ఒక గాథ. కనుక చతుర్దశినాడు కామ దహనం జరిపి, పశ్చాత్తాపంతో పరిశుద్ధుడైన పంచబాణుడిని పౌర్ణమినాడు మళ్లీ ఆహ్వానించి, అర్చించుకోవటం చాలా ప్రాంతాలలో సంప్రదాయం.

కామదహనంలో దహించబడే మన్మథుడు ఒక వ్యక్తి కాదు. కామం అనే శక్తికి ప్రతీక. కామం అంటే కోరిక. విషయ వాంఛ. ఇంద్రియ, మనస్సంబంధమైన కోరికలన్నీ కామమే. కోరిక హద్దులో అదుపులో ఉన్నంతసేపూ, ధర్మ విరుద్ధం కానంతసేపూ తప్పులేదు. కోరికలు తృప్తిపరచుకోవటం పురుషార్థాలలో ఒకటి. కానీ కోరికను అదుపులో ఉంచలేని వారి మనోబుద్ధులను, కోరికే తన అదుపులోకి తీసేసుకుని, విచక్షణను నాశనం చేసి, వినాశనానికీ విషాదాంతాలకూ దారి తీస్తుంది.

విజితేంద్రియుడైన విశ్వేశ్వరుడి ముందు విజృం భించబోయి పుష్పబాణుడు బూడిదయ్యాడు.  కామాన్ని నియంత్రించగల వాడే కామ పురుషార్థాన్ని అర్థవంతంగా అనుభవించగలడు. కామానికి స్థానమే లేని జీవితం నిస్సారం, నిస్తేజం, కళా విహీనం. కామమూ, కాముడూ మనసులోకే రాని మను గడ, మనుగడ కాదు.. మరుభూమి. కానీ మనసును విశృంఖలమైన కామాలకు వశం చేసిన బతుకూ, బతుకు కాదు.. బానిసత్వం. మనసు లోకి ప్రవేశించి ఉత్సాహమూ, ఉల్లాసమూ కలిగించే కామం మనిషి వశంలో ఉన్నంతసేపూ–ఉన్నంతసేపే!

‘మార! మా–రమ–మదీయ–మానసే/ మాధవైక నిలయే...’ అంటుంది కృష్ణ కర్ణామృతంలో గోపిక. ‘మన్మథుడా! మాధవుడి నిల యమైన మదీయ మానసంలో, నీ ఇష్టం వచ్చినట్టు విహరించాలను కోకు! ఎందుకని?... ‘ఆ లక్ష్మీపతి చటుక్కున ఎప్పుడైనా వచ్చేయ గలడు. (నిన్ను గట్టిగా దండించనూ గలడు). తన సొంత ఇంట్లో మరొ కడు దూకి తందనాలాడుతుంటే ఎవరు ఊరుకొంటారు?’ ఎంత మంచి భావన! గోపికలే కాదు, భక్తులందరూ చెప్పాల్సిన మాట!
– ఎం. మారుతి శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement