సత్యానికి పట్టం కట్టిన హరిశ్చంద్రుడు | DVR Bhaskar Devotional Article On King Harishchandra | Sakshi
Sakshi News home page

సత్యానికి పట్టం కట్టిన హరిశ్చంద్రుడు

Published Sat, Jan 2 2021 8:34 AM | Last Updated on Sat, Jan 2 2021 8:34 AM

DVR Bhaskar Devotional Article On King Harishchandra - Sakshi

హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః అంటే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు. పురాణాలు వీరిని అత్యంత విశిష్ఠులైనవారిగా కీర్తించాయి. అటువంటి వారి గురించి తెలుసుకోవడం స్ఫూర్తిదాయకం. ముందుగా హరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందాం. 

సత్యసంధతలో ఆదర్శవంతమైన వాడు, మానవాళికంతటికీ మార్గదర్శకుడు హరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడి కథ మార్కండేయ పురాణంలో ఉంది. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. సూర్యవంశ రాజుల్లో సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీ వ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సంఘటన హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలకు గురిచేసి, మరెన్నో మలుపులు తిప్పింది. అదేమంటే... ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాడని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు. 

అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందనీ, ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర లేదని, తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, రెండోసారి పెళ్లిచేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి, సున్నితంగా ఆ కన్యలను పంపించాడు. విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటపెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరిక తీర్చమన్నాడు.

తన రాజ్యాన్నయినా వదులుకుంటాను కానీ, ఏకపత్నీవ్రతాన్ని విడిచి పెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు హరిశ్చంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపొమ్మన్నాడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుడిని వేడుకున్నాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి నక్షత్రకుడు అనే తన శిష్యుడిని  పంపాడు. హరిశ్చంద్రుడి వెనుకనే బయలు దేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలపాలు చేశాడు. ‘సొమ్ము ఇస్తానని అనలేదు అని’ ఒక్క అబద్ధం చెబితే చాలు, తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలనుభవిస్తూ చివరకు కాశీ నగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. 

హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది. అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. దాంతో కుమారుడికి  అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకొని చంద్రమతి శ్మశానికి వెళ్లింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా, కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే, కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుబట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనంది చంద్రమతి. అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరెవరికీ కనపడదని, అది తనకు వరమని కనుక కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయివుంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా హరిశ్చంద్రుడికి చెప్పింది.

ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి, అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను తరుముకు రాసాగారు. ఆ దొంగలు పరుగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్యచేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు.

రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజాజ్ఞను అమలు పరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోయాడు. విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి రుషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. విశ్వామిత్రుడు తాను ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చంద్రుడిగా పేరు పొందాడు. 
- డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement