కాయకమే కైలాసం... శ్రమయే శివనిలయం | Basaveshwara Spiritual Contribution To Veerashaiva | Sakshi
Sakshi News home page

కాయకమే కైలాసం... శ్రమయే శివనిలయం

Published Thu, May 13 2021 7:50 AM | Last Updated on Thu, May 13 2021 7:50 AM

Basaveshwara Spiritual Contribution To Veerashaiva - Sakshi

కర్ణాటకలోని హింగులేశ్వర బాగేవాడి అగ్రహారంలో 1134వ సంవత్సరం వైశాఖ శుద్ధతదియ (అక్షయ తతీయ) రోజున మండెన మాదిరాజు, మాతాంబిక దంపతులకు బసవేశ్వరుడు జన్మించాడు.

ఈయన వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు. ఆయనకు భక్తి బండారి అనే మరొక పేరు కూడా ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. కులతత్వ నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం మొదలైన నూతన సంప్రదాయ యుగానికి ఆయన నాంది పలికాడు. బసవన్న రాసిన నాలుగు లక్షలకు పైబడిన వచనాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా నేడు కొన్ని మాత్రం ప్రజలనాల్కలపై ఆడుతూ సజీవంగా నిలిచి ఉన్నాయి.

సమాజంలోని అన్ని వర్గాలప్రజలూ దైవంతో వారికున్న అనుభవాల్ని పంచుకోవడానికి అల్లమప్రభువులవారి అధ్యక్షతన అనుభవమండపాన్ని ఏర్పరచారు. తన ఆరాధ్యదైవమైన కూడలసంగమేశ్వరుడే తన వచనాలకు మకుటంగా మార్చుకుని కీర్తించాడు. ఆ వచనాలు రాసి కొన్ని శతాబ్దాలు దాటినా నేటికీ నిత్యనూతనం. 

దయలేని ధర్మమదేవిటయ్యా దయయే కావాలి ప్రాణులన్నిటిలో
దయయే ధర్మం మూలమయ్యా కూడలసంగముని వంటీ దైవం లేదయ్యా

సిగ్గొదిలి అన్యులను యాచించకుండా మతిచెడి పరులను పొగడకుండా 
పరసతులపై మనసు పడకుండా శివపథభక్తుల పాదాలు విడువకుండా 
వేరుమార్గంలో నా నడక సాగకుండా నన్ను నడిపించు కూడలసంగమదేవా

ఉన్నవాళ్లు గుళ్లు గోపురాలు కట్టిస్తారు లేనివాణ్ణి నేనేమి చెయ్యాలి? 
నా కాళ్లే స్తంభాలు కాయమే కోవెల 
శిరసే బంగారు శిఖరం కూడలసంగమదేవా!
విను చెడితే స్థావరం చెడుతుంది గాని
జంగమం చెక్కు చెదరదు

దొంగిలించకు చంపకు అబద్ధం పలుకకు కోపగించుకోకు
అన్యులను ఏవగించుకోకు నీ గురించి పొగుడుకోకు
ఎదుటి వ్యక్తిని నిందించకు ఇదే అంతరంగ శుద్ధి
ఇదే బహిరంగ శుద్ధి ఇదే మా కూడలసంగమదేవుని మెప్పించే పద్ధతి

దేవలోకం మర్త్యలోకం వేరే వేరే లేవు 
సత్యాన్ని పలికేదే దేవలోకం
అసత్యాన్ని పలికేదే మర్త్యలోకం ఆచారమే స్వర్గం
అనాచారమే నరకం కూడలసంగమదేవా 

–కె.వి.ఎస్‌. బ్రహ్మాచార్య, శాస్త్ర ప్రవీణ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement