‘ఆళ్వారు’ అంటే, రక్షకుడు, భగవంతుని దూత, యోగి, పరమయోగి, భక్తి జ్ఞానమనే సాగరంలో మునిగి తేలినవారని అర్ధాలున్నాయి. ఆళ్వార్ల పరంపరలో మొట్టమొదటిగా అవతరించిన ఆళ్వార్లు పొయ్గై ఆళ్వారు. తరువాత పుదత్తాళ్వారు, పేయాళ్వార్లు జన్మించి శ్రీ మహావిష్ణువును ఆరాధించి, తమ సంకీర్తనల(పాశురాలు) ద్వారా వైష్ణవ సాంప్రదాయనికి ప్రాచుర్యం కలిగించి ముందు తరాలకి ఆధ్యాత్మిక బాటనిపరిచి తరించిన మహనీయులు. ఈ ముగ్గురూ ముదలాళ్వారులు(మొదటి ఆళ్వారులు)గా ప్రసిద్థికెక్కారు. మొత్తం పన్నెండుమంది ఆళ్వార్లు ఈ నేలపై జన్మించి విష్ణుభక్తితో తాము తరించి, జనులని తరింపచేసారు. వీరినే పన్నిద్దరాళ్వారులంటారు. వీరిలో ఆండాళ్ తల్లి మాత్రమే స్త్రీమూర్తి, మిగిలిన పదిన్నొక్క ఆళ్వార్లూ పురుష యోగులు కావడం విశేషం. అయితే మొత్తం పన్నెండుమంది ఆళ్వార్లూ క్రీ.శ.719–836 సంవత్సరాల మధ్య జన్మించిన వారే అని చరిత్రకారుల వాదన. ఈ లెక్కప్రకారం మొదలాళ్వారులు ముగ్గురూ క్రీ.శ.719లో జన్మించినవారిగా భావించవచ్చు.
భగవంతుడి లీలలు ఎంత విచిత్రమో చూడండి. మొదలాళ్వారులైన పొయ్గై ఆళ్వారు, పుదత్తాళ్వారు, పేయాళ్వారు ముగ్గురూ ఒక్కొక్కరోజు తేడాతో ఈ ధరిత్రిపై ద్రవిడ దేశాన వేర్వేరు ప్రాంతాల్లో తన దూతలుగా జన్మింపజేయడం ఆ పరమాత్ముడి లీలకాకా మరేమిటి? ఈ మొదలాళ్వారులని యోగిత్రయం అని కూడా పిలుస్తారు. ఆళ్వార్లలో మొట్టమొదటి వారైన పొయ్గై ఆళ్వారు మహావిష్ణువు పాంచజన్యం ఆంశంతో కంచీపురంలో వుండే ఓ దివ్యసరోవరంలో కాంచన పద్మనుండి ఉద్భవించారు. వీరికి సరోయోగి, కాసారయోగి అనే పేర్లు కూడా వున్నాయి. విష్వక్సేనులంతటి వారితో పంచసంస్కారాలు చేయించుకున్నారు. ఆ శ్రీమన్నారాయణుడే, వెంకటాద్రిపై కొలువున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడనీ, ఈతనిని ధ్యానించినంత మాత్రానే అందరిని కరుణిస్తాడని ఆ శ్రీవారిని మంగళాశాసనం చేసారు.
రెండవ ఆళ్వారులైన పూదత్తాళ్వారు లేక భూతయోగి శ్రీ మహావిష్ణువు కౌముదీ ఆంశంతో పొయ్గై ఆళ్వారు పుట్టిన మరుసటి రోజు మహాబలిపురంలో జీవంతి పువ్వు నుండి పుట్టారు. వీరు బ్రహ్మముద్ర గల దివ్యయోగులు. ఈతడు తిరుమల శ్రీవేంకటేశ్వరుణ్ణి పదకొండు పాశురాలతో మంగళాశాసనం చేసారు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా అవతరించి, రావణాసురుడిని వధించిన ఆ మహాత్ముడే కలియుగాన శేషాచలంలో శ్రీవేంకటేశ్వరునిగా నీరాజనాలు అందుకుంటున్నారని కీర్తించారు.ఇక యోగిత్రయంలో మూడవవాడైన పేయాళ్వారు శ్రీమహావిష్ణువు ఖడ్గాంశంతో జన్మించారు. వీరు పూదత్తాళ్వారు పుట్టిన మరుసటిరోజే జన్మించడం విశేషం. వీరు చెన్నపట్నం శెల్వకేశవస్వామి ఆలయంలో మణికైరవ తీర్ధం (బావి)లో ఎర్రకలువ నుండి పుట్టారు. పేయ్ అంటే పిచ్చి, భ్రమలాంటి అర్థాలున్నాయి. నిత్యం భగవన్నామ స్మరణలో తనని తాను మరచిపోయి సామాన్య మానవులకి భిన్నంగా ప్రవర్తించటంతో వీరికి ఆ పేరు వచ్చింది. ఇతడిని మహాయోగి అని కూడా పిలిచేవారు. ఆదివరాహ క్షేత్రమైన తిరుమలలో వున్న వరాహ నరసింహస్వామిని ఈతడు పదిపాశురాలతో మంగళాశాసనం చేసారు.
అందులో ముఖ్యమైనది – ‘మదపుటేనుగులు తమలో తాము పోరాడుతూ, తళ తళ మెరిసే రాళ్ళలో ప్రతిబింబించే తమ రూపాలని చూసుకుని వేరే ఏనుగులని భ్రమిస్తూ తమ దంతాలలోని ముత్యాలని ఆ వెంకటాద్రిపై కురిపిస్తుంటాయి. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు వరహునిగా తన కొమ్ములతో సముద్రం నుండి భూమిని కాపాడిన ఆ శ్రీహరే నేటి పవిత్రమైన ఈ వెంకటాద్రిపై కొలువున్న ఈ ‘వరాహుడంటూ’ కీర్తించారు.
ఈ ఆళ్వార్లు ముగ్గురూ విష్ణుభక్తులై, ద్రావిడ దేశంలో వైష్ణవ క్షేత్రాలని సందర్శిస్తూ దేశ సంచారం చేసేవారు. పోయ్గై ఆళ్వారు విష్ణువుని నూరు పాశురాలతో కీర్తించిన ప్రబంధమే ముదల్ తిరువన్దాది. పూదత్తాళ్వారు నూరు పాశురాలతో కీర్తించిన ప్రబంధం ఇరణ్ణాం తిరువన్దాది, పేయాళ్వారు వంద పాశురాలతో కీర్తించిన ప్రబంధం కమున్ణాం తిరువన్దాది అనే పేర్లతో ద్రావిడనాట ప్రసిద్ధికెక్కాయి. పన్నిద్దరు ఆళ్వారుల మొత్తం 24 దివ్య ప్రబంధాలు, శ్రీ రామానుజుల నూత్తందాది ప్రబంధంతో కలిపి మొత్తం 25 దివ్య ప్రబంధాలని నాలాయిర దివ్య ప్రబంధంగా ద్రవిడనాట ప్రసిద్ధికెక్కాయి. ఈ నాలాయిర ప్రబంధంలో మొత్తం నాలుగువేల పైచిలుకు పాశురాలుండటం గమనార్హం.
‘భగవద్గుణంగళిల్ ఆళంగార్ పట్టవరగళ్ ఆళ్వార్ గళ్’ అని వైష్ణవ ఆచార్యుల నిర్వచనం. భగవంతుని సుగుణాలని నిత్యం అనుభవిస్తూ తన్మయం చెందేవారే ఆళ్వారులు. వైష్ణవ వాఙ్మయం ఈ మొదలళ్వార్లతో ప్రారంభింపబడి ద్రవిడనాట మిక్కిలి ప్రసిద్ధికెక్కింది. ఆ తరువాత జన్మించిన తొమ్మిది మంది ఆళ్వారులేగాక సాక్షాత్ శ్రీమద్రామానుజాచార్యులు కూడా తమ విశిష్టాద్వైతంతో మొత్తం భారతదేశంలో వైష్ణవమతానికి బహుళ ప్రాచుర్యం కలిగించడంలో ముదలళ్వారులు వేసిన భక్తిబాట ఎంతో తోడ్పడింది.
– కారంపూడి వెంకట రామదాస్
Comments
Please login to add a commentAdd a comment