
ఆధ్యాత్మిక పరిణతి!
ఆత్మీయం
ఆధ్యాత్మికత అంటే అందరికీ అనేక సందేహాలు, భావనలు ఉంటాయి. అయితే ఈ పని చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అందుకని ఈ పని చేయను. శక్తి లేక కాదు. ఈ గొలుసు ఎవరిదీ అని అడిగి ఇచ్చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. జేబులో వేసుకుంటే సంతోషించడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడన్నది మన నమ్మకం. అంతే. ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాం. ఏది చేస్తే ఇంటిలోని వాళ్లు బాధపడతారో అది చేయం. ఏది చేస్తే పెద్దలు సంతోషిస్తారో అది చేస్తాను. అదే ఆధ్యాత్మికత. అది క్రమక్రమంగా పరిణతి చెందాలి. పరిణతి చెందడమంటే... దేవుడున్నాడని నమ్మింది నిజమైతే, ఆయన మనకు ఇన్ని శక్తులిచ్చాడన్నది నిజమైతే దేవుడున్నాడని అందరూ అనుకునే ఆలయానికి వెళ్లకుండా ఉండగలమా?
ఆయనకు ఓ పండు నైవేద్యం పెట్టకుండా ఉండగలమా? ఆయనని అందరిలో చూడకుండా ఉండగలమా? భగవంతుడి ప్రీతికోసం ఆర్తుల సేవ చేయకుండా ఉండగలమా? డబ్బుంటే ఏదైనా ఓ గుడిలో అన్నదానం చేయకుండా ఉండగలమా? మనకు ఎప్పుడు అవకాశం వచ్చినా, భగవంతుడి కోసం, పదిమందిని సంతోష పెట్టడం కోసం బతకడం రావాలి. ఆధ్యాత్మిక పరిణతి అంటే అదే!