క్రోధమనే చెడ్డగుణం రూపం లేని అరిషడ్వర్గాలనే ఆరు శత్రువుల్లో రెండవది. దానిని కోపంగా, కినుకగా, అలుకగా సందర్భానుసారం వాడుతూ ఉంటారు. క్రోధానికి గురయినవారు ఎదుటివారి మనస్సును నిష్కారణం గా బాధిస్తారు. మనిషి చేసే ఆలోచన, మాట్లాడే మాట ప్రయత్నించే పని క్రోధపూరితంగా ఉండకూడదు. క్రోధంతో ఇంటా బయటా గౌరవాన్ని కోల్పోవడమే కాక శారీరకంగా మానసికంగా వచ్చే భయంకరమైన దీర్ఘరోగ బాధలను కూడా భరించవలసి వస్తుంది.
కామం, క్రోధం, లోభం ఆదిగాగల చెడ్డగుణాలు పాప కార్యాలను స్పష్టించే పరమశత్రువులని మనస్సు ను కలుషితం కావించి బుద్ధివికాసాన్ని చెరచి జ్ఞానమనే చక్కని సంపదను నశింప చేస్తాయని వేదాంతసారమైన భగవద్గీత, ఇతర ఆత్మజ్ఞాన గ్రంథాలు బోధిస్తున్నాయి. తనమాట వినలేదని వినుగుచెంది కోపాన్ని ఆపుకోలేక హిరణ్యకశిపుడు పుత్రుడయిన ప్రహ్లాదుణ్ణి నానాహింసలు పెట్టి ఉగ్రనరసింహుని చేతిలో హతుడయ్యాడు.
తన వికృతచేష్టలను చూసి సీతమ్మ నవ్విందని కోపించిన శూర్పణఖ ఆమెను మింగబోయి లక్ష్మణుని వల్ల ముక్కు చెవులు కోల్పోయింది. ఇలా ఎంతోమంది క్రోధావేశాలకు గురయి మానప్రాణాలకు ముప్పు తెచ్చుకొన్నారు. అందుకే మృదువుగా సంభాషించడం, ఇతరులను హింసించకుండా ఉండటం సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడం, తొందరపాటును నివారించుకొనడం, సత్పురుషుల సావాసం చేయడం, మనస్సును నియంత్రించుకోవడానికి యోగసాధన సల్పడం వల్ల జీవితాన్ని బంగారు మయంగా గడపగలం.
– విద్వాన్ వల్లూరు చిన్నయ్య
Comments
Please login to add a commentAdd a comment